వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం

ABN , First Publish Date - 2021-11-27T06:55:49+05:30 IST

చంద్రగిరి మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలైన భీమవరం, కూచువారిపల్లె, మూలపల్లెల్లో శుక్రవారం సాయంత్రం కేంద్ర బృందం పర్యటించింది

వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం
వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న కేంద్ర బృందం

చంద్రగిరి, నవంబరు 26: చంద్రగిరి మండలంలో  వరద ప్రభావిత ప్రాంతాలైన భీమవరం, కూచువారిపల్లె, మూలపల్లెల్లో శుక్రవారం సాయంత్రం కేంద్ర బృందం పర్యటించింది.భీమవరం సమీపంలోని భీమానది వంతెన వద్ద వరద ఉధృతానికి కొట్టుకుపోయిన వరి పంటను బృంద సభ్యులు పరిశీలించారు.దాదాపు 32 కుటుంబాలకు చెందిన పంటలకు నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. ఎకరాకు 25 నుంచి 30 బస్తాల పంట చేతికొచ్చే సమయంలో వరద పాలైందని వివరించారు. భీమానది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించాక కూచువారిపల్లె వద్ద వరద ఉధృతానికి కొట్టుకుపోయిన కల్వర్టును కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు. పుంగనూరు నుంచి నదుల పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగిందని ఈ సందర్భంగా కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.కూచువారిపల్లెకు చెందిన కౌలు రైతు దామోదరరెడ్డి తన పొలంలో మునకలో ఉన్న వరి, శేరుశెనగ పంటలను తీసుకొచ్చి కేంద్ర బృందానికి చూపించారు. దాదాపు 3 కిలోమీటర్ల దూరం వరకు కేంద్ర బృందం భీమా నది పరివాహక ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్ళి దెబ్బతిన్న పంటలను, చెక్‌ డ్యామ్‌లను పరిశీలించారు. మూలపల్లె నుంచి దిగువకు వస్తున్న నీటి ప్రవాహాన్ని,కూచువారిపల్లె వద్ద వరి పంట నష్టాన్ని పరిశీలించారు. 25 ఎకరాల్లో వరి పంటలను, మామిడి చెట్లను పూర్తి నష్టపోయామని 10 కుటుంబాలు రైతులు వివరించారు.ఈ ప్రాంతంలో మూడు చెరువుల నీళ్ళు పొంగి పొర్లుతున్నాయని తెలిపారు.చీకల నారవ వంకను పునరుద్ధరించాలని రైతులు మొరపెట్టుకున్నారు.తుఫాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతుల వివరాలపై సమగ్రంగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించిన కేంద్రబృందం నష్టపోయిన ప్రతి రైతుకూ న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది.అనంతరం  తిరుచానూరు చేరుకున్న కేంద్ర బృందం  గ్రాండ్‌రిడ్జ్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించింది.శనివారం జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో పర్యటించనుంది. కేంద్ర బృందంలో హోంశాఖ సలహాదారు కునాల్‌ సత్యార్థి, ఆర్థిక శాఖ డైరెక్టర్‌ అభేకుమార్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ డాక్టర్‌ మనోహరన్‌, వాటర్‌ రీసోర్స్‌ ఇంజనీరింగ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసు బైరీ, విద్యుత్‌శాఖ డైరెక్టర్‌ శివానీశర్మ, రోడ్లు మరియు హైవేల శాఖ ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్‌ సింగ్‌, గ్రామీణాభివృద్దిశాఖ అధికారి అనిల్‌కుమార్‌ సింగ్‌ వుండగా వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరుణ్‌కుమార్‌, కలెక్టర్‌ హరినారాయణన్‌, వ్యవసాయ శాఖ జేడీ దొరసాని, డీడీ మలికార్జున, ఏడీ సుబ్రమణ్యం, తహసీల్దార్‌ శిరీష, ఏవో మల్లిక పాల్గొన్నారు.


Updated Date - 2021-11-27T06:55:49+05:30 IST