Bengaluru అంటే ఎంతో ఇష్టం

ABN , First Publish Date - 2022-03-18T18:00:11+05:30 IST

రాజధాని బెంగళూరు అంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు తన హృదయాన్ని హత్తుకున్నాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

Bengaluru అంటే ఎంతో ఇష్టం

          - సీఎం బొమ్మై అత్యంత సమర్థుడైన నేత: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 


బెంగళూరు: రాజధాని బెంగళూరు అంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు తన హృదయాన్ని హత్తుకున్నాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అభిప్రాయపడ్డారు. నగరంలో గురువారం డీఆర్‌డీఓ ఫ్లైట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ కాంప్లెక్స్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఐటీబీటీ రంగాలలో కర్ణాటక ఇప్పుడే అంతర్జాతీయస్థాయి గుర్తింపు పొందిందని కొనియాడారు. కర్ణాటక అభివృద్ధి ప్రగతిపథంలో దూసుకెడుతోందన్నారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందని, సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాల అవసరాలను గుర్తించి కేంద్రం వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. ఏ రాష్ట్రం విషయంలోనూ వివక్షత చూపడం లేదన్నారు. రాజకీయ అవసరాలకోసం కొందరు ఇలాంటి విమర్శలు చేస్తున్నారని ఆవేదన చెందారు. రాష్ట్రానికి బసవరాజ్‌ బొమ్మై రూపంలో అత్యంత సమర్థుడైన, దక్షత కల్గిన నేత దొరికారని రాజ్‌నాథ్‌సింగ్‌ కితాబునిచ్చారు. డీఆర్‌డీఓ ప్రాంగణంలో ఎల్‌అండ్‌టీ సంస్థ రికార్డుస్థాయిలో 45 రోజుల్లో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఫ్లైట్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ కాంప్లెక్స్‌ను నిర్మించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మాట్లాడుతూ కేంద్ర రక్షణశాఖకు రాజధాని బెంగళూరు వెన్నుదన్నుగా ఉంటుందని భరోసా ఇ చ్చారు. రక్షణరంగ పరిశోధనలు, అభివృద్ధికి తమ ప్రభుత్వం చేయూతనిస్తోందన్నారు. బెంగళూరులో 180కి పైగా అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు ఉన్నాయని, నైపుణ్యభరిత మానవవనరులు ఇక్కడ పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణమన్నారు. వీటి ప్రయోజనాలను రక్షణశాఖ గరిష్టంగా అందుకునేలా కార్యక్రమాల రూపకల్పన జరగాలని సీఎం ఆకాంక్షించారు. రక్షణారంగ ఉత్పాదన, సెమీ కండక్టర్ల విభాగాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చేయూతను ఇస్తోందన్నారు. కేంద్ర రక్షణారంగ పరిశోధనల సంస్థ (డీఆర్‌డీఓ) అంతర్జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిందని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం కూడా ఇం దులో సేవలందించారని గుర్తు చేశారు. ‘ఆత్మనిర్భర్‌’ కార్యక్రమాన్ని అన్ని రంగాల్లోనూ తీసుకురావడం ద్వారా ప్రధాని దేశ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని సీఎం కొనియాడారు. ఏప్రిల్‌ 1నుంచి బడ్జెట్‌లో తాము చేసిన హామీలన్నీ అమలయ్యేలా ఉన్నతాధికారులకు సూచన చేస్తూ లేఖలు రాశానన్నారు. అభివృద్ధిలో రాజకీయాలు ఉండవన్నారు. ఇదే తమ సిద్ధాంతమన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి డీఆర్‌డీలోని పలు విభాగాలను పరిశీలించారు. 

Updated Date - 2022-03-18T18:00:11+05:30 IST