చైన్‌స్నాచర్ల సవాల్‌

ABN , First Publish Date - 2022-05-28T04:35:26+05:30 IST

చైన్‌స్నాచర్ల సవాల్‌

చైన్‌స్నాచర్ల సవాల్‌

- జిల్లాలో భీతిగొల్పుతున్న వరుస ఘటనలు

- పట్టపగలే బంగారు ఆభరణాల  అప్పహరణ

- ఇప్పటికీ పోలీసులకు చిక్కని వైనం

- ఇతర రాష్ట్రాల ముఠాపైనే అనుమానం

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

మహిళలు బంగారు ఆభరణాలను మెడలో వేసుకుని బయట తిరగాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఏవైపు నుంచి.. ఎవరు వచ్చి ఆభరణాలు ఎత్తుకుపోతారోనన్న భయం వెంటాడుతోంది. జిల్లాలో ఇటీవల జరుగుతున్న సంఘటనలే ఇందుకు కారణం. పోలీసులకే సవాల్‌ విసిరేలా చైన్‌స్నాచర్లు వ్యవహరిస్తున్నారు. పట్టపగలే అందరూ చూస్తుండగానే... బైక్‌పై వచ్చి మెడలో చైన్‌లను తెంచుకుపోతున్నారు. వారం రోజుల వ్యవధిలో జిల్లాలో నాలుగు చోరీ ఘటనలు జరగ్గా.. ఇప్పటికీ చోరీకి పాల్పడినవారు పోలీసులకు దొరకలేదు. జిల్లాలో గతంలో ఏటీఎం చోరీ ఘటనల నుంచి... ఇతరత్రా చోరీలు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలే పాల్పడినట్టు నిర్ధారణ అయ్యాయి. జిల్లాలో చైన్‌స్నాచింగ్‌ ఘటనలు పశ్చిమబంగ రాష్ట్రానికి చెందిన ముఠా పనే అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే చోరీకి ప్రణాళిక వేసుకోవడం.. అందుకు తగ్గట్టుగా బైక్‌ నంబర్‌ ప్లేట్లతో పాటు వేసుకున్న దుస్తులను కూడా మార్చేస్తూ తప్పించుకుంటున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాన్ని నియమించి.. ఇతర రాష్ట్రాలకు పంపారు. కానీ ఇంకా కేసు దర్యాప్తు దశలోనే ఉంది.  


వారంలో నాలుగు ఘటనలు

- ఈనెల 18న జలుమూరు జర్జంగి రోడ్డులో సూరమ్మ అనే మహిళ మెడలో బంగారు పుస్తెలతాడును బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తెంచుకుని వెళ్లిపోయారు. 

- ఈనెల 19న శ్రీకాకుళం కాకివీధికి చెందిన బోగి లక్ష్మణరావు తన భార్య రాధాకుమారితో కలిసి ద్విచక్ర వాహనంపై రామలక్ష్మణ జంక్షన్‌ వైపు  వెళ్తున్నారు. సౌత్‌ఇండియా షాపింగ్‌ మాల్‌(సూర్యమహల్‌ జంక్షన్‌ దగ్గర) సమీపంలో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వీరిని అనుసరించారు. రాధాకుమారి మెడలో ఉన్న ఏడు తులాల బంగారు ఆభరణాలను తెంచుకుని పరారయ్యారు. బైక్‌ డ్రైవ్‌ చేస్తున్న వ్యక్తి హెల్మెట్‌ ధరించగా.. వెనుక కూర్చున్న వ్యక్తి మాస్క్‌ పెట్టుకున్నట్లు అక్కడ సీసీ పుటేజీలో నమోదైంది. కానీ, ఇంతవరకూ చైన్‌స్నాచర్లు పోలీసులకు చిక్కలేదు. జనాలు రద్దీగా ఉన్న ప్రాంతంలో.. పట్టపగలే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది. 

- అదేరోజు (19న) మధ్యాహ్నం ఇచ్ఛాపురం పట్టణంలో శ్రీకాకుళంలో చోరీకి పాల్పడిన ఇద్దరు యువకులే షర్టులను మార్చేసి ఓ మహిళ మెడలో రెండుతులాల బంగారు చైన్‌ను తెంచుకుపోయారు. ఈ రెండు ఘటనలు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. 

