
నర్సింగ్‌పూర్ : మధ్య ప్రదేశ్(Madya Pradesh)లో గతేడాది చనిపోయిన ఓ మహిళ మళ్లీ పుట్టడం సంచలనంగా మారింది. ఏంటీ చనిపోయిన మహిళ ఎలా బతికింది? అనుకుంటున్నారా.. నిజంగా బతకలేదు లెండీ.. కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తమ నిర్వాకంతో చనిపోయిన మహిళకు డెత్ సర్టిఫికెట్(Death Certificate)కు బదులుగా బర్త్ సర్టిఫికెట్(Birth Certificate) జారీ చేశారు. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన సంచలనంగా మారింది. తుటి గ్రామానికి చెందిన 82 ఏళ్ల శ్యామ్‌బాయి గతేడాది మేలో కన్నుమూసింది. అయితే మరణ ధృవీకరణ పత్రం కోసం ఆమె మనవడు శైలేష్ పంచాయతీ ఆఫీస్ చుట్టూ అనేక సార్లు తిరిగాడు. నెలలు గడుస్తున్నా అక్కడి సిబ్బంది డెత్ సర్టిఫికెట్ జారీ చేయలేదు. స్నేహితుల సలహాతో పబ్లిక్ సర్వీస్ సెంటర్‌లో తన అమ్మమ్మ డెత్ సర్టిఫికెట్ కోసం అప్లై చేశాడు. నెల రోజుల తర్వాత శైలేష్ ఇంటికి వచ్చిన లెటర్‌ను చూసి షాక్ అయ్యాడు. శ్యామ్ బాయి డెత్ సర్టిఫికెట్‌కు బదులుగా అధికారులు బర్త్ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. దీంతో శైలేష్ ఫిర్యాదు చేయడంతో సంబంధిత అధికారులు అప్రమత్తమయ్యారు. తమ తప్పు తెలుసుకుని వెంటనే డెత్ సర్టిఫికెట్‌ను సిద్ధం చేసి శైలేష్ చేతిలో పెట్టారు. కాగా డెత్ సర్టిఫికెట్ స్థానంలో బర్త్ సర్టిఫికెట్ జారీ చేసిన అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.