వినాయకుడికి జీన్స్ ఫ్యాంటు, కరెన్సీ దండ.. పిచ్చి పనులే..

ABN , First Publish Date - 2020-05-08T22:15:38+05:30 IST

చాగంటి కోటేశ్వరరావు.. తన ప్రవచనాలతో శ్రోతలను అలరిస్తున్నారు. ఏ విషయంపైనైనా అవలీలగా ఆశువులు చెబుతూ సభికులను ఆకట్టుకోగలరు. టీవీ షోల ద్వారా దూసుకెళ్తూ.. భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటూ యమ బిజీగా సాగిపోతున్నారు.

వినాయకుడికి జీన్స్ ఫ్యాంటు, కరెన్సీ దండ.. పిచ్చి పనులే..

‘సినీ హీరోల’ వినాయకుడు శాస్ర్తంలో లేడు

వారి వల్ల హిందూధర్మంపై గౌరవం తగ్గుతుంది

అలా చెప్పబట్టే నాపై విమర్శలు

మాత మార్పిడిల గురించి నేను మాట్లాడను

భర్త విడిచిన బట్టల గురించి అలా చెప్పలేదు

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు


చాగంటి కోటేశ్వరరావు.. తన ప్రవచనాలతో శ్రోతలను అలరిస్తున్నారు. ఏ విషయంపైనైనా అవలీలగా ఆశువులు చెబుతూ సభికులను ఆకట్టుకోగలరు. టీవీ షోల ద్వారా దూసుకెళ్తూ.. భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటూ యమ బిజీగా సాగిపోతున్నారు. ఆంధ్రజ్యోతి - ఏబీఎన్‌ ఎమ్‌డీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక విశేషాలెన్నో పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...

 

ఆర్కే: నమస్కారం కోటేశ్వర్‌రావు గారు!

 చాగంటి కోటేశ్వరరావు: నమస్తే.


ఆర్కే: ఎలా ఉన్నారు?

 చాగంటి కోటేశ్వరరావు: బాగున్నాను.

 

ఆర్కే: తెలుగురాష్ట్రాల్లో ప్రవచనానికి మీరు పర్యాయపదంగా మారిపోయారు. జనాన్ని అంత మాయ ఏం చేశారు?

 చాగంటి కోటేశ్వరరావు: మాయ ఏవీు లేదు. రుషిప్రోక్తమైన వాంగ్మయం వీుద నాకు చాలా విశ్వాసం. ఎప్పుడూ అదే చెప్పాను. అది వాళ్లకు సంతోషకారకం కావడంతో వచ్చి వింటున్నారు.

 

ఆర్కే: చాలామంది ప్రవచనకారులున్నప్పటికీ వీుపట్ల ఎక్కువ మంది ఆకర్షితులవడానికి కారణం ఏంటి?

చాగంటి కోటేశ్వరరావు: నేను ఎప్పుడు ప్రవచనానికి వెళ్లినా నా మనసులో ఒక లక్ష్యం పెట్టుకుంటున్నాను. ఎంతో మంది వాళ్ల పనులు వదిలిపెట్టుకుని వచ్చి గంటన్నరసేపు కూర్చుంటారు. అక్కడ వాళ్ల జీవితంలో అభివృద్ధికి సంబంధించింది ఏదో ఉండాలి. నేను చెప్పేది వాళ్లకు అర్థం కావాలి. అందుకే నేను ఎంత కిందకు రాగలిగితే అంత కిందకు వచ్చి చెబుతుంటాను. అది ఒక కారణం కావచ్చు. అర్థం కాకపోతే ఎవరూ కూర్చోరు. శ్రోతలు ఎలా ఉంటారంటే అర్థంకాకపోతే ఒక నమస్కారం పెట్టి వెళ్లిపోతారు.


ఆర్కే: వీుకెప్పుడైనా అలా జరిగిందా?

చాగంటి కోటేశ్వరరావు: ఆ పరవేుశ్వరుని దయవల్ల ఎప్పుడూ అలా జరగలేదు.

 

ఆర్కే: మీరు గొప్ప ప్రవచనకారులుగానే చాలామందికి తెలుసు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అని తెలియదు కదా?

చాగంటి కోటేశ్వరరావు: అవును.


ఆర్కే: వీులో అపారవెుౖన విద్వత్తు ఎలా వచ్చింది? మీ కుటుంబ నేపథ్యం ఏంటి?

చాగంటి కోటేశ్వరరావు: మా నాన్నగారు పశ్చిమగోదావరి జిల్లాలోని గాలిపూడి అనే చిన్న ఊర్లో ప్రాథమిక పాఠశాల ప్రదానోపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన మంచి విద్వాంసుడు. శాస్త్రం తెలుసు. వాళ్లు ఐదుగురు అన్నదమ్ములు. బాగా చదువుకున్న వాళ్లే అయినా ఎక్కడికీ వెళ్లలేదు. మా నానమ్మ ‘ఒరేయ్‌ ఉన్నచోటే ఉండి పదిమందికి పాఠాలు చెప్పి బతకండిరా. ఎక్కడికో వెళ్లి డబ్బులు సంపాదించడం ఎందుకు?’ అని అన్నదట. దాంతో వాళ్లు ఊరుని వదలకుండా అక్కడే ఉండిపోయారు. బహుశా మా నాన్నగారి రక్తస్పర్శ వల్ల నాకు ఇది అబ్బిందని అనుకుంటాను.

