కేంద్రానిది చిల్లర వ్యవహారం

Published: Thu, 19 May 2022 02:57:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కేంద్రానిది చిల్లర వ్యవహారం

  • రాష్ట్రాలను కాదని పల్లెలకు నేరుగా నిధులు
  • తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది
  • బాయిల్డ్‌ రైస్‌నూ ఎంత ఖర్చయినా కొంటాం
  • ‘దళితబంధు’ను దశలవారీగా అమలు చేయాలి
  • పల్లెలు, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నాం
  • వైకుంఠధామాల పనులు పూర్తిచేయాలి: సీఎం 
  • పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై కేసీఆర్‌ సమీక్ష
  • వచ్చే నెల 3కు పల్లె, పట్టణ ప్రగతి వాయిదా


హైదరాబాద్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాలను నమ్మకుండా కేంద్ర ప్రభుత్వమే పల్లెలకు నేరుగా నిధులను పంపించడం చిల్లర వ్యవహారంలా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. నాటి రాజీవ్‌గాంధీ నుంచి నేటి దాకా ప్రధాని పదవిలో ఉన్నవారు రాష్ట్రాలను నమ్మడం లేదని ఆక్షేపించారు. స్థానిక సమస్యలు రాష్ట్రాలకే తెలుస్తాయని, కానీ.. కేంద్ర పథకాలను నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదని అన్నారు. రోజువారీ కూలీల డబ్బును కూడా ఢిల్లీ నుంచే పంచాలనుకోవడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలుకు చేపట్టాల్సిన కార్యాచరణతోపాటు, బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌-వెజ్‌ మార్కెట్ల నిర్మాణాలు, వరి ధాన్యం సేకరణ, జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ తదితర అంశాలపై బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. వివిధ అంశాల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘పంచాయతీరాజ్‌ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత.. రాష్ట్రాలను నమ్మకుండా, కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లరగా ఉంది. జవహర్‌ రోజ్‌గార్‌ యోజన, ప్రధాని గ్రామ సడక్‌ యోజన, నరేగా వంటి పథకాలను కూడా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదు’’ అని కేసీఆర్‌ అన్నారు. 75 ఏళ్ల అమృత మహోత్సవాల నేపథ్యంలో దేశంలో ఇంకా కరెంటు లేక పల్లెలు, పట్టణాలు చీకట్లలో మగ్గుతున్నాయని, తాగునీరు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యంతోపాటు అనేక రంగాల్లో రావాల్సినంత ప్రగతి రాలేదని, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టకుండా.. రాష్ట్రాల విధుల్లో జోక్యం చేసుకోవాలనుకోవడమేంటని అన్నారు. 

తడిసిన ధాన్యాన్నీ కొంటాం..

రాష్ట్రంలో తడిసిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. బాయిల్డ్‌ రైస్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం కొన్నా, కొనకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని పునరుద్ఘాటించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే కొనసాగుతున్న ధాన్యం సేకరణ వివరాలను సీఎం ఆరా తీశారు. ఇక భవిష్యత్తు తరాలు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడేలా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 19 వేల గ్రామాలు, 5వేల వార్డుల్లో మొత్తం 24 వేల గ్రామీణ క్రీడా కమీటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో క్రీడల నిర్వహణకు ఈ కమిటీలు పని చేస్తాయని తెలిపారు. జూన్‌ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలన్నారు.


ఆవిర్భావ వేడుకల్లో మంత్రులు పాల్గొనాలి..

జూన్‌ 2న నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ఆరోజు సాయంత్రం జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో కవి సమ్మేళనం, పబ్లిక్‌ గార్డెన్స్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలన్నారు. దళిత బంధు పథకాన్ని దశలవారీగా అమలు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఈ ఏడాది నియోజకవర్గానికి 1500 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియను కొనసాగించాలని, పథకం అమలులో మరింత వేగం పెంచాలని అన్నారు. విధ్వంసం తరువాత వ్యవస్థలను పునర్‌నిర్మించుకోవడం చాలా కష్టమైన పని అని సీఎం పేర్కొన్నారు. ఆరు దశాబ్దాల ఉమ్మడి రాష్ట్ర పాలనలో ధ్వంసమైన తెలంగాణను బాగు చేసుకోవడానికి ప్రభుత్వం చాలా కష్టపడాల్సి వస్తోందన్నారు. అన్నింటినీ అధిగమించి నేడు దేశం గర్వించే స్థాయిలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో మొదటి దశలో పదికి పది గ్రామాలు, రెండో దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. 


