సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి కేంద్ర మంత్రుల ప్రశంసలు

ABN , First Publish Date - 2022-04-26T02:56:49+05:30 IST

సిలికాన్ వ్యాలీలో తెలుగువారి సారథ్యంలో నిర్వహిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్‌సింగ్ సందర్శించారు.

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి కేంద్ర మంత్రుల ప్రశంసలు

సిలికాన్ వ్యాలీలో తెలుగువారి సారథ్యంలో నిర్వహిస్తున్న సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్‌సింగ్ సందర్శించారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆదివారం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న పలువురు భారతీయ ప్రముఖులతో సమావేశం నిర్వహించారు. అనంతరం సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న కార్యకలాపాలను పరిశీలించారు. విశ్వవిద్యాలయం వ్యవస్థాపక చైర్మన్ కూచిభొట్ల ఆనంద్.. విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న కార్యకలాపాలను వివరించారు. భారతీయ కళలకు సాంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా విశ్వవిద్యాలయంలో కోర్సులను రూపొందించటం పట్ల సీతారామన్ సంతోషం వ్యక్తంచేశారు. 65 ఎకరాల విస్తీర్ణంలో నూతన భవనాలను సాంకేతిక కోర్సులను మెడికల్ కళాశాలను విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం పట్ల సీతారామన్ సంతోషం వ్యక్తపరిచారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి సహకారం అందిస్తామని ఆమె పేర్కొన్నారు. 


ఈ కార్యక్రమంలో కూచిభోట్ల ఆనంద్‌తో పాటు అమెరికాలో భారత రాయబారి తరుణ్ జిత్ సింగ్, కాన్సులేట్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్, సిలికానాంధ్ర ప్రతినిధులు చామర్తి రాజు, కొండిపర్తి దిలీప్, ప్రముఖ వైద్యులు డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వారం రోజుల క్రితమే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సిలికానాంధ్ర విశ్వ విద్యాలయాన్ని సందర్శించారు. విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న కోర్సులను కార్యకలాపాలను పరిశీలించి నిర్వాహకులను ప్రశంసించారు. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెబుతున్నారని ప్రశంసించారు. వారం రోజుల వ్యవధిలో ఇరువురు కేంద్రమంత్రులు తమ విశ్వవిద్యాలయాన్ని సందర్శించడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

న్యూయార్క్ నుండి ఆంధ్రజ్యోతి ప్రతినిధి కిలారు ముద్దుకృష్ణ





Updated Date - 2022-04-26T02:56:49+05:30 IST