 

ఆర్కే: ప్రవచనాలు చెప్పాలనే ఆలోచన ఎలా వచ్చింది?

చాగంటి కోటేశ్వరరావు: మంచి ప్రశ్న. శ్రీభాష్యం అప్పలాచార్యుల స్వామి వారు విశాఖపట్టణంలో ఉండేవారు. ఆయనంటే నాకు చాలా భక్తి, గౌరవం. ఒకరోజు ఆయన కాకినాడ సూర్యకళామందిరంలో ప్రవచనం చేస్తున్నారని తెలిసింది. అప్పుడు నేను పెద్దాపురంలో ఉంటున్నాను. నా భార్యతో కలిసి ఆ ప్రవచనానికి వెళ్లాను. వెళ్లాం, విన్నాం, వచ్చాం. వచ్చాక నేను ఆ ప్రవచనాల గురించే మాట్లాడుతుంటే ఇంటికొచ్చాక మా ఆవిడ ఇలా అంది. ‘దీనికిపైన మీకు ఇంత అనురక్తి ఉంది కదా. ఇద్దరం ఎలాగూ ఉద్యోగం చేస్తున్నాం. మనం ఏమీ ఆశించకుండా, శాస్త్రంలో ఏముందో దాన్ని దాటకుండా మంచి మాటలు ప్రజల హితం కోరి ఎందుకు చెప్పకూడదు. అప్పలాచార్యుల స్వామి వారు సమాజానికి ఉపకారం చేస్తున్నారుగా? ఆయన అడుగు జాడల్లో ఎందుకు నడవకూడదు’ అంది. ఆ మాటలు ప్రేరణనిచ్చాయి. మనస్సులో సంకల్పం కలగడానికి కారణమయింది. మాతా శివచైతన్య అని ఇప్పటికీ విజయవాడలో ఉన్నారు. పెద్దాపురంలో భాగవతం చెబుతూ ఒక ప్రశ్న వేశారు. నిజానికి నేను చెప్పాలని అనుకోలేదు. వేరే వ్యక్తి లేచి చాగంటి కోటేశ్వర్‌రావు గారు చెబుతారు అన్నాడు. నా ప్రమేయం ఏమీ లేదు. ఎవరూ చాగంటి కోటేశ్వర్‌రావు అని మాతా శివచైతన్యగారు అడిగారు. లేచి నిల్చున్నా. ఇలా రండి అని పిలిచి మైకు నాముందు తోసి చెప్పండి అన్నారు. ఆమెది చాలా విశాలమైన మనసు. నేను చెప్పిన సమాధానం విని సంతోషించి భాగవతం గురించి మాట్లాడండి అన్నారు. అలా భాగవతం గురించి మాట్లాడాను. ఆవిడ చాలా సంతోషించి బట్టలు అవీ పెట్టి నన్ను గౌరవించారు. అదంతా మరుసటి పేపర్లో వచ్చింది. అక్కడి నుంచి వ్యాపకంగా మారింది.

 

ఆర్కే: మీరంటే గిట్టని వాళ్లు మీరు ప్రవచనాలు చెప్పి బాగా సంపాదించారని అంటారు. నిజానికి మీరు ఒక్క రూపాయి కూడా తీసుకోరట కదా?

చాగంటి కోటేశ్వరరావు: పరమసత్యం మీరే చెప్పేశారు. కొన్ని వేల ప్రసంగాలు చేశాను. అది ఆర్గనైజ్‌ చేసిన వాళ్లు ఉంటారుకదా. నేను తీసుకుని ఉంటే ఇలా ఇంటర్వ్యూల్లో నేను డబ్బులు తీసుకోలేదు అని చెబితే... వాళ్లు ఏమయ్యా బుద్దుందా? మా దగ్గర నువ్వు పుచ్చుకున్నావు కదా? అని నన్ను అడగరండీ? నేను అబద్దం చెబితే వాళ్లకు తెలుస్తుంది కదా?ఒకవేళ నేను సంపాదించాలనుకుంటే తాంబూలం పుచ్చుకుంటే నన్ను ఎవరేమీ అనరు కదా. అదేమీ అనైతికం కాదు కదా. పదివేలు కాకపోతే ఐదు వేలు ఇమ్మంటాను. అలా తాంబూలం పుచ్చుకుంటే పుచ్చుకున్నాననే చెబుతాను. దాచుకోవాల్సిన అవసరం లేదు. అనేక సందర్భాల్లో నేను టికెట్‌ డబ్బులు కూడా పుచ్చుకోను. నా డబ్బులతోనే వెళుతుంటాను. ఇక్కడ నేను చెప్పాల్సింది మరొకటి ఉంది. మా అబ్బాయి టీసీఎస్‌లో ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి నేను ఇవ్వాల్సిన పనిలేదు. నాన్నగారూ ఇక మానేసి విశ్రాంతి తీసుకోవచ్చుగా... అంటుంటాడు. మా కూతురు అమెరికాలో ఉంటుంది. అల్లుడు యోగ్యుడు. మంచి ఉద్యోగం. వాళ్లను నేను చూడాల్సిన పనిలేదు. నా భార్య రాష్ట్రప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది. చాలాసార్లు మేం ఇద్దరం పదిహేను రోజులు సెలవు పెట్టి ప్రవచనాలకు వెళుతుంటాం. జీతం పోయిందన్న బెంగలేదు. నేనేదో చేశానన్న అతిశయం లేదు. ఒక గొప్పతృప్తి ఉంది. స్వాతంత్రం కోసం ఎందరో ప్రాణాలు అర్పించారు. జైళ్లలో మగ్గారు. వారితో పోల్చితే నేను చేసేది ఏపాటి.