ఇందుకు కృషి చేసిన పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును, అధికారులను, జిల్లాల కలెక్టర్లను అభినందించారు. ప్రస్తుతం పంచాయతీరాజ్‌ వ్యవస్థలోకి రాజకీయాలు చొరబడటంతో పలుచన అయిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘సురేంద్ర కుమార్‌ డే(ఎ్‌సకే డే) ప్రారంభించిన పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఒక ఉద్యమం. కానీ, నేడు అందులోకి రాజకీయాలు ప్రవేశించడం వల్ల అన్ని రకాలుగా పంచాయతీరాజ్‌ స్ఫూర్తి చంపివేయబడింది. ఇలాంటి నిర్లక్ష్యపూరిత పరిస్థితుల నేపథ్యంలో నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభ దశలో తీసుకున్న నిర్ణయాలు, ఎంచుకున్న ప్రాధాన్య క్రమాలు కొందరికి జోక్‌లాగా కనిపించాయి. కానీ, తెలంగాణలో అన్ని రంగాల్లో జరిగిన అభివృద్ధి గురించి ఇటీవల కొన్ని జాతీయ మీడియా చానెళ్లు ప్రసారం చేశాయి. దీనిని చూసిన ఇతర రాష్ట్రాలవారు నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు’’ అని సీఎం అన్నారు. గతంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ అంటే ప్రత్యేక గౌరవం ఉండేదని, నాటి ముఖ్యమంత్రి విజయభాస్కర్‌రెడ్డి, మంత్రి ఎం.బాగారెడ్డి లాంటివారు మంత్రులు కాకపోతే.. జడ్పీ చైర్మన్లుగా కొనసాగడానికే ఇష్టపడేవారని గుర్తు చేశారు. పంచాయతీరాజ్‌లో జడ్పీ చైర్మన్ల పాత్ర అత్యంత కీలకమైనదన్నారు. 


రాష్ట్రంలో 57 వేల ఆక్సిజన్‌ బెడ్స్‌

రాష్ట్రంలో మొత్తం 10 వేల పడకల సామర్థ్యంతో ఆరు కొత్త మల్టీ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానాలను నిర్మించనున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 57 వేల ఆక్సిజన్‌ బెడ్స్‌ సామర్థ్యం, 550 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే స్థాయి, కరోనా లాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తి తెలంగాణకు ఉన్నాయని అన్నారు. గ్రీన్‌ ఫండ్‌ కాన్సె్‌ప్టను మొట్టమొదటిసారి ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రమే పరిచయం చేసిందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తమ వేతనంలో ప్రతి నెలా రూ.100 నుంచి రూ.500 వరకు కాంట్రిబ్యూట్‌ చేసే విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. స్థానిక సంస్థల నిధుల్లో 10 శాతాన్ని హరితహారానికి కేటాయించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో 2087 ఎకరాల్లో అద్భుతంగా నిర్మించిన పార్కును ఆదర్శంగా తీసుకుని, ఇతర జిల్లాల్లో కూడా అర్బన్‌ పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.  పంటల ఉత్పత్తి, తలసరి ఆదాయంలో ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి దశబ్దాలుగా స్థిరపడిన రాష్ట్రాల కంటే తెలంగాణ అగ్ర భాగాన నిలిచిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. సమీక్ష సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, సీఎంవో అధికారులు, ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


‘పల్లె, పట్టణ ప్రగతి’ జూన్‌ 3కు వాయిదా 

వేసవి ఎండలు విపరీతంగా మండుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి నిర్వహించ తలపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను జూన్‌ 3 నుంచి ప్రారంభించాలని సమావేశం సీఎం కేసీఆర్‌ను కోరింది. ఇందుకు అంగీకరించిన సీఎం.. జూన్‌ 3 నుంచి 15 రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.


పర్యావరణవేత్త తిమ్మక్కకు సన్మానం 

పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ కోసం అహరహం శ్రమించిన పర్యావరణవేత్త, కర్ణాటక రాష్ట్రానికి చెందిన 110 ఏళ్ల తిమ్మక్కను సీఎం కేసీఆర్‌ ఘనంగా సన్మానించారు. తిమ్మక్క బుధవారం సీఎంను మర్యాదపూర్వకంగా కలవడానికి రాగా.. కేసీఆర్‌ స్వయంగా తోడ్కొని వెళ్లి మంత్రులు, ప్రజాప్రతినిధులకు పరిచయం చేశారు. కాగా, సాలుమరద తిమ్మక్క బీబీసీ ఎంపిక చేసిన 100 మంది ప్రభావశీల మహిళల జాబితాలో ఒకరిగా నిలిచారు. తనకు సంతానం కలగకపోవడంతో మొక్కలనే పిల్లలుగా భావించి, పచ్చదనం పర్యావరణ హితం కోసం పని చేస్తున్నారు. తిమ్మక్క సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమెను ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కరించింది. కాగా, పచ్చదనాన్ని పెంపొందించడం, అడవుల సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వ కృషి, హరితహారం కార్యక్రమం, దాని స్ఫూర్తితో కొనసాగుతున్న గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌పై సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌ సంపాదకత్వంలో పలువురు రచయితలు రాసిన వ్యాసాల సంకలనం ‘ఆకుపచ్చని వీలునామా’ పుస్తకాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. తొలి కాపీని పర్యావరణ పరిరక్షకురాలు తిమ్మక్కకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌, సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరి గౌరీశంకర్‌ పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.