చదువులకు బ్రేక్‌..!?

ABN , First Publish Date - 2022-01-17T06:11:31+05:30 IST

చదువులకు బ్రేక్‌..!?

చదువులకు బ్రేక్‌..!?

కరోనా వైరస్‌ విజృంభణతో సెలవుల పొడగింపు

తాజాగా ఈనెల 30 తేదీ వరకు స్కూళ్లు బంద్‌ 

భవిష్యత్‌పై విద్యార్థులతో పాటు  వారి తల్లిదండ్రుల్లో ఆందోళన

జిల్లాలో విద్యనభ్యసిస్తున్న 85 వేల మంది.. 

మళ్లీ ‘ఆన్‌లైన్‌’ బోధనేనా..! 


మహబూబాబాద్‌, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : కరోనా చదువులకు శాపంగా మారింది.. గత రెండు సంవత్సరాలుగా విద్యను విచ్ఛిన్నం చేస్తోంది. విద్యార్థులను, వారి భవిష్యత్‌పై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. వైరస్‌ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోండడంతో.. విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ముందుగానే ప్రకటించింది. ఈనెల 16 వరకు ముగియగా, ఆదివారం మరోసారి ఈనెల 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 


తొలుత విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఈనెల 8వ తేదీ నుంచి 16 వరకు ప్రకటించగా.. సొంతూళ్లకు చేరిన పిల్లలంతా 17న సోమవారం నుంచి తిరిగి బడులకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు ఈలోగా ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వైద్య, విద్య అధికారులతో సమావేశమై రోజువారీగా కరోనా ఉధృతి పెరుగుతోండడంతో సెలవులను పొడగించాలని నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్‌ సెక్రటరీ సోమే్‌షకుమార్‌ ప్రకటించారు. దీంతో ఈ సెలవులు ఈనెల 30 వరకు ఉంటాయన్న ప్రకటన కూడా చేశారు. మరోపక్క ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని సంబంధి అధికారులు సర్క్యూలర్‌ జారీ చేశారు. దీంతో అన్ని కళాశాలల్లో ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా జరిగిపోయాయి. 


జిల్లాలో 85వేల మంది విద్యార్థులు..

మహబూబాబాద్‌ జిల్లాలో 678 ప్రాథమిక పాఠశాలలు, 120 ప్రాథమికోన్నత స్కూళ్లు, 100 ఉన్నత పాఠశాలలు, 8 మోడల్‌ స్కూళ్లు, 15 కేజీబీవీలు, 120 ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో సుమారు 75వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంటర్‌, డిగ్రీ, పీజీల్లో సుమారు 10వేల మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే బీసీ వెల్ఫేర్‌, గిరిజన, మైనార్టీ, సాంఘిక సంక్షేమ ఆశ్రమ, గురుకుల, ఆశ్రమ, ఫ్రీ మెట్రిక్‌, పోస్ట్‌మెట్రిక్‌ పాఠశాలలు, కళాశాలలుండగా 66 ఉండగా వాటిల్లోనూ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మొత్తంగా 85 వేలమంది విద్యార్థులు సంక్రాంతి సెలవుల నేపథ్యంలో పండుగకు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఇప్పటి వరకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధి విద్యార్థులకు మాత్రం ‘ఆన్‌లైన్‌’ తరగతుల నిర్వహణకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేబినెట్‌ సమావేశంలో ఎస్సెస్సీ, ఇంటర్‌ విద్యార్థులకు ‘ఆన్‌లైన్‌’ తరగతులపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.


రెండేళ్లుగా వైరస్‌ వ్యాప్తితో..

కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో 2019-20 విద్యా సంవత్సరం నుంచే విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మార్చి 18న ముందస్తు సెలవులు ప్రకటించారు. మార్చి 23న జనతా కర్ఫ్యూ, 24 నుంచి లాక్‌డౌన్‌తో మొత్తానికే పాఠశాలలు మూతపడ్డాయి. మరుసటి విద్యాసంవత్సరం 2020-21లో సెప్టెంబరు నుంచి ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో కొద్దికాలం తర్వాత ఫిబ్రవరి ఒకట్నుంచి మార్చి 23వ తేదీ వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించారు. ఆపై వైరస్‌ విజృంభణతో వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్‌ వరకు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేశారు. 2021-22 విద్యాసంవత్సరం జూన్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా, వైరస్‌ పూర్తిగా తగ్గకపోవడంతో ఆలస్యంగా ఆగస్టులో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించారు.


విద్యాసంవత్సరం ముగింపు దశలో..

సంక్రాంతి సెలవులు ఈనెల 8వ తేదీ నుంచి 16 వరకు కొనసాగాయి. ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరుగడంతో 30వ తేదీ వరకు సెలవులను పొడగించారు. దీంతో ఈ విద్యాసంవత్సరం పరిస్థితి ఏమిటన్న ప్రశ్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఉత్పన్నమవుతోంది. సెలవుల పొడగింపుతో పల్లెలు, ఇళ్లలో సందడి మాట ఆలా ఉంచితే.. రేపు విద్యార్థుల భవితవ్యంపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుత విద్యాసంవత్సరం ముగింపు దశలో కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో సెలవులు ప్రకటించిన సర్కార్‌ పరీక్షల నిర్వహణ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ వెలువడిన విష యం విదితమే. ఇంకా ఎస్సెసీ, డిగ్రీ పరీక్షలపై స్పష్టత రాలేదు. రానున్న రోజుల్లో ఈ పరీక్షల నిర్వహణపై కూడా సందిగ్ధత వీడడం లేదు. దీంతో విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళనలు వ్యక్తమవున్నాయి.


ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలి.. : ఎం.విష్ణువర్దన్‌రెడ్డి, విద్యార్థి తండ్రి, మహబూబాబాద్‌ 

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కరోనా ఉధృతి నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు పొడగిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దీంతో పాటు విద్యాసంవత్సరం వృథాకాకుండా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలి. కొవిడ్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టాక ప్రత్యక్ష తరగతులు చేపట్టాలి. 


నిబంధనలు పాటిస్తూ క్లాసులు నిర్వహించాలి : ఎస్‌.గోవర్ధన్‌, టీపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు

కరోనా వైరస్‌ వ్యాప్తితో రెండు సంవత్సరాలుగా విద్యాబోధన కుంటుపడుతూ వస్తోంది. దీంతో విద్యార్థులు నేర్చుకున్న పాఠాలను కూడా మరిచిపోయి, తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అందుకోసం రాష్ట్రప్రభుత్వం సెలవులు ఇవ్వకుండా కరోనా నిబంధనలను అమలుచేస్తూ, పాఠశాలల్లో తరగతులు నిర్వహించాలి. 

Updated Date - 2022-01-17T06:11:31+05:30 IST