చలో లైబ్రరీ...

ABN , First Publish Date - 2022-05-13T06:19:43+05:30 IST

చలో లైబ్రరీ...

చలో లైబ్రరీ...
ప్రాంతీయ గ్రంధాలయంలో పుస్తకపఠంలో నిమగ్రమైన ఉద్యోగార్ధులు

నిరుద్యోగులతో కిటకిటలాడుతున్న గ్రంథాలయాలు

వరుస ఉద్యోగ నోటిఫికేషన్లతో పెరిగిన డిమాండ్‌

ఉదయం నుంచి రాత్రివరకు పుస్తకాలతో కుస్తీ

స్టడీ మెటీరియల్‌, సౌకర్యాలను కల్పిస్తున్న  రాష్ట్ర ప్రభుత్వం 

నగరంలోని కేంద్ర, ప్రాంతీయ గ్రంథాయాల్లో జోరుగా ప్రిపరేషన్‌


రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేస్తోంది. దీంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు నిరుద్యోగులు కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగాలను సాధించేందుకు సర్వశక్తులను ఒడ్డుతున్నారు. రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. పుస్తకాల్లో మునిగి తేలుతున్నారు. వారి వారి జిల్లా  పోస్టుల కోసం ప్రయత్నం చేస్తూనే అటు జోన్‌ స్థాయి, ఇటు మల్టీజోన్‌ స్థాయి ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. అయితే పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఉద్యోగార్థులు ఎక్కువగా గ్రంథాలయాలను ఆశ్రయిస్తున్నారు. తమకు కావలసిన స్టడీమెటీరియల్‌ కోసం గ్రంథాలయాల్లో వెతుక్కుంటున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రంథాలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. 


హనుమకొండ, మే 12 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖాళీల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించడంతో పాటు భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీకి టెట్‌ నోటిఫికేషన్‌ను కూడా ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నిరుద్యోగులు ప్రైవేటు కోచింగ్‌లకు పోలేని ఉద్యోగార్థులు ఎక్కువగా గ్రంథాలయాల మీద ఆధారపడుతున్నారు. గ్రామాల్లోని నిరుద్యోగ యువత తమకు కావలసిన పుస్తకాలు, ఇతర స్టడీ మెటీరియల్‌ కోసం నిత్యం జిల్లా కేంద్రంలోని గ్రంథాయాలకు వచ్చి పోతున్నారు. కొందరు ఇక్కడే గదులు అద్దెకు తీసుకొని ఉంటూ చదువుకుంటున్నారు. 


గ్రంథాలయాలు కిట కిట..

ఉద్యోగార్ఢులతో హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌ సమీపంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం, వరంగల్‌ రంగంపేటలోని ప్రాంతీయ గ్రంథాలయం, అలాగే మండల కేంద్రాలోని శాఖాగ్రంథాలయాలు కిటకిటలాడుతున్నాయి.  జిల్లా, ప్రాంతీయ గ్రంథాలయాలకు ప్రతీరోజు 800 నుంచి 1000 మంది వరకు అభ్యర్ధులు చదువుకు కోవడానికి వస్తున్నారు. జిల్లా గ్రంథాలయాన్ని ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు, శాఖా గ్రంథాలయాలను ఉదయం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు. ఉద్యోగ ప్రకటనలు విడుదలయ్యాక వేళల్లో మార్పులు చేశారు. ఉదయం గ్రంథాలయానికి వచ్చిన వారు రాత్రి వరకు అక్కడే ఉండి చదువుకుంటున్నారు. అభ్యర్థుల ఆకలి తీర్చేందుకు జిల్లా గ్రంథాలయ సంస్థలో రూ.5 భోజనాన్ని సమకూరుస్తోంది.  


రూ. 3. కోట్లతో అభివృద్ధి

హనుమకొండ జిల్లాలో ఒక జిల్లా గ్రంథాలయం, ఒక ప్రాంతీయ గ్రంథాలయం, ఏడు శాఖా గ్రంథాలయాలున్నాయి. హనుమకొండ పబ్లిక్‌ గార్డెన్‌ సమీపంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఇటీవలే రూ.1.62కోట్ల వ్యయంతో అభివృద్ధి చేశారు. అలాగే వరంగల్‌ సెంట్రల్‌ జైలు సమీపంలోని ప్రాంతీయ గ్రంథాలయాన్ని రూ.1.22 కోట్లతో తీర్ధిదిద్దారు. ఏడు శాఖా గ్రంథాలయాలను మరో రూ.22లక్షల వ్యయంతో అభివృద్ధి చేశారు. పాఠకుల పుస్తక పఠనానికి వీలుగా వీటిలో అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్‌ను దృష్టిలో పెట్టుకొని వారు పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు వీలుగా అన్ని సౌకర్యాలను కల్పించారు. జిల్లా, ప్రాంతీయ గ్రంథాలతో పాటు శాఖా గ్రంథాలయాల్లో సైతం అదనంగా లైట్లను ఏర్పాటు చేశారు. 


