కేంద్రం మెడలు వంచే అవకాశం ఇదే!

ABN , First Publish Date - 2022-06-18T05:50:03+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంచి అవకాశం వచ్చింది. ఏ అవకాశం వచ్చినా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని ఆయన గతంలో ప్రజలకు హామీ ఇచ్చారు.

కేంద్రం మెడలు వంచే అవకాశం ఇదే!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంచి అవకాశం వచ్చింది. ఏ అవకాశం వచ్చినా కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని ఆయన గతంలో ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల రూపంలో ప్రత్యేక హోదా సాధించుకునే అద్భుత అవకాశం వచ్చింది. వైకాపాకు 151మంది ఎమ్మెల్యేలు, 31 మంది ఎంపీలు ఎలక్టోరల్ ఓటర్లుగా ఉన్నారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఎన్‌డిఏ అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే వైకాపా మద్దతు అవసరం అని చెబుతున్నారు. కాబట్టి వైకాపా మద్దతు లేకుండా ఎన్‌డిఏ అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికయ్యే పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఏ అభ్యర్థికి మద్దతు ఇస్తామని డిమాండ్ చేసి హోదా సాధించే సువర్ణావకాశం వైకాపాకి వచ్చింది.


ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని, హోదా తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ప్రజలను, యువతను జగన్ ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు రెచ్చగొట్టారు. హోదానే రాష్ట్రానికి సంజీవిని అన్నారు. హోదా కోసం ఎంతదాకా అయినా పోరాడుతానన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదాపై జగన్‌రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో రాష్ట్రపతి ఎన్నికల ద్వారా రుజువు చేసుకొనే అవకాశం వచ్చింది. రాష్ట్ర విశాల ప్రయోజనాలకు, యువత ఉద్యోగ, ఉపాధికి ఉపకరించే ప్రత్యేక హోదా కోసం పట్టుపట్టే అవకాశం జగన్‌రెడ్డికి వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. లేకుంటే గతంలో ప్రత్యేక హోదాపై చేసిన గర్జనలు అన్ని ఉత్తుత్తి గర్జనలు గానే ప్రజలు పరిగణిస్తారు. నిజంగా సీబీఐ కేసులకు భయపడకపోతే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఏ అభ్యర్థికి వైకాపా మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. బిజెపి, వైకాపాకి పొత్తు లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతారు?


జగన్‌రెడ్డికి వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తారో, లేక సొంత ప్రయోజనాల కోసం తానే వంగిపోయి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడతారో జగన్మోహన్ రెడ్డే తేల్చుకోవాల్సి ఉంది. 


– నీరుకొండ ప్రసాద్

Updated Date - 2022-06-18T05:50:03+05:30 IST