భగవంతుడు సంతోషించాలంటే చేయాల్సింది అదే


ఆర్కే: డబ్బులు తీసుకోకుండా ప్రవచనాలు చెప్పడానికి ప్రేరణ ఏమైనా ఉందా?

చాగంటి కోటేశ్వరరావు: మా నాన్నగారు పేదపిల్లలను చేరదీసి చదువు చెప్పించి, బట్టలు ఇప్పించే వారు. నేను ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టిన రోజుల్లో తెల్లారితే మా అమ్మగారు చనిపోతారని అనగా రాత్రివేళ ఆమెకు ఏమనిపించిందో ఏమో నన్ను పిలిచి... ‘ఒరేయ్‌ నువ్వు ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టావు కదా. మీ నాన్నగారు సంపాదించాలనుకుంటే ఎంతోసంపాదించే వారు. కానీ అలా చేయలేదు. మనం చేసే మంచి పనులే పిల్లల్ని కాపాడతాయి అనే వారు. నువ్వు కూడా అలాగే ఉండు. ఆయన చేసిన మంచి పనిని కాపాడు. ఓపిక ఉండి చెప్పగలిగితే వెళ్లు. లేకపోతే లేదు. అంతేకానీ డబ్బులు అడగకు. దారి ఖర్చులు కూడా పుచ్చుకోకు. తీర్థయాత్రలకు వెళ్లానని అనుకో. దేవాలయ దర్శనం కోసం వెళ్లానని అనుకో’ అని చెప్పింది. దాంతో సరేనమ్మా అని నీకు మాటిస్తున్నా... అన్నాను. ఆ రోజు నుంచి ఒక్కరూపాయి తీసుకోలేదు. అయితే రాను రాను వ్యాపకం బాగా పెరిగిపోయింది. మరీ దూరం ఎక్కువ ఉన్నప్పుడు టిక్కెట్‌ తీసుకొచ్చి ఇవ్వండి, నేను వస్తాను అని చెప్పేవాణ్ణి. ఒకవేళ మరీ పేద సంస్థ అయితే అది కూడా అడగకపోయే వాణ్ణి.

 

ఆర్కే: ప్రజల్లో పరివర్తన తీసుకురావడానికి, మానసిక రుగ్మత తొలగించడానికి ప్రవచనాలు చేస్తుంటారుకదా. మరి అలాంటిది అసూయ అనేది ప్రవచనకారుల్లోనే ఉంటే ఎలా?

చాగంటి కోటేశ్వరరావు: మీ మాటతో నేను నూటికి నూరుపాళ్లు ఏకీభవిస్తాను. చాగంటి కోటేశ్వర్‌రావు ఇలా చెబుతున్నారు అంటే నిజజీవితంలో కూడా అలాగే ఉంటారని అనుకుంటారు. నేను కావాలని ఎప్పుడూ ఎలాంటి పొరపాట్లు చేయలేదు. ఒకవేళ తెలియకుండా చేసి ఉంటే మన్నింపబడును. ఎందుకంటే ఒక విషయం చెప్పాలంటే ఎంతో సాధన చేయాలి. గంటన్నర ప్రసంగం చేయాలంటే ఆరుగంటలు చదవాలి. నేను చదువుకున్నది చాలా తక్కువ. ఇవ్వాళ ప్రవచన రంగంలో చూస్తే గరికపాటి నరసింహారావు మహాపండితుడు. సరస్వతిని స్వాధీనుడు. అలవోకగా పద్యాలు చెబుతాడు. అటువంటి వ్యక్తిని నేను నిందించాననుకో ఇక నేను ప్రవచనం చేయడం ఎందుకు? కాల్చనా?

 

ఆర్కే: ప్రవచనాలకు యువత కూడా ఆకర్షితులవుతున్నారా? 

చాగంటి కోటేశ్వరరావు: నూటికినూరు పాళ్లు యువత పాటిస్తున్నారు. విన్నవాళ్లు అందరూ మారతారని అనుకోవడం తప్పే. వింటే పుణ్యం... అని వచ్చే వాళ్లు కూడా ఉంటారు. కానీ యువత అలా కాదు. విన్నది ఆచరించాలనే తాపత్రయం బాగా కనిపిస్తుంది. నిష్కళంకంగా ఉంటారు. మంచి మాటలు చెబితే స్ఫూర్తి పొందుతారు. నా ప్రవచనాలు విని ఎన్నో మంచి పనులు చేస్తున్నామని ఉత్తరాలు రాస్తుంటారు.