వేసవిని దృష్టిలో పెట్టుకొని ఏసీలు, కూలర్లు ఏర్పాటు చేశారు. ఒక్కోటి రూ.6,500 వ్యయంతో కుషన్‌ కుర్చీలను ఏర్పాటు చేశారు. అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించారు. గ్రంథాలయ ఆవరణలో కుర్చీలు వేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునే పరిస్థితులు కల్పించారు. ప్రాంతీయ గ్రంథాలయం ఆవరణలో కూడా కుర్చీలు, బెంచీలు వేసి ఉదయం, సాయంత్రం వేళ చదువుకునే వీలు కల్పించారు. శాఖా గ్రంథాలయాల భవనాలకు మరమ్మతులు చేశారు. కొత్త పుస్తకాలను తెప్పించారు. ప్రహరీలు నిర్మించారు. పరిసరాలను అభివృద్ధి చేశారు. బీమదేవరపల్లి శాఖా గ్రంథాలయానికి ఇటీవల నూతన భవనాన్ని నిర్మించారు. ధర్మసాగర్‌, హసన్‌పర్తి శాఖా గ్రంథాలయాల్లో కొత్త స్టడీ మెటీరియల్‌ను అందుబాటు ఉంచారు.


శిక్షణా శిబిరాలు

ఉద్యోగార్థుల కోసం వివిధ ప్రభుత్వ శాఖల పక్షాన కూడా శిక్షణా తరగలను నిర్వహిస్తున్నారు. పోలీసు ఉద్యోగాల కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో అభ్యర్ధుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు కూడా శిక్షణా తరగతలను నిర్వహిస్తున్నాయి. కొన్ని యుజవన సంఘాలు, యూత్‌ అసోసియేషన్లు సైతం అభ్యర్థుల కోసం ఉచితంగా కోచింగ్‌ సెంటర్లను నిర్వహించేందుకు ముందుకు వస్తున్నాయి. పేద  ఉద్యోగార్థులను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో పలు ఉచిత కోచింగ్‌ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు సైతం ముందుకు వచ్చి తమ నియోజకవర్గాల పరిధిలో ఉచిత కోచింగ్‌ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. 


అవసరమైన పుస్తకాలు 

గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సంబంధించిన ఏ పుస్తకం కావాలన్నా వెంటనే సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లా గ్రంథాలయాలకు ఆదేశాలను జారీ చేసింది. దీనితో పాటు కావలసిన స్టడీ మెటీరియల్‌ను అప్పటికప్పుడు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు జిల్లా గ్రంథాలయాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యాలను కూడా కల్పించారు. గ్రంథాలయాలన్నిటిలో ఆన్‌ డిమాండ్‌ బుక్‌ రిజిస్టర్లు ఏర్పాటు చేశారు. ఉద్యోగార్థులు తమకు ఫలానా పుస్తకం అవసరమని అందులో రాస్తే వారం రోజుల్లో కొనుగోలు చేసి సంబంధిత గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను అందుబాటులో ఉంచారు.


స్టడీ మెటీరియల్‌ అందుబాటులో ఉంచాలి: తల్లూరి సాకేత్‌ నారాయణ్‌, హనుమకొండ

నేను సీబీఐటీలో బీటెక్‌ పూర్తిచేశాను. ప్రస్తుతం గ్రూప్‌-2కు సిద్ధమవుతున్నాను. పోటీ పరీక్షను తట్టుకోవాలంటే ఆ మేరకు సిద్ధం కావాలి. ఇందుకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ అందుబాటులో ఉండాలి. పరీక్షలకు కావలసినంత విస్తారమైన స్టడీమెటీరియల్‌ను సొంతంగా సమకూర్చుకోవడం కష్టం. ఇందుకు చాలాఖర్చు కూడా అవుతుంది. కనుక ఈ బాధ్యతను గ్రంథాలయాలే తీసుకోవాలి. గ్రంథాలయాల్లో ప్రస్తుతం ఉన్న పుస్తకాలు పాతవి. గ్రూప్స్‌కు సిద్ధమయ్యేవారికి ఇవి చాలవు. దీనిని దృష్టిలో పెట్టుకొని తాజా, సంపూర్ణమైన మెటీరియల్‌ను అందుబాటులో ఉంచాలి. ఇందుకు విషయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఉద్యోగార్థుల అభిప్రాయాలు తెలుసుకోవాలి. వారి అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చాలి.


మరిన్ని సౌకర్యాలు కల్పించాలి..: వై.శ్రవణ్‌కుమార్‌, మట్టెవాడ, వరంగల్‌

గ్రంథాలయాల్లో ఉద్యోగార్ధుల కోసం ప్రస్తుతం కల్పించిన సౌకర్యాలు సరిపోవు. మరిన్ని వసతులను అందుబాటులోక తీసుకురావాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఈ గ్రంథాలయాల్లో ఇప్పుడున్న స్టడీ మెటీరియల్‌ సరిపోవడం లేదు.. సమకాలీన అంశాలను పరిగణలోకి స్టడీ మెటీరియల్‌ను అందుబాటులో ఉంచాలి. ఉద్యోగాల కోసం పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఆస్థాయిలో అభ్యర్థి చదువుపరంగానే కాక మానసికంగా కూడా దృఢంగా ఉండేలా గ్రంథాలయాల్లో విషయ నిపుణులతో, సైకాలజిస్టులతో కౌన్సెలింగ్‌ క్లాసులను ఏర్పాటుచేయాలి. గ్రామీణ ప్రాంత అభ్యర్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థానిక శాఖా గ్రంథాలయాల్లో కూడా అన్ని సౌకర్యాలు, అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచాలి. లేకుంటే వారు జిల్లా కేంద్రానికి రాకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది.



Read more