కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలి

ABN , First Publish Date - 2022-06-30T05:15:22+05:30 IST

దేశ సమగ్రతను దెబ్బ తీస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలను తిప్పి కొట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బోస్‌ అన్నారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలి
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి బోస్‌

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బోస్‌

- జిల్లా కేంద్రంలో సీపీఐ జిల్లా మూడో మహాసభ

సిరిసిల్ల టౌన్‌, జూన్‌ 29: దేశ సమగ్రతను దెబ్బ తీస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలను తిప్పి కొట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బోస్‌ అన్నారు. బుధవారం సిరిసిల్ల పట్టణం సుభాష్‌నగర్‌ నుంచి గాజుల మల్లయ్య ఫంక్షన్‌హాల్‌ వరకు సీపీఐ ఆధ్వర్యంలో ఎర్రజెండాలతో భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం గాజుల మల్లయ్య ఫంక్షన్‌ హాల్‌లో సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు అధ్యక్షతన సీపీఐ జిల్లా మూడో మహాసభ జరిగింది. ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బోస్‌ పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోది ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. కేంద్రం పరిధిలోని అన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తూ చివరికి రక్షణ రంగంలో కూడా ప్రైవేటు కంపెనీలకు అప్పగించే పరిస్థితిని తీసుకువచ్చిందని ఆరోపించారు. పార్లమెంట్‌లో చర్చ లేకుండా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంను తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను పూర్తిగా హరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు పోరాటాలతోనే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు మాట్లాడుతూ కులం, మతం, జాతీయత పేరుతో బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా నాయకులు సామల మల్లేశం, పంతం రవి, పోలు కొమరయ్య, బూర శ్రీనివాస్‌, యెలిగేటి రాజశేఖర్‌, కడారి రాములు, మంత్రి చంద్రయ్య, అజ్జ వేణు, ఒగ్గు గణేష్‌, మంచికట్ల రమేష్‌, అంగూర్‌ రంజిత్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-30T05:15:22+05:30 IST