 

ఆర్కే: గతంతో పోల్చితే ఇటీవల భక్తి బాగా పెరిగింది. అయితే నిజంగా ఆధ్యాత్మిక భావనతో కన్నా ఒక భయం, ఒక ఆశతో ఉంటోంది అనేది నిజంకాదా? 

చాగంటి కోటేశ్వరరావు: అది ఎప్పుడూ ఉంటుంది. నా దగ్గరకు వచ్చే వారిలో ఆర్తితో వచ్చే వాళ్లు ఉంటారు. అవసరంతో వచ్చే వాళ్లు ఉంటారు అని పరమాత్ముడే చెప్పారు. అయితే కేవలం అవసరం ఉన్నప్పుడే దేవుని దగ్గరకు వెళ్లడమే కాకుండా, అవసరం తీర్చిన భగవంతుడు సంతోషించాలంటే ఆపదలో ఉన్న మరో వ్యక్తిని ఆదుకోవాలి.

 

ఆర్కే: దేవుడు సర్వాంతర్యామి అంటారు. మరి ఆ గుళ్లో దేవుడు చాలా పవర్‌ఫుల్‌ అంటారు, ఎందుకు? 

చాగంటి కోటేశ్వరరావు: ఆ గుళ్లో దేవుడు పవర్‌ఫుల్‌, ఈ గుళ్లో దేవుడు పవర్‌ తక్కువ అంటూ ఏమీ ఉండదు. శాస్త్రంలో అలా ఏమీ ఉండదు. నిజం చెప్పాలంటే దేవాలయంలో సంస్కారం ప్రారంభమవుతుంది. మానవత్వం వికసించడానికి దేవాలయం ఒక కేంద్రంగా ఉండాలి.


ఆర్కే: సమాజాన్ని సన్మార్గంలో నడపడం ప్రవచనకర్త బాధ్యత . చేతకాకపోతే తప్పుకోవాలి. కానీ పక్కదారి పట్టించకూడదు. అయోమయానికి గురిచేయుకూడదు. 

చాగంటి కోటేశ్వరరావు: అవును, ఈ రెండూ వుంచిది కాదు.

 

ఆర్కే: దురదృష్టవశాత్తు ఇది జరుగుతోంది. దీనికితోడు పోటీలొచ్చాయి. కోటేశ్వరరావుగారి సభకు ఎక్కువమంది వచ్చారా? నాకు కనీసం పన్నెండు వందల మందయినా లేకపోతే ఎలా? అనే ధోరణి ఉంది? 

చాగంటి కోటేశ్వరరావు: వీురు అన్న మాటలను బట్టి పరిస్థితి ఇలా కూడా ఉందని నాకు అర్థమవుతోంది. నేను అసలు ఎప్పుడు ఎక్కడకు వెళ్లినా... వీురు ఎంత ప్రచారం చేశారు? ఎంతమంది వస్తారు? వేదికపై ఎంతమంది పడతారు?... వంటి ప్రశ్నలు ఎప్పుడూ అడగలేదు. ఈరోజు నేను ఒక వేదిక వీుద ప్రసంగం చేస్తే పది వేల మంది వస్తారు. మర్నాడు ఐదుగురే ఉన్న ఒక ఇంట్లో... ఆర్తితో ఒక ముసలావిడ లేవలేకపోతోందంటే... అమ్మా వీురు అలా మంచం వీుద పడుకోండని, కుర్చీలో కూర్చొని ఆ ఇంట్లో ఐదుగుర్నే కూర్చోబెట్టి చెప్పిన రోజులూ ఉన్నాయి. కోటేశ్వరరావుగారి ప్రవచనానికి వేలమంది వచ్చారు కాబట్టి ఆయన ప్రవచనం గొప్ప ఎప్పటికీ కాదు. ఆయన చెప్పన దానివల్ల సమాజానికి హితం కలిగితేనే కోటేశ్వరరావుగారు మంచి ప్రవచనం చేశారు అంటారు. జనాన్ని ఆకర్షించడవేు ప్రధానవెుౖతే ఏవేవో చెప్పి ఆ పని చేసేయెుచ్చు. అందుకోసమా ఇంత కష్టపడటం. బంగారం కొట్టుకు తక్కువ మంది వెళ్తారు. బియ్యం కొట్టుకు ఎక్కువ మంది వెళతారు. అలాగని బంగారం గొప్పదా? బియ్యం గొప్పదా? అనే చర్చ రానేకూడదు.

 

ఆర్కే: పుష్కరాలు అంటే పిండప్రదానం, నదిలో స్నానం చేయడానికి పరివిుతమయ్యేవి. కానీ ఇప్పుడు పుణ్యం కోసం స్నానం చేయడంలా తీసుకొచ్చారు. ఇది వాంఛనీయం కాదు కదా? నది మీద గౌరవం పోయింది. నీళ్ల మడుగులో స్నానం చేసేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? 

