‘అన్నమయ్య’ను తనిఖీ చేసిన కేంద్ర బృందం

ABN , First Publish Date - 2022-05-24T05:43:01+05:30 IST

అన్నమయ్య ప్రాజెక్టును కేంద్ర జల వనరుల శాఖాధికారులు సోమవారం తనిఖీ చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన వివిధ రకాల అధ్యయనాల కమిటీకి సంబంధించిన ఉన్నతాధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.

‘అన్నమయ్య’ను తనిఖీ చేసిన కేంద్ర బృందం
అన్నమయ్య ప్రాజెక్టును పరిశీలిస్తున్న కేంద్ర బృందం

ప్రాజెక్టు తెగిపోవడానికి గల కారణాలపై ఆరా
మీడియాకు సమాచారం ఇవ్వని అధికారులు

రాజంపేట, మే 23 :
అన్నమయ్య ప్రాజెక్టును కేంద్ర జల వనరుల శాఖాధికారులు సోమవారం తనిఖీ చేశారు. ఐదుగురు సభ్యులతో కూడిన వివిధ రకాల అధ్యయనాల కమిటీకి సంబంధించిన ఉన్నతాధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. కేంద్ర సీడబ్ల్యూఎస్‌ డైరెక్టర్‌ కె.మహమ్మద్‌, సీడబ్ల్యూఎస్‌ గేట్స్‌ డైరెక్టర్‌ రాహుల్‌కుమార్‌ సింగ్‌, డిప్యూటీ డైరెక్టర్లు అశ్వినీకుమార్‌, ఆదిత్యమిశ్ర, డ్యాం సేఫ్టీ మానిటరింగ్‌ అధికారి నితిన్‌కుమార్‌లు ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా తెగిపోయిన ఎర్త్‌డ్యాంను, గేట్లను, చుట్టుపక్కల ప్రాంతాలను, స్పిల్‌వే, ర్యాక్‌ఫిల్‌డ్యాంను పరిశీలించారు. ప్రాజెక్టు తెగిపోవడానికి గల కారణాలపై అధ్యయనం చేశారు. ఆరోజు డ్యూటీ చేస్తున్న ప్రాజెక్టు అధికారుల లోపాలపై అధ్యయనం చేశారు. ప్రాజెక్టు కెపాసిటీ, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో సామర్థ్యం అంశాలపై ఆరా తీశారు. ప్రధానంగా ఒక గేటు పనిచేయనప్పుడు ఆ గేటు ఇన్‌ఫ్లో సామర్థ్యం ఎంత, భారీ వరద వచ్చినప్పుడు ముందస్తుగా గేట్లు ఏ మేరకు తీశారు అన్నదానిపై ఆరా తీశారు. వరద సమయంలో డ్యూటీ చేస్తున్న ఇంజనీరింగ్‌ అధికారుల నివేదికలపై కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు లోతైన అధ్యయనం చేసినట్లు తెలిసింది. దీని విషయమై పూర్తి స్థాయి విచారణలో అధికారులు నిమగ్నమైనట్లు తెలిసింది.

మీడియాకు తెలియకుండా...
కేంద్ర జలవనరుల శాఖ నిపుణుల బృందం అన్నమయ్య ప్రాజెక్టును తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు తమ తప్పిదాలు ఎక్కడ బయటపడతాయోనని ప్రాజెక్టు అధికారులు మీడియాకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. ప్రాజెక్టు ఈఈ ఈ విషయంపై మీడియాకు సమాచారం ఇవ్వనివ్వకుండా తమ కింది స్థాయి సిబ్బందికి హుకుం జారీ చేసినట్లు తెలిసింది. తమ నిర్లక్ష్యం మీడియాకు ఎక్కడ తెలుస్తుందోనని గోప్యంగా ఉంచారు. కేంద్ర జలవనరుల తనిఖీ బృందం వచ్చినప్పుడు వారు వచ్చిన తరువాత అయినా వివరాలను ప్రజలకు తెలియడానికి మీడియాకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రాజెక్టు అధికారులపై ఉంది. కేంద్ర బృందం పరిశీలించిన తరువాత మీడియా సభ్యులు ఎక్కడ ఫోన్‌ చేస్తారో అని సంబంధిత ఈఈ ఎవ్వరికీ తన సెల్‌ఫోన్‌ అందుబాటులో లేకుండా చేయడం గమనార్హం. ఈ విషయమై ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ శ్రావణ్‌కుమార్‌ను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా ఫిబ్రవరిలో రావాల్సిన కేంద్ర కమిటీ సభ్యులు మేలో వచ్చారని, వచ్చి ప్రాజెక్టు తెగిపోవడానికి గల కారణాలపై అధ్యయనం చేశారని వివరించారు.

Updated Date - 2022-05-24T05:43:01+05:30 IST