- ఈ నెల 25న ఆమదాలవలస మండలం వంజంగి గ్రామానికి చెందిన ఎండ రమణమ్మ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నుంచి వస్తూ... బలగలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అదేసమయంలో వెనుకనుంచి ఓ యువకుడు బైక్‌పై వచ్చి రమణమ్మ మెడలో మూడు తులాల బంగారు చైన్‌ను అపహరించుకుని బొందిలీపురం వైపు పారిపోయాడు. ఎక్కడా సమీప ప్రాంతంలో కూడా సీసీ కెమెరాలో చోరీకి పాల్పడిన వ్యక్తి సంచారం రికార్డు కాలేదు. ఈ ఘటనలు పోలీసులకు సవాల్‌ విసురుతున్నాయి.


గతంలో చోరీలు ఇవి... 

- శ్రీకాకుళం నగరం దమ్మలవీధిలో గత ఏడాది డిసెంబర్‌లో మహిళ మెడలో నుంచి బంగారు తాడును తెంచుకుని పారిపోయారు. 

- శ్రీకాకుళంలో వంశధార క్వార్టర్స్‌, కిల్లి క్వార్టర్స్‌లో మూడున్నతర తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. 

- ఇచ్ఛాపురంలో గతేడాది విజయదశమినాడు బైక్‌పై వెళ్తున్న దంపతుల మెడలో 12తులాల చైన్‌, పుస్తెలతాడును అపహరించుకుని పారిపోయారు. 

- శ్రీకాకుళంలో ఈనెల 1న లిఫ్టు అడిగిన వ్యక్తిని తీసుకువెళ్తామని చెప్పి.. నాగావళి నది అవతల బైక్‌ నిలిపివేసి ఆ వ్యక్తి నుంచి మొబైల్‌ ఫోన్‌, కొంత డబ్బులను బెదిరించి తీసుకుని పారిపోయారు. 

- గతేడాది మే నెలలో పార్వతీశంపేటకు సమీపంలో మహిళ మెడలోనుంచి రెండుతులాల చైన్‌ను అపహరించారు. 

- 2020 నవంబరులో ఆమదాలవలసలో ఇద్దరి మహిళల మెడలోనుంచి ఆరున్నర తులాల చైన్‌, తాడును తెంచుకుని పారిపోయారు. ఇటువంటి తరహా ఘటనలు పెరుగుతుండడంతో జిల్లావాసులు భయాందోళన చెందుతున్నారు. 

  

నిఘా పెంచాల్సిందే  

దిశ యాప్‌ వినియోగం, ఆపద వేళ ఎలా స్పందించాలి... సహాయం కోసం ఏ నంబర్‌ను డయల్‌ చేయాలనే దానిపై పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. కానీ నిఘా మరింత కఠినతరం చేయకుంటే చైన్‌స్నాచర్స్‌కు అడ్డుకట్ట పడే వీలులేదు. రెండేళ్ల కిందట అన్ని ప్రధాన జంక్షన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ... నిఘా కంటికి కొన్ని ఘటనలు చిక్కడం లేదు. శ్రీకాకుళంలో ఈనెల 19న జరిగిన చోరీకి సంబంధించి సౌత్‌ఇండియా షాపింగ్‌మాల్‌లో సీసీ కెమెరాల్లో రికార్డుఅయ్యింది. దీనిమేరకు దర్యాప్తు వేగవంతం చేశారు. నగరంలో ప్రధాన జంక్షన్ల వద్ద.. నగరం దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లే చోట్ల పోలీసు నిఘా ఏర్పాటుచేస్తే కొంతమేర ఫలితముంటుంది. జిల్లా అంతటా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కెమెరాల పనితీరుపైనా పరిశీలించాలి. కేవలం రాత్రి బీట్స్‌ మాత్రమే కాకుండా.. పగటిపూట మఫ్టీలో పోలీసులు సంచరించి.. అనుమానిత వ్యక్తుల  కదలికలు గుర్తుపట్టేలా చర్యలు తీసుకోవాలి. చోరీల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపడితేనే.. జిల్లా ప్రశాంతంగా ఉంటుంది.  


పటిష్టం చేశాం 

జిల్లా అంతటా నిఘా పటిష్టం చేశాం. టెక్నాలజీ ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. చైన్‌స్నాచింగ్‌లపై ప్రత్యేక బృందాలు విచారణ కొనసాగిస్తున్నాయి.  

- జీఆర్‌ రాధిక, ఎస్పీ


Updated Date - 2022-05-28T04:35:26+05:30 IST