‘కేడీ’సీసీ

ABN , First Publish Date - 2020-11-03T11:14:25+05:30 IST

కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంకు (కేడీసీసీ)లో పాలకవర్గానికి, ఉద్యోగులకు..

‘కేడీ’సీసీ

చైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రావుపై ఉద్యోగుల తిరుగుబాటు

అక్రమార్కులకు అందలం.. ఉద్యోగులపై వేధింపులు

అకారణంగా బండ బూతులు

రూ.40 కోట్ల కుంభకోణంలో నిందితుడికి పదోన్నతి

యూనియన్‌లో సభ్యత్వం ఉన్న ఉద్యోగుల బదిలీ

డిఫ్యాక్టో చైర్మన్‌గా చక్రం తిప్పుతున్న ‘గోపాలం’

ఈనెల 17 నుంచి రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం


విజయవాడ, ఆంధ్రజ్యోతి: కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంకు (కేడీసీసీ)లో పాలకవర్గానికి, ఉద్యోగులకు నడుమ యుద్ధం మొదలైంది. అవినీతిపరులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ, పనిచేసే వారికి కేవలం యూనియన్‌లో సభ్యత్వం ఉందన్న సాకుతో వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఉద్యోగులు తిరుగుబాటు ప్రకటించారు. చైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రావు ఉద్యోగ వ్యతిరేక విధానాలపై ఉద్యమానికి సిద్ధమవుతూ.. కేడీసీసీ బ్యాంకులో ‘కేడీ’లపై పిడికిలి బిగించారు.


కేడీసీసీ బ్యాంకు చైర్మన్‌గా యార్లగడ్డ వెంకట్రావు 2019, డిసెంబరులో బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచే వివాదాస్పద నిర్ణయాలతో ఉద్యోగుల్లో కలకలం రేపారు. యూనియన్‌లో సభ్యత్వమున్న ఉద్యోగులపై కక్షసాధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. యూనియన్‌లో సభ్యత్వమున్న ఉద్యోగి చైర్మన్‌ వద్దకు వెళ్తే, బూతులు తిడుతున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సహకార బ్యాంకుల్లో 2,800 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 2వేల మంది ఉద్యోగులు ఏపీ కో-ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం కలిగి ఉన్నారు. అలాంటి యూనియన్‌ను మనుగడలో లేకుండా చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకుని చైర్మన్‌ వ్యవహరిస్తున్నారన్నది ఉద్యోగుల ఆరోపణ. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలకే సుమారు 200 మంది ఉద్యోగులను ఇష్టారాజ్యంగా బదిలీ చేసేశారు. లాక్‌డౌన్‌ వేళ బదిలీలు చేయడం నిబంధనలకు విరుద్ధం. కానీ, యూనియన్‌లో సభ్యత్వం ఉన్న ఉద్యోగులపై కక్షసాధింపు ధోరణితో ఇలా చేశారని తెలుస్తోంది.  


అక్రమార్కులకు అండగా..

వెంకట్రావు బాధ్యతలు స్వీకరించడానికి కొన్ని నెలల ముందు అంటే.. 2018-19లో కేడీసీసీ బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగుచూసింది. రుణాల మంజూరులో సుమారు రూ.40 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఐదుగురు ఉద్యోగులను బాధ్యులుగా గుర్తించి 2019, జూన్‌ 28న సస్పెండ్‌ చేశారు. వాస్తవానికి సస్పెండ్‌ చేసిన ఉద్యోగులకు చార్జిమెమో ఇచ్చి, వారి వివరణ తీసుకుని, దానిపై మరోసారి విచారణ జరిపి, ఆరోపణలు రుజువైతే ఉద్యోగాల నుంచి తొలగించాలి. కానీ, సస్పెండ్‌ అయినవారిపై ఏడాదిన్నరగా ఎలాంటి విచారణ కానీ, చర్యలు కానీ లేవు.


ఏడాదిన్నరగా వారికి నెలకు రూ.4 లక్షలు జీతాలు చెల్లిస్తూనే ఉన్నారు. దీనికి ప్రధాన కారణం డిఫ్యాక్టో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తితో పాటు ఏజీఎం స్థాయిలో ఉన్న మరో వ్యక్తి. వీరు చైర్మన్‌ను తప్పుదారి పట్టించి, అక్రమార్కుల నుంచి భారీ ఎత్తున ముడుపులు స్వీకరించి కేసును నీరుగార్చే పనిలో ఉన్నట్టు సమాచారం. రూ.40 కోట్ల కుంభకోణంలో కీలక పాత్రధారి అయిన మేనేజర్‌ స్థాయి వ్యక్తికి ఏకంగా పదోన్నతి కల్పించి ఏజీఎం సీటులో కూర్చోబెట్టారు. జిల్లాకు చెందిన ఓ మంత్రికి ఈయన సమీప బంధువు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న తన బంధువుకు అక్రమంగా భారీ రుణాన్ని మంజూరు చేశారు. 82 సెంట్ల వ్యవసాయ భూమిని నివాసస్థలంగా చూపి మచిలీపట్నం కేడీసీసీ బ్యాంకులో రూ.1.50 కోట్ల రుణం ఇప్పించారు. వైసీపీ అధికారంలోకి రావడంతో స్కామ్‌ బయటపడితే తన మంత్రి పదవికి ఎక్కడ ఎసరు వస్తుందోనని ఆ మంత్రిగారు కొన్ని రోజులకే రుణాన్ని తీర్చేశారు. 