చాగంటి కోటేశ్వరరావు: దీన్ని అధిగమించడానికి శాస్త్రం అవకాశం కల్పించింది. ఎక్కడైనా ప్రవాహం లేకపోతే, తక్కువ నీరు ఉంటే, ఇంతమంది మునిగి ఆరోగ్యం పాడుచేసుకొనే కంటే, తలపై నీరు చల్లుకున్నా కూడా స్నానం చేసిన ఫలితం కట్టబెడతామని చెబుతోంది. ఆ చిన్న మడుగులోనే ఎలాగైనా స్నానం చేయాలని శాస్త్రం చెప్పలేదు.

 

ఆర్కే: కానీ శాస్త్రాలకు మేం ప్రతినిధులమని చెప్పుకునేవారు అదే చెబుతున్నారు.

చాగంటి కోటేశ్వరరావు: అక్కడ అంతే నీరు ఉన్నది నిజమైతే, చిన్న మడుగు ఉండి, ప్రవాహం లేకపోతే, స్నానానికి ప్రత్యామ్నాయాన్ని వాడుకోవచ్చు.

 

ఆర్కే: భక్తి అనేది ఒక విశ్వాసం, నమ్మకం, సాంత్వన కలిగించేది. కానీ భక్తి రానురాను ఒక వ్యాపారంగా మారుతోంది కదా? 

చాగంటి కోటేశ్వరరావు: అలా చేస్తే కచ్చితంగా తప్పే. దాన్ని అసలు అలా మార్చకూడదు. దాన్ని వ్యాపారంగా మార్చడం ఏమిటండీ. ప్రాణసంబంధమైన ఔషధాన్ని వేళకు ఇవ్వకపోవడమే తప్పు అంటాం కదా. మరి మనిషి జీవితోద్ధరణకు సంబంధించిన భక్తిని వ్యాపారం చెయ్యడం ఎందుకు?


అలాంటి పిచ్చి పనులను ఎవరూ ప్రోత్సహించరు


ఆర్కే: వినాయక చవితికి పెట్టే విగ్రహాల సైజ్‌ విషయంలో పోటీలు పెరిగాయి. పది రోజులు పూజలు చేసిన తరవాత నిమజ్జనం రోజున అదే విగ్రహం పైకి ఎక్కి, కాళ్లతో తొక్కడం ఎంత వరకు కరెక్ట్‌? నమ్మకం కూడా పోతోంది కదా?

చాగంటి కోటేశ్వరరావు: పూజలు చేసిన వినాయకుడిపైకి కాళ్లతో ఎక్కినప్పుడు మనసు కలుక్కుమంటుంది అంటున్నారు. మీరు అన్నదాంట్లో ఒక ఆర్తి ఉంది, నిజాయితీ ఉంది. అంతకన్నా తేలిక మార్గం లేదా అన్న ఒక ప్రశ్న ఉంది. చిన్న మూర్తిని పెట్టుకొని చేతులతో కలపకూడదా అని అడుగుతున్నారు. ఈ ఆర్తి అందరిలోకీ సహేతుకంగా ప్రసరణమైతే... చాలా సమస్యలకు అదే పరిష్కారాన్ని చూపిస్తుంది.

 

ఆర్కే: వినాయకుడికి జీన్స్‌ ఫ్యాంటు వేయడం, కరెన్సీ దండలు వేయడం.. ఏ రకమైన భక్తి? 

చాగంటి కోటేశ్వరరావు: ఇవి ఎవరికి వారు ఆలోచించుకొని దిద్దుకోవాల్సినవి. వినాయకుడి విగ్రహానికి జీన్స్‌ ఫ్యాంటు వేయడం, కరెన్సీ దండలు వేయడం... ఇవన్నీ చూడటానికి అప్పటికి బాగుంటాయేమో కానీ, అలా చేయమని ఏ శాస్త్రం చెప్పలేదు. అలాంటి పిచ్చి పనులను ఎవరూ ప్రోత్సహించరు.

 

ఆర్కే: ఈ విషయంలో మీబోటి వారి మీద బాధ్యత ఉంటుంది కదా?

చాగంటి కోటేశ్వరరావు: ఈ విషయాలు నేను అనేక పర్యాయాలు చెప్పా. వినాయక విగ్రహాన్ని తయారు చేసేటప్పుడు ఎలా చేయాలో కొన్ని రూపాలు ఉన్నాయి. మోటారు సైకిల్‌ ఎక్కినట్లు, చలనచిత్రాల్లోని భంగిమలతో వినాయకుడిని తయారు చేయడం, ఇవన్నీ శాస్త్రంలో లేవు.

 

ఆర్కే: పీఠాధిపతులుగా, మఠాధిపతులుగా ఎవరికి వారు స్వయం ప్రకటనలు చేసకోవడం, నకిలీ బాబాల వ్యవహారాలు.. ఇవన్నీ హిందూ ధర్మం పట్ల గౌరవాన్ని పెంచుతాయా? తగ్గిస్తాయా? 

