ఉత్తమ పోలీసింగ్‌కు కేంద్ర గుర్తింపు

ABN , First Publish Date - 2020-10-22T05:57:33+05:30 IST

ఉత్తమ సేవలు అందిస్తున్న జమ్మికుంట పోలీసులకు కేంద్ర గుర్తింపు దక్కింది. జాతీయ ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌గా నామినేట్‌ అయ్యింది.

ఉత్తమ పోలీసింగ్‌కు కేంద్ర గుర్తింపు

బెస్ట్‌ పోలీస్‌స్టేషన్‌ అవార్డుకు జమ్మికుంట ఠాణా నామినేట్‌ 

ఎస్‌హెచ్‌వోకు లేఖ రాసిన కేంద్ర హోంశాఖ డైరెక్టర్‌


 జమ్మికుంట రూరల్‌, అక్టోబరు 21: ఉత్తమ సేవలు అందిస్తున్న జమ్మికుంట పోలీసులకు కేంద్ర గుర్తింపు దక్కింది. జాతీయ ఉత్తమ పోలీస్‌ స్టేషన్‌గా నామినేట్‌ అయ్యింది. ఈ మేరకు కేంద్రం నుంచి సమాచారం వచ్చింది. గత ఏడాది కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిదిలోని చొప్పదండి జాతీయస్థాయి లో ఎనిమిదో స్థానం సొంతం చేసుకోగా, ఈ సారి కమిషనరేట్‌ నుంచి జమ్మికుంట అవార్డుకు నామినేట్‌ అయ్యింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ అజిత్‌కుమార్‌ జమ్మికుంట సీఐ (ఎస్‌హెచ్‌వో)కి లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మూడు పోలీస్‌ స్టేషన్లను మాత్రమే కేంద్రం ఎంపిక చేసింది. నల్గొండ జిల్లా త్రిపురారం, హైద్రాబాద్‌లోని లాలాగూడ, జిల్లాలోని జమ్మికుంట పోలీస్‌ స్టేషన్లను ఈ అవార్డుకు నామినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. సృజన్‌రెడ్డి సీఐగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోలీసింగ్‌లో ప్రజలకు మరింత చేరువయ్యారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో క్రమశిక్షణతో ఉంటూనే ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. పోలీస్‌లను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేయడంతో పాటు నేరాల నియంత్రణకు సీసీ కెమరాలు, టెక్నాలజీని ఉపయోగిస్తూ అన్ని వర్గాల మన్నలను పొందుతున్నారు. 


జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం సంతోషంగా ఉంది..కె సృజన్‌రెడ్డి, జమ్మికుంట పట్టణ సీఐ

జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం సంతోషంగా ఉంది. సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌ స్టేషన్‌ వస్తున్న ప్రజలకు సకల సౌకర్యాలు ఉండడం, ప్రధాన రహదారులు, కూడళ్లలో సిసి కెమరాల ఏర్పాటు, త్వరగా స్పందించడం, ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేరస్తులను పట్టుకోవడం, ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వల్లే జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌కు ఈ గుర్తింపు లభించింది. 

Updated Date - 2020-10-22T05:57:33+05:30 IST