ఛలో ఛలో ఛలో...

ABN , First Publish Date - 2021-02-15T05:54:14+05:30 IST

ఛలో ఛలో ఆంధ్రరక్త పుత్రులారా కాళ్ళ కింద నేల వెళ్ళిపోతే మనిషి బతుకు ఎక్కడా కళ్ళ ముందు ఉక్కు వెళ్ళిపోతే...

ఛలో ఛలో ఛలో...

ఛలో ఛలో ఆంధ్రరక్త పుత్రులారా

కాళ్ళ కింద నేల వెళ్ళిపోతే

మనిషి బతుకు ఎక్కడా

కళ్ళ ముందు ఉక్కు వెళ్ళిపోతే

విశాఖ ఉనికి ఎక్కడా

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ

విశాఖ ఉక్కు హిస్టరీ

ఆంధ్ర జాతి ఖ్యాతి అది

తెలుగు నేల గౌరవమది గర్వమది

ముప్పది రెండు ప్రాణాల త్యాగ ఫలితం అది

ఛలో ఛలో ఛలో...

విశాఖవాసులారా

ఛలో ఛలో ఛలో

ఆంధ్ర రక్త పుత్రులారా

కబడ్దార్‌ చెప్పాలి కేంద్ర ప్రభుత్వానికి

కదలకుంటే మన బతుకులు ఇక పాతాళానికీ

ఛలో ఛలో ఛలో !!


చరణం 1:

అరువై ఎనిమిది గ్రామాల ప్రజల త్యాగార్పణం

ఇరవై మూడు వేల ఎకరాల భూసమర్పణం

జన్మహక్కుగా తలచే ఆంధ్రుల ఊపిరి కోశం

ముప్పైఎనిమిది వేల ఉద్యోగుల ఉచ్ఛ్వాసం నిశ్వాసం

అమరులైన వీరుల నులువెచ్చటి నెత్తుటి దీపం

నిర్వాసిత నిరుపేదలు నిలిపిన రూపం

ఛలో ఛలో ఛలో

ఆంధ్రరక్త పుత్రులారా


చరణం 2:

విశాఖ ఉక్కు అంటే సంకల్ప కల్పవల్లి

లక్ష కుటుంబాల కడుపు నింపే కన్నతల్లి

ఆ తల్లిని చెరపట్టి

అంగట్లో నిలబెట్టి

అంగాంగం తూకమెట్టి

అమ్ముకు తింటామంటే

కళ్ళు చెవులు నోరు మూసుకోదు విశాఖబిడ్డ

ఉక్కు కొలిమి అవుతుంది

ఉత్తరాంధ్ర పోరుగడ్డ

ఛలో ఛలో ఛలో

ఆంధ్ర రక్త పుత్రులారా


చరణం 3:

ఇష్టరాజ్యంగా కార్పోరేట్లకి

మీరమ్మ దలచి

నష్టాలని చెబితే ఎలా

సిగ్గులజ్జ విడిచి

దేశంలో మిగతా ఫ్యాక్టరీలకిచ్చినట్టు

వేయికోట్లు దొబ్బి ఇనుపగనులు ఎందుకివ్వలేదు

సాలీనా రెండుకోట్లు అదనపు ఖర్చు

తెలుగునేలపై ఎందుకు వివక్షత చిచ్చు

ఛలో ఛలో ఛలో

ఆంధ్ర రక్త పుత్రులారా


చరణం 4:

పోసుకోలు కబురుచెప్పి పోస్కోను విదేశికిస్తె

అయిదుకోట్ల ఉక్కు పిడికిళ్ళ తుఫానొస్తుంది

ఇస్పాత్‌ నిగమంటె పాతనోట్ల రద్దు కాదు

తస్మాత్‌ జాగ్రత్త జన సునామి పొంగుతుంది

మోదీ అమిత్‌షాల కుట్ర బద్దలు కొడుతాం

ప్రాణాలను ఒడ్డి ఉక్కు తల్లిని కాపాడుతాం

ఛలో ఛలో ఛలో

ఆంధ్ర రక్త పుత్రులారా !! కాళ్ళ కింద !!

సుద్దాల అశోక్‌ తేజ


Updated Date - 2021-02-15T05:54:14+05:30 IST