చలో..కు స్వస్తి

ABN , First Publish Date - 2021-04-16T06:18:45+05:30 IST

చలో..కు స్వస్తి

చలో..కు స్వస్తి

సిటీ బస్సుల్లో చలో కార్డులకు ఉద్వాసన

మార్చి 30తో ఏడాది గడువు పూర్తి

ట్రావెల్‌ కార్డులను ఈనెల 30లోపు ఉపయోగించుకోవాలంటున్న ఆర్టీసీ అధికారులు

విజయవాడ, ఆంధ్రజ్యోతి : సిటీ బస్సుల్లో ప్రవేశపెట్టిన చలో కార్డులకు ఆర్టీసీ స్వస్తి పలకనుంది. ఈనెల 30వ తేదీతో ‘చలో’ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం గడువు ముగియటంతో ఇక చలో కార్డులను ముగించాలని నిర్ణయించింది. చలో స్మార్ట్‌ కార్డులు కొని రీచార్జి చేయించుకున్నవారు ఈనెల 30వ తేదీలోపు సిటీ బస్సుల్లో ప్రయాణించి బ్యాలెన్స్‌ను ఉపయోగించుకోవాలని ఆర్టీసీ కృష్ణా రీజనల్‌ మేనే జర్‌ ఎం.నాగంద్ర ప్రసాద్‌ గురువారం అధికారికంగా ప్రకటించారు.

నగదు రహితంగా..

సిటీ బస్సుల్లో నగదు రహిత ప్రయాణం కల్పించటానికి వీలుగా విజయవాడలో ప్రయోగాత్మకంగా ‘చలో’ సంస్థతో  కిందటి ఏడాది  ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిద్వారా ప్రయాణికులు కండక్టర్ల ద్వారా కార్డులు పొందవచ్చు. ఒక్కో కార్డు విలువ రూ.100. ప్రయాణికుడు బస్సులో ఎక్కినపుడు కార్డును కండక్టర్‌కు చూపిస్తే స్వైప్‌ చే స్తాడు. వెంటనే టికెట్‌ మొత్తం డిడక్షన్‌ అవుతుంది. ఆటోమేటిక్‌గా కండక్టర్‌కు బ్యాలెన్స్‌ కనిపిస్తుంది. కండక్టర్ల దగ్గర గతంలో సాధారణ టిమ్‌లు ఉండేవి. స్మార్ట్‌ కార్డులను రీడ్‌ చేయటం కోసం నగరంలో 550 స్వైపింగ్‌ యాక్సెస్‌బిలిటీ కలిగిన టిమ్స్‌ను కండక్టర్లకు చలో సంస్థ అందించింది. 

క్యాష్‌లెస్‌ ఓకే.. యాప్‌తోనే వివాదం

నగదు రహిత ప్రయాణం వరకు బాగానే ఉన్నా ఈ సంస్థకు యాప్‌ నిర్వహణ బాధ్యతలు కూడా అప్పగించటంతో వివాదం ఏర్పడింది. కొందరు అధికారులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆర్టీసీ మొబైల్‌ అప్లికేషన్‌, ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ పోర్టల్‌కు చెక్‌ పెట్టేందుకు పావులు కదిపారు. సిటీ బస్సుల కోసం అంటూ చలో సంస్థకు ప్రత్యేకంగా యాప్‌ బాధ్యతలను కూడా అప్పగించారు. చలో యాప్‌లో సిటీ బస్సుల లైవ్‌ట్రాక్‌, ట్రిప్‌ ప్లానర్‌, మొబైల్‌ టికెట్‌, చలో ట్రావెల్‌ కార్డు, ఒకరోజు బస్‌పాస్‌ వంటి అంశాలను పొందుపరిచారు. కేవలం క్యాష్‌లెస్‌ వరకు మాత్రమే అవకాశం ఇవ్వాలని, యాప్‌కు అనుమతులు ఇచ్చి గందరగోళం చేయొద్దన్న ఉద్యోగులు, ప్రయాణికుల విజ్ఞప్తులను అప్పట్లో ఆర్టీసీ యాజమాన్యం తోసిపుచ్చింది.

 సరిగ్గా కొవిడ్‌కు ముందు చలో సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. విజయవాడలో పరిశీలించిన మీదట విశాఖపట్నం, తిరుపతి తదితర ఇతర నగరాల్లో కూడా అమలు చేస్తామని అప్పటి ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి చలో యాప్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకుంటే 5 శాతం బోనస్‌ అని ప్రకటించింది. ఒకపక్క ఆర్టీసీ యాప్‌ ద్వారా బస్సుల్లో రిజర్వేషన్‌ చేసుకుంటే ఎలాంటి రాయితీ లేదు. ప్రైవేట్‌ సంస్థ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకుంటే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ వచ్చేలా అవకాశం కల్పించటం కూడా విమర్శలకు తావిచ్చింది. 

అమ్మింది 7,340 కార్డులు.. వచ్చింది రూ.7.34 లక్షలు

చలో యాప్‌ ద్వారా సిటీబస్సులకు గణనీయమైన ఆక్యుపెన్సీ పెరుగుతుందని, అదిరిపోయే ఆదాయం వస్తుందని ఊదరగొట్టిన అప్పటి అధికారులు ఇప్పుడు లేరు. ఈ ఏడాదిలో చలో యాప్‌ ద్వారా టికెట్‌ బుకింగ్‌ అనేది చాలా సాధారణంగా జరిగింది. యాప్‌ కంటే కూడా ప్రయాణికులు కేవలం స్మార్ట్‌ ట్రావెల్‌ కార్డులనే ఉపయోగించారు. మొత్తంగా ఏడాది కాలంలో 7,340 కార్డుల విక్రయాలే జరిగాయి. దీనిద్వారా రూ.7.34 లక్షల ఆదాయం లభించింది. కొవిడ్‌ వల్ల ఆరు నెలల కాలం వృథా అయినా.. తర్వాత ఆరు నెలలుగా బస్సులు తిరుగుతున్నా ట్రావెల్‌ కార్డులకు అంతగా ఆదరణ లభించలేదు. దీంతో చలో సంస్థను సాగనంపేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. 

Updated Date - 2021-04-16T06:18:45+05:30 IST