ఏటీఎంలపై ‘మధ్యస్థ’ దాడులు కట్టడి చేయండి

ABN , First Publish Date - 2021-04-19T05:56:11+05:30 IST

ఏటీఎంలపై దాడి చేస్తున్న మధ్యస్థ వ్యక్తుల (ఎంఐటీఎం) నుంచి రక్షణకు ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సహా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించింది...

ఏటీఎంలపై ‘మధ్యస్థ’ దాడులు కట్టడి చేయండి

  • బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశం


న్యూఢిల్లీ: ఏటీఎంలపై దాడి చేస్తున్న మధ్యస్థ వ్యక్తుల (ఎంఐటీఎం) నుంచి రక్షణకు ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సహా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం బ్యాంకులను ఆదేశించింది. ఈ విధానం కింద ‘ఏటీఎం స్విచ్‌’ ‘ఏటీఎం హోస్ట్‌’కు పంపే సందేశాలను మధ్యస్థ వ్యక్తులు దొంగిలించి ఆ సమాచారం ఆధారంగా మోసపూరితంగా నగదు విత్‌డ్రా చేస్తూ ఉంటారు. సైబర్‌ నేరాలకు పాల్పడే గాంగ్‌లు ఇలాం టి వినూత్నమైన దాడులకు దిగుతున్నట్టు భద్రతా ఏజెన్సీల దర్యాప్తులో తేలిందని ఒక అధికారి చెప్పారు. సైబర్‌ నేరగాళ్లు ఏటీఎం నెట్‌వర్క్‌ కేబుల్‌ను మొదట కొంత విచ్ఛిన్నం చేసి అక్కడ ఒక డివై్‌సను అమర్చుతారని, ఏటీఎం స్విచ్‌ నిరాకరించిన (డిక్లైన్‌) సందేశాలను మార్చగల శక్తి ఆ డివై్‌సకుంటుందని, అలా మార్చిన సందేశాలను అప్రూవ్డ్‌గా మార్చి దాని  ఆధారంతో బ్లాక్‌ చేసిన లేదా నిరాకరించిన కార్డులలోని నగదును దొంగిలిస్తారని దర్యాప్తులో తేలిందన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఏటీఎం టెర్మినల్‌, ఏటీఎం స్విచ్‌ మధ్య సందేశాలన్నింటినీ ఎండ్‌ టు ఎంట్‌ ఎన్‌క్రిప్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే నెట్‌వర్క్‌ కేబుల్స్‌, ఏటీఎం ప్రాంగణంలోని ఇన్‌పుట్‌/ఔట్‌పుట్‌ పోర్ట్‌లకు పూర్తి రక్షణ కల్పించాలని సూచించింది. ఇలాంటి సంఘటనలు గత మూడేళ్లుగా పెరుగుతూ వస్తున్నట్టు ఇండియన్‌ కంప్యూటర్‌ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్‌-ఇన్‌) తెలిపింది. 


Updated Date - 2021-04-19T05:56:11+05:30 IST