చాణక్య నీతి: ఇలాంటివారు సూర్యునిలా వెలిగిపోతారు.. శత్రువులు కూడా వీరిని అభినందించకుండా ఉండలేరు!

ABN , First Publish Date - 2021-12-30T12:12:06+05:30 IST

చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం..

చాణక్య నీతి: ఇలాంటివారు సూర్యునిలా వెలిగిపోతారు.. శత్రువులు కూడా వీరిని అభినందించకుండా ఉండలేరు!

చాణక్య నీతిలో తెలిపిన వివరాల ప్రకారం, ఒక వ్యక్తి తనను తాను ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకూడదు. భగవంతుడు ఈ భూమి మీదకు పంపిన ప్రతీ వ్యక్తికీ ఏదోఒక ప్రత్యేకతను అందించేవుంటాడు. ఆ వ్యక్తి తనలోని ప్రతిభను గుర్తించి, దానిని మెరుగుపరచుకున్నప్పుడు అతని ప్రకాశం సూర్యునిలా వ్యాపిస్తుందని ఆచార్య చాణక్య చెబుతారు. అలాంటి వారికి లక్ష్మీదేవి తన ఆశీస్సులు కూడా అందిస్తుందని చాణక్య పేర్కొన్నారు. ఆచార్య చాణక్య పేర్కొన్న వివరాల ప్రకారం.. మనిషి తన తన స్వయంకృషి, అంకితభావంతో లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు.. శత్రువులు కూడా అలాంటి వ్యక్తిని ప్రశంసించకుండా ఉండలేరని చాణక్య వివరించారు. మనిషి తన స్వీయజ్ఞానం, స్వయంకృషిపై పూర్తి నమ్మకం కలిగి ఉండాలి. దీనితో పాటు తమలోని ప్రత్యేకతను గుర్తించినవారు లక్ష్యం నుంచి ఎన్నడూ వెనుదిరిగి చూడకూడదు. కొత్త విజయగాథలు రాస్తూ ముందుకుసాగాలి. ఈ దిశగా పయనించాలనుకున్న వ్యక్తి ఎటువంటి లక్షణాలు కలిగివుండాలనేది కూడా చాణక్య తెలిపారు.


విషయ పరిజ్ఞానాన్ని పొందండి

ప్రతీవ్యక్తికీ విషయ పరిజ్ఞానాన్ని పొందాలనే తపన ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ఇలాంటివారికి జ్ఞాన దేవత అయిన సరస్వతి మాత అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని ఆచార్య చాణక్య తెలిపారు. జ్ఞానానికి మాత్రమే అన్ని రకాల చీకట్లను తొలగించే సామర్థ్యం ఉందని చాణక్య తెలిపారు. పరస్పