ఉపాధి అవకతవకలపై కేంద్ర బృందం తనిఖీలు

ABN , First Publish Date - 2022-01-20T05:55:35+05:30 IST

మండలంలో జరిగిన ఉపాధిహామీ పనుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావటంతో కేంద్ర బృందం సభ్యులు ప్రదీప్‌ సాల్వ్‌, రామేశ్వర్‌ కాల్‌వాలే బుధవారం క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు.

ఉపాధి అవకతవకలపై కేంద్ర బృందం తనిఖీలు
ఉపాధి పనుల రికార్డులు పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు

ముసునూరు, జనవరి 19: మండలంలో జరిగిన ఉపాధిహామీ పనుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావటంతో కేంద్ర బృందం సభ్యులు ప్రదీప్‌ సాల్వ్‌, రామేశ్వర్‌ కాల్‌వాలే బుధవారం క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. తొలుత మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన గ్రామసభలో 2019-21 వరకు మండలంలో 16 గ్రామాల్లో జరిగిన ఉపాధి పనుల రికార్డులను తనిఖీ చేశారు. కూలీలతో ముఖాముఖి నిర్వహించి పలు విషయాలను నమోదు చేసుకున్నారు. అనంతరం ముసునూరు, చెక్కపల్లి, అక్కిరెడ్డిగూడెం తదితర గ్రామాల్లో జరిగిన ఉపాధి పనులను క్షేత్రస్థాయిలో కేంద్ర బృందం పరిశీలించింది. అయితే రికార్డులకు, క్షేత్రస్థాయిలో పనులకు పొంతన లేనట్టు వారు గుర్తించారు. ముసునూరు సంధ్యవాగు పక్కన ఉపాధిహామీ పథకంలో ఏర్పాటు చేసిన నీటికుంటలను ఒక వ్యక్తి పూడ్చివేశాడు. వాటిని తన సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకోవటంతోపాటు ప్రధాన రహదారి పక్కనే అక్రమ నిర్మాణం చేస్తున్నాడు. ఈ విషయాన్ని మండల, ఉపాధిహామీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని, రూ.లక్షల ఖర్చుచేసి తవ్విన నీటికుంటలు కనుమరుగైపోయాయని గ్రామస్థులు కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. ఈ ఉపాధి పనులకు సంబంధించిన సమగ్ర నివేదికను కేంద్ర ఉన్నతాధికారులకు ఇవ్వటం జరుగుతుందని బృందం సభ్యులు ప్రదీప్‌ సాల్వ్‌, రామేశ్వర్‌ కాల్‌వాలే తెలిపారు.  కార్యాక్రమంలో సర్పంచ్‌ కొండేటి విజయలక్ష్మి, జిల్లా అడిషనల్‌ పీడీ జనార్ధన్‌, ఏపీడీ వెంకటరమణరావు, ఎంపీడీవో సత్యనారాయణ, ఇన్‌చార్జి ఏపీవో జయప్రసాద్‌ పాల్గొన్నారు. 


నేడు చాట్రాయి మండలంలో పర్యటన

చాట్రాయి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం పనులు పరిశీలించటానికి గురువారం కేంద్ర బృందం మండలంలో పర్యటిస్తుందని ఎంపీడీవో నాగేశ్వరరావు తెలిపారు. చనుబండ, చిన్నంపేట,పోతనపల్లి గ్రామాల్లో బృందం పనులు పరిశీలించి, రికార్డులు తనిఖీ చేస్తారని ఎంపీడీవో తెలిపారు. 


Updated Date - 2022-01-20T05:55:35+05:30 IST