ఆస్తులు జప్తు చేయాలని ఆదేశించినా..

వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా చూపి, వాస్తవ విలువ కన్నా 10 నుంచి 20 రెట్లు రుణాలను మంజూరు చేసి సుమారు రూ.40 కోట్ల కుంభకోణానికి పాల్పడిన ఏజీఎం కాగిత రామకృష్ణ, ఈయనతో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లాల్సిన వరాలమ్మ, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ హోదాలో ఉన్న నిరంజనీ, జీఎం చంద్రశేఖర్‌, సీఈవో వీరబాబును సస్పెండ్‌ చేశారు. వీరిపై పెడన పోలీసుస్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. వీరి ఆస్తులను జప్తు చేసి బ్యాంకుకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని జిల్లా సహకార శాఖ అధికారి కేడీసీసీ బ్యాంకు సీఈవోను ఆదేశించారు. ఏడాదిన్నర అయినా ఆ ఆదేశాలు అమలుకు నోచుకోలేదు. దీనికి ప్రధాన కారణంగా ఈ కుంభకోణంలో బడా వైసీపీ నేతలు ఉండటమే. 


కోట్లు దోచేసిన వ్యక్తి చైర్మన్‌కు ఆప్తుడు

వంగవీటి రంగా హత్య సమయంలో సహకార బ్యాంకులను దహనం చేశారు. దీన్ని కొందరు బ్యాంకు ఉద్యోగులు వరంగా మార్చుకున్నారు. దొంగ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను సృష్టించి బ్యాంకు సొమ్మును కోట్లలో కొట్టేశారు. దీనిపై ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన అధికారులు దానికి బాధ్యుడిగా గుర్తించిన ఉద్యోగిని సస్పెండ్‌ చేశారు. నాలుగేళ్లు సస్పెన్షన్‌లో ఉన్న ఆ ఉద్యోగి రాజకీయ పైరవీలతో తిరిగి విధుల్లో చేరారు. ప్రస్తుతం ఈయన ఏజీఎం స్థాయిలో బ్యాంకులో చక్రం తిప్పుతున్నారు. చైర్మన్‌ ఈయన్ను విశ్వసిస్తుండటంతో ఆ ఉద్యోగి ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. ఈయనతోపాటు డిఫ్యాక్టో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ‘గోల్‌మాల్‌ గోపాలం’ బ్యాంకు సొమ్మును పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోయినా, అర్హులు కాకపోయినా తాను చెప్పిన వారికి రుణాలు ఇవ్వాల్సిందేనని ఈ డిఫ్యాక్టో చైర్మన్‌ హుకుం జారీ చేస్తున్నారు.



చాలామంది వెంకట్రావులనే చూశాం..: యార్లగడ్డకు ఏఐబీఈఏ హెచ్చరిక

విజయవాడ సిటీ : కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రావు ఉద్యోగ సంఘాల విచ్ఛిన్నానికి సమయం వృథా చేయకుండా బ్యాంకు అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆల్‌ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐబీఈఏ) జాతీయ కార్యదర్శి, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి బీఎస్‌ రాంబాబు హితవు పలికారు. ఇటువంటి వెంకట్రావులను చాలామందినే చూశామన్నారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏఐబీఈఏలో సభ్యత్వమున్న ఉద్యోగులను యార్లగడ్డ  వెంకట్రావు వేధింపులకు గురిచేస్తున్నారని, కక్షసాధింపు ధోరణితో బదిలీలు చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులను బూతులు తిడుతున్నారని మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా, బ్యాంకు అభివృద్ధికి కష్టపడి పనిచేసే వారిపై చర్యలు ఏమిటని ప్రశ్నించారు. బ్యాంకింగ్‌ రంగంపై అవగాహన లేని యార్లగడ్డను ప్రభుత్వం చైర్మన్‌గా నియమించిందని, సభ్యులు ఎన్నుకోలేదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.


ఆయన వ్యవహారశైలి మార్చుకోవాలని, లేదంటే జాతీయ బ్యాంకు ఉద్యోగులు, సహకార బ్యాంకు ఉద్యోగులను కలుపుకొని ఈనెల 17 నుంచి రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని రాంబాబు హెచ్చరించారు. కొవిడ్‌ కాలంలో బదిలీల విషయాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వి.రాధాకృష్ణమూర్తి, కృష్ణాజిల్లా బ్యాంక్‌ ఉద్యోగుల సమన్వయ సమితి కార్యదర్శి వై.శ్రీనివాసరావు, ఏపీసీసీబీఏ చైర్మన్‌ తోట రామారావు, నాయకులు సీహెచ్‌ మాధవరావు,  ఏవీ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-03T11:14:25+05:30 IST