Delhi: వారసుని పేరు సూచించాలని సీజేఐ లలిత్‌ను కోరిన కేంద్రం

ABN , First Publish Date - 2022-10-07T23:40:53+05:30 IST

భారత ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయాల్సి ..ఉండటంతో..

Delhi: వారసుని పేరు సూచించాలని సీజేఐ లలిత్‌ను కోరిన కేంద్రం

న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) యూయూ లలిత్ (UU Lalit) నవంబర్ 8న పదవీ విరమణ చేయాల్సి ఉండటంతో, కొత్త సీజేఐ ఎంపిక కోసం కేంద్రం కసరత్తు ప్రారంభించింది. నవంబర్ 8వ  తేదీకి ముందే ఆయన వారసుని పేరును సూచించాలంటూ సీజేఐ లలిత్‌ను కేంద్రం శుక్రవారంనాడు కోరింది. మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్ ఆప్ అపాయింట్‌మెంట్ (MOP) ప్రకారం కేంద్ర న్యాయశాఖ ఆయనకు లేఖ రాసింది. కొత్త వారసుని పేరు సిఫారసు చేసి పంపాలని  కోరింది.


సీజేఐ లలిత్ పదవీ విరమణకు మూడు నెలలు మాత్రమే వ్యవధి ఉంది. ఆగస్టు 27న ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఆయనకు ముందు సీజేఐగా ఉన్న ఎన్‌వీ రమణ 2022 ఆగస్టు 26న రిటైర్ అ్యయారు. సీనియారిటీ ప్రకారం జస్టిస్ లలిత్ పేరును ఆయన సిఫారసు చేశారు. ఆ సిఫారసును రాష్ట్రపతి ధ్రువీకరించడంతో వెంటనే జస్టిస్ లలిత్ నియామకం జరిగింది. అయితే, నవంబర్ 8న సీజేఐ లలిత్ పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఇంతవరకూ అమలులో ఉన్న పద్ధతి ప్రకారం సీజేఐ పదవీ విరమణకు ముందే సీనియారిటీ ఉన్న తన వారసుని పేరును సూచించాల్సి ఉంది. ఆ ప్రకారం జస్టిస్ డీవై చంద్రచూడ్‌ భారత 50వ సీజేఐ అయ్యే అవకాశాలున్నాయి.

Updated Date - 2022-10-07T23:40:53+05:30 IST