నేడు పుర పాలకుల ఎన్నిక

ABN , First Publish Date - 2021-11-22T06:22:51+05:30 IST

జిల్లాలో తాజాగా ఎన్నికలు జరిగిన కొండపల్లి, జగ్గయ్యపేట పురపాలక సంఘాలకు చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ల ఎన్నిక తీవ్ర ఉత్కంఠ మధ్య సోమవారం జరగనుంది.

నేడు పుర పాలకుల ఎన్నిక

చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నికలో తీవ్ర ఉత్కంఠ

కొండపల్లిలో ఎక్స్‌ అఫిషియో సభ్యులకు ఆహ్వానం


జిల్లాలో తాజాగా ఎన్నికలు జరిగిన కొండపల్లి, జగ్గయ్యపేట పురపాలక సంఘాలకు చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ల ఎన్నిక తీవ్ర ఉత్కంఠ మధ్య సోమవారం జరగనుంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొండపల్లిలో టీడీపీ విజయం సాధించగా, ఇక్కడ ఎక్స్‌ అఫీషియో ఓటు అవసరమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నిక సక్రమంగా జరిగేందుకు సహకరించాలని అధికారులు రెండు ప్రధాన రాజకీయ పార్టీలనూ కోరారు. 


ఇబ్రహీంపట్నం, నవంబరు 21 : కొండపల్లి పురపాలక సంఘ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక సజావుగా జరిగేందుకు సహకరించాలని ఎన్నికల ప్రత్యేక అధికారి శివనారాయణరెడ్డి రెండు ప్రధాన రాజకీయ పార్టీలనూ కోరారు. కొండపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గెలుపొందిన 29 మంది వార్డు సభ్యులతో పాటు ఎక్స్‌అఫిషియో సభ్యులు ఎంపీ కేశినేని శ్రీనివాస్‌, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌లను ఎన్నికలకు ఆహ్వానించనున్నట్టు తెలిపారు. 16 మంది సభ్యుల కోరం ఉన్నట్లయితే చైర్మన్‌, ఇద్దరు వైస్‌ చైర్మన్ల ఎన్నికలు జరపనున్నట్లు తెలిపారు. కోరం లేకపోతే మరుసటి రోజుకు వాయిదా వేసి, ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. తొలుత 29మంది సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించనున్నట్లు తెలిపారు. 


టీడీపీ సభ్యులకు విప్‌ జారీ

కొండపల్లి పురపాలక సంఘ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ సభ్యులకు ఆ పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ విప్‌ను జారీ చేశారు. ఆదివారం మున్సిపల్‌ కార్యాలయంలో ఎన్నికల ప్రత్యేక అధికారి శివనారాయణరెడ్డికి విప్‌ జారీచేసిన పత్రాలను టీడీపీ నాయకులు అందజేశారు. పత్రాలను అందజేసినవారిలో టీడీపీ నాయకులు రామినేని రాజశేఖర్‌, సుంకర విష్ణుకుమార్‌, తమ్మా రాంబాబు, కూచిపూడి దిలీప్‌ కుమార్‌, మిక్కిలి విజయ్‌కుమార్‌, కొత్తపల్లి ప్రకాశ్‌, జాన్‌బాబు తదితరులున్నారు. 


ఎన్నికల అధికారుల నియామకం

జగ్గయ్యపేట : జగ్గయ్యపేట మునిసిపాలిటీకి సోమవారం జరగనున్న చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నికలకు పరిశీలకుడిగా ఐఏఎస్‌ అధికారి మురళీధర్‌రెడ్డి, నిర్వహణ అధికారిగా సాంఘిక సంక్షేమశాఖ డీడీ సరస్వతిని ఎన్నికల కమిషన్‌ నియమించిందని మునిసిపల్‌ కమిషనర్‌ సుభాష్‌ చంద్రబోస్‌ చెప్పారు. ఈ మునిసిపాలిటీ ఎన్నికల్లో 17 వార్డులను వైసీపీ, 14 వార్డులను టీడీపీ గెలుచుకున్న విషయం తెలిసిందే.


జగ్గయ్యపేటలో ఉత్కంఠ 

వైసీపీలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.  వైసీపీ అభ్యర్ధుల ఎంపిక సమయంలోనే 11వ వార్డు నుంచి పోటీ చేసిన పట్కారీ సామాజికవర్గానికి చెందిన రంగాపురం రాఘవేంద్రను చైర్మన్‌గా ప్రభుత్వవిప్‌ సామినేని ఉదయభాను ప్రకటించారు. వైస్‌చైర్మన్లుగా ఉదయభాను తనయుడు వెంకట కృష్ణప్రసాద్‌, తుమ్మల ప్రభాకర్‌లను ఖరారు చేసినట్టు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అయితే స్థానిక నేతల ఆలోచనలకు విరుద్ధంగా అధిష్ఠానం కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. పరోక్ష పద్ధతిలో ఎంపిక అయినప్పటీకీ, ముందుగానే పార్టీ అభ్యర్థిని ప్రకటించినందున అధిష్ఠానానికి నచ్చచెబుతున్నట్టు తెలుస్తోంది. వైస్‌చైర్మన్‌ పదవులు సైతం పట్టణంలో మెజార్టీ ఉన్న ఇతర వర్గాలకు కేటాయించాలని అధిష్ఠానం సూచించినట్టు తెలుస్తోంది. దీంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2021-11-22T06:22:51+05:30 IST