చాగంటి కోటేశ్వరరావు: ఏమీ సంశయించకుండా చెప్పవచ్చు. గౌరవాన్ని తగ్గిస్తాయి.


ఆర్కే: మరి మీలాంటివారు వీటిని ఖండించొచ్చు కదా? 

చాగంటి కోటేశ్వరరావు: ఎందుకు చెప్పడం లేదు. అనేక పర్యాయాలు తలకొట్టుకు చెప్పబట్టే, ఒక్కొక్కసారి అనేక విమర్శలకు కూడా గురవుతున్నాను.

 

ఆర్కే: స్వాములు కానీ, పీఠాధిపతులు కానీ ఇతరులను అంటుకోకుండా, దూరంగా పెట్టాలని ఏ శాస్త్రం చెప్పింది? ఏ రకంగా సమర్థనీయం? ఇతర మతాల్లో ఎవరు వచ్చినా దగ్గరకు తీసుకుంటారు. ఇక్కడ మాత్రం ఇలా ఎందుకు? 

చాగంటి కోటేశ్వరరావు: నేను మాత్రం అందరినీ కౌగిలించుకుంటున్నాను. కావాలంటే కాకినాడలో నాకు సన్నిహితంగా ఉండేవారిని అడగండి.

 

ఆర్కే: మీపై ఈ అపవాదు ఉందని అనడం లేదు. 

చాగంటి కోటేశ్వరరావు: కానీ ఇలా ఉందా... అనేది ఇకపై నేను కూడా ఎప్పుడైనా వెళ్లినప్పుడు పరిశీలించి చూస్తాను. ఈ కోణంలో నేనెప్పుడూ గమనించలేదు.

 

ఆర్కే: దేవుడిని మార్చేవాళ్లు వ్యభిచారులతో సమానం అని మీరు వ్యాఖ్యానించారా? 

చాగంటి కోటేశ్వరరావు: అంతమాట నేను అననండి. వినడానికే చాలా బాధగా అనిపించింది. కాకపోతే ఆ ధోరణి వద్దు.. అని చెప్పి ఉంటాను. నేను మతమార్పిడుల గురించి మాట్లాడను. నేను పనిచేసే ఆఫీసులో నాకు ఎందరో క్రైస్తవ, ముస్లిం మిత్రులు ఉన్నారు. నాకు పై అధికారి ఒక మహమ్మదీయుడు. అయన నన్ను ప్రాణంలా చూసుకుంటారు. నేను ఆయన్ను అంత గౌరవంగా చూసుకుంటాను.


అది చేసినప్పుడు ఏబీఎన్‌ చానెల్‌ ద్వారా చేస్తాను


ఆర్కే: ధర్మప్రచారం చేసేవాళ్లు శివుడు, విష్ణువు వేరు అని చెబుతుంటారు కదా?

చాగంటి కోటేశ్వరరావు: పోతన పరమ శివభక్తుడు. విభూతి రేఖలు పెట్టుకున్నారు. ఆయన రాసిన భాగవతం మనకు ప్రామాణికమే కదా. ఇవ్వన్నీ ఈశ్వరుడికి పెద్ద సంబంధం ఉండవు. మనసు విశాలంగా ఉంటే చాలు. పది మంది కోసం బతకగలిగితే చాలు. ఆఖరుకు శరీరం పడిపోయినప్పుడు కనీసం ఐదిళ్లలో... ఆయ్యో ఆ మహానుభావుడు వెళ్లిపోయారా... అనే బాధతో అన్నం వండుకోలేకపోతే చాలు.


ఆర్కే: మనిషి జీవితానికి అర్థం, పరమార్థం ఉంటేనే పరిపూర్ణత. 

చాగంటి కోటేశ్వరరావు: భక్తి ప్రధాన ధ్యేయం అదే.

 

ఆర్కే: అయితే అది దారి తప్పుతోంది అన్నదే నా పాయింట్‌.

చాగంటి కోటేశ్వరరావు: మీరు ఎత్తి చూపించినవన్నీ కూడా రుగ్మతలే. వాటిని ఎవరికి వారు దిద్దుకోవడం చాలా మంచిది.

 

ఆర్కే: స్త్రీ పట్ల కొంచెం వివక్ష ప్రదర్శిస్తారని మీపై అపవాదు ఉంది. భర్త స్నానం చేసి విడిచిన దుస్తులు పిండి, ఆ నీటిని తలపై చల్లుకోవాలని ఎక్కడైనా అన్నారా?

చాగంటి కోటేశ్వరరావు: ఆయ్యో తప్పు కదండీ, స్నానం చేసిన బట్ట పిండి తలపై చల్లుకోవడం ఎందుకండీ. బహుశా ఇంకోలా చెప్పి ఉంటా. ఎక్కడ భర్త స్నానం చేసి విడిచిన బట్టలను భార్య పిండుతుందో అక్కడ భర్త ఆరోగ్యం ఉంటుందని శాస్త్రంలో చెప్పారు అని చెప్పి ఉంటానేమో. భర్తపై పని ఒత్తిడి తగ్గించడంలో ఇదో భాగం మాత్రమే.

 

ఆర్కే: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారుగా మీకు అధికారికంగా నియామకపత్రం వచ్చిందా?

చాగంటి కోటేశ్వరరావు: ఇంకా రాలేదు. నేను ఇంకా భారత ఆహార సంస్థలోనే పనిచేస్తున్నాను.

 

ఆర్కే: రిటైర్మెంట్‌కు ఇంటా టైం ఉంది కదా?

చాగంటి కోటేశ్వరరావు: 2018 వరకు సర్వీసు ఉంది.

 

ఆర్కే: తర్వాత జీవితం ఎలా ప్లాన్‌ చేస్తున్నారు? 

చాగంటి కోటేశ్వరరావు: ఆధ్యాత్మిక ప్రవచనాలు నాకు ఇష్టం కాబట్టి అవి చేస్తూనే, సాధ్యమైనంత సమాజహితం కోసం ప్రత్యక్షంగా. ఎక్కువగా యువతతో పాలుపంచుకుందాం అనుకుంటున్నాను. మీరు ఇలా ఉండండి.. అని వారికి దిశానిర్దేశం చేయాలనుకుంటున్నాను. వారికోసం కొంత సమయం వెచ్చించాలి.

 

ఆర్కే: ఈ కార్యాచరణకు రూపం వచ్చిందా? 

చాగంటి కోటేశ్వరరావు: ఇంకాలేదు. దానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకుంటున్నాను. నాకు కొంత ఆలోచన ఉంది.


ఆర్కే: అలాంటిది ఏదైనా ఉంటే మా సహకారం కూడా ఉంటుంది. 

చాగంటి కోటేశ్వరరావు: తప్పకుండా. పరమ సంతోషం. ఈసారి యువత కోసం ఏదైనా కార్యక్రమం చేయాలి అనుకున్నప్పుడు మీద్వారా చేస్తాను. నాకు ఒక ఆలోచన ఉంది. ఇవ్వాళ పిల్లలు ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించడం లేదు.

 

ఆర్కే: ఇప్పుడు చట్ట ఉల్లంఘన అనేది ఒక హక్కులా మారింది. 

చాగంటి కోటేశ్వరరావు: సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ టూ వీలర్స్‌ మీద వెళుతూ ప్రమాదాలకు గురై విద్యాసంవత్సరం కోల్పోయి, ఉద్యోగాలు పోయి... ఎంతమంది బాధపడుతున్నారో. అది పిల్లల్లో ఉన్న ఉద్రేకం. నేను పిల్లలను కూర్చోబెట్టి ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాల్సిన అవసరం ఏమిటి? ఆరోగ్యానికి వ్యాయామం అనేది ఎంత అవసరం. దానికి సమయం ఎందుకు కేటాయించాలి? గాంధీ గారి జీవితం ఇటువంటివి చెబుతూ... నాకు కలాం గారంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం. పిల్లలు ఆరోగ్యవంతమైన హాబీలు ఎందుకు అలవాటు చేసుకోవాలి. హాబీ మనిషిని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతుంది.... కేవలం యువతను తీర్చిదిదద్దడం కోసం... వాళ్లకు సహాయపడ్డానన్న తృప్తి కోసం నేను కొన్ని టాపిక్స్‌ రెడీ చేసుకుంటున్నాను. వాటితోటి కేవలం యువతను ఉద్దేశించి మాట్లాడాలి అనుకుంటున్నాను. అది చేసినప్పుడు ఏబీఎన్‌ చానెల్‌ ద్వారా చేస్తాను.

 

ఆర్కే: తప్పకుండా. మీరు యువతను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్న మీ లక్ష్యం నూటికి నూరు శాతం సఫలం కావాలని కోరుకుంటూ... సెలవు.

***********************

* నేను కోట్ల ఆస్తులు సంపాదించానని అనే వారు అవేవో చూపిస్తే సంతోషిస్తాను, ఆనందపడతాను.


* నా ఆఖరి శ్వాస వరకు రూపాయి తీసుకోకుండానే ప్రవచనాలు చెబుతాను. బంగారం తింటామా... అని ప్రవచనాల్లో చెబుతుంటాను. అది నాకు అన్వయం కాదా?


* చంద్రశేఖర సరస్వతి గారిని ఎంతగా ఆరాధిస్తానో అబ్దుల్‌ కలాం గారిని కూడా అంతే అభిమానిస్తాను. నా ప్రవచనాల్లో సైతం ఆయనను ఉంటంకిస్తాను. పాత కాలం ఉదాహరణనే కాకుండా ఈ కాలంలోనూ అటువంటి వారు ఉన్నారు అని చెప్పడానికి ఆయన పేరు చెబుతాను.


* భగవంతుడు సంతోషించడానికి ఎలా పూజ చేస్తావో అలా మూడు సూత్రాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి జీవితంలో ఇంకొకడు సుఖంగా ఉన్నప్పుడు మీరు సంతోషంగా సుఖంలో పాలుపంచుకోండి.దేవుడు మీరు గుడికెళ్లినంత సంతోషిస్తాడు. అలాగే ఇంకొకడి దుఃఖానికి మీరు కారణం కాకుండా ఉండండి.

