న్యూఢిల్లీ: కశ్మీర్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న బలప్రయోగ విధానాలు (muscular policies) ఎంతమాత్రం సమస్యను పరిష్కరించ లేవని, దానికి బదులు సమస్య మరింత తీవ్రమవుతుందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ (Mehbooba mufti) హెచ్చరించారు. కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ (Yasin malik)కు ఉరిశిక్షే సరైన శిక్ష అని ఎన్‌ఐఏ (NIA) బుధవారంనాడు పటియాలా కోర్టుకు సూచించడం, దీనిపై కోర్టు శిక్ష ఖరారు చేయనుందంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇవి కూడా చదవండి
జమ్మూకశ్మీర్ అంశం ఒక రాజకీయ సమస్య అని, అనేక మందిని ఇక్కడ ఉరితీశారని, యావజ్జీవ శిక్ష వేశారని మెహబూబా ముఫ్తీ అన్నారు. అయినప్పటికీ సమస్య పరిష్కారానికి బదులు మరింత తీవ్రమవుతూనే ఉందన్నారు. కండబల ప్రదర్శనా విధానాల వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఇందువల్ల సమస్యలు తీరడానికి బదులు మరింత పెరుగుతాయన్నదే తన అభిప్రాయమని అన్నారు.
కేంద్ర హోం మంత్రిగా తన తండ్రి ముఫ్తీ సయీద్ ఉన్నప్పుడు యాసిన్ మాలిక్ జైలులో ఉన్నారని, ఆయుధాలు విడిచి ప్రభుత్వంతో చర్చలు జరపాలని యాసిన్‌కు తన తండ్రి సలహా ఇచ్చారని మెహబూబూ ముఫ్తీ గుర్తుచేశారు. కశ్మీర్‌పై చర్చలకు తన తండ్రి చొరవ తీసుకున్నప్పుడు పరిస్థితి మెరుగుపడిందని, ఇవాళ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని ఆమె ఆరోపించారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత తీవ్ర స్థాయిలో ఉండటంతో మతం కార్డును బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెస్తోందని విమర్శించారు. దేశ ప్రజలకు తమ విజయాలను చెప్పుకునే పరిస్థితిలో లేకపోవడంతోనే హిందూ-ముస్లిం అంశాలను సృష్టిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ''వాళ్లు దేశంలోని అన్ని మసీదులను ఆక్రమించుకోవాలనుకుంటున్నారు. అసలు ముస్లింలను వాళ్లు ఏమి చేయాలనుకుంటున్నారో ప్రజల ముందుకు వచ్చి చెప్పాలి'' ఆని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా్లో పార్టీ కార్యకర్తల సదస్సులో మెహబూబా ముఫ్తీ తాజా వ్యాఖ్యాలు చేశారు.