 

* గంగానది స్నానం చేయండి. అయితే పాపాలు చేస్తూ గంగలో మునుగుతాం అంటే కుదరదు. శివుడేమీ అమాయకుడు కాదు కదా. సకలశాస్త్రాలకు కర్త ఆయన .అయినపుడు పాపాలను ఆయన ఎందుకు ప్రోత్సహిస్తాడు.


* భగవంతునికి కిరీటం పెడితే నాకు కలిసొస్తుందని అనుకోవడం తప్పు. అడ్డగోలుగా సంపాదించి కిరీటం పెట్టుమని ఎక్కడా చెప్పలేదు. అలాంటి పనులు చేయకూడదు.


* అన్నదానం చేయండి. దేవాలయంలో ఒక కళ్యాణమండపం కట్టించండి. దాన్ని తక్కువ ధరకు పేద వాళ్లకు అద్దెకు ఇస్తే పెళ్లిళ్లు జరిపించుకుంటారు. పది చెట్లు పెంచండి. నృత్యం చేసే వాళ్లకు అన్ని వేళలా డయాస్‌లు దొరకవు. దేవాలయంలో ఉందనుకోండి. పిల్లలు సాయంత్రవేళ నృత్యం చేసుకోవడానికి బాగుంటుంది.


* ఆదిత్య హృదయం చెప్పినప్పుడు అగస్త్య మహర్షి రాముడు ఒక్కడికే చెప్పాడు. భగవద్గీతను కృష్ణుడు అర్జునుడొక్కడికే చెప్పాడు. భాగవతాన్ని శుకబ్రహ్మ పరీక్షిత్తు ఒక్కడికే చెప్పాడు. ఎంతమంది ఉన్నారని చూసుకొని చెప్పలేదుగా. నేను ప్రవచనం చెప్పేటప్పుడు కూడా యోగ్యుడు ఒక్కడే ఉన్నా చాలు.


* నేను ప్రవచనానికి వస్తే పంచె కట్టుకుంటా. ఆఫీసుకు వెళ్తే ప్యాంటు వేసుకుంటా. పెళ్లికి వెళ్తే కుర్తా, లాల్చీ వేసుకుంటా. ఇంట్లో సంధ్యావందనం చేసుకుంటూ ధావళీ కట్టుకుంటా. మీకు నా మీద గౌరవం ఉంది. పంచె వేసుకోవడం కోటేశ్వరరావుగారి అలవాటు... అందుకని ప్యాంటు వేసుకున్న కోటేశ్వరరావును కొడతానంటే ఆ దెబ్బలు నాకేగా తగిలేది. విష్ణువుగా పూజించి శివుడిగా తిట్టకండి. దుర్గగా పూజించి గణపతిగా తిట్టకండి. ఆయన ఇన్ని రూపాలతో ఉన్నాడు అన్నరోజు మీరు ఏ రూపానికి పువ్వు వేసినా అన్ని రూపాలకూ చెందుతుందని తెలుసుకోండి. అంతేకానీ రూపం దగ్గర కట్టుబడి పోకండి.


* మీ ఉపన్యాసాలు విన్న తర్వాత నా భర్త ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని చెప్పినప్పుడు, మీ మాటలు విని మా అన్నదమ్ములు కలిసి ఉంటున్నాం అన్నప్పుడు, మానవీయ సంబంధాలు బాగుపడినప్పపడు, సమాజం కోసం పదిమంది నిలబడుతున్నాం. మేం మారాం... అని చెప్పినప్పుడు ఎంతో సంతోషించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇదే కదా నా ప్రయోజనం. ఇందుకే కదా ప్రవచనం చేసేది. చెయ్యని తప్పుకు రాళ్లేసినప్పుడు, విషయం తెలియకుండా చిలువలు పలవలు చేస్తున్నప్పుడు మనసు కొంచెం బాధపడుతుంది. అయినా ఈ రెండూ లేకపోతే జీవితం ఎందుకు అవుతుంది.


* స్త్రీ లేని పురుషుడి జీవితంలో అభ్యున్నతి లేదు. కారణం ఏమిటంటే ఆమె పురుషుని శాంతి స్థానం. ఆమె లేకపోతే శాంతి లేదు. స్త్రీ వైశిష్ట్యంపై ఖమ్మంలో మూడు రోజులు మాట్లాడాను. మహాభారతంలో కుంతి, మహాభారతంలో గాంధారి అంశాలపై మాట్లాడాను. భర్త స్త్రీకి ఎంత బాసటగా నిలబడాలో, అయినదానికి కానిదానికి భార్య మీద విసుక్కోవడం ఎంత తప్పో, తాను ఎంత ప్రేమతో నిలబడాలో, అర్థం చేసుకోవాలో తరచుగా చెబుతూ ఉంటాను. స్త్రీ కూడా పురుషుడి పట్ల ఎంత ప్రేమతో ఉండాలో చెబుతుంటాను. భార్యాభర్తల మధ్య కలహం మధుర స్మృతి కావాలి తప్ప దెబ్బలాడుకోకూడదు.

Updated Date - 2020-05-08T22:15:38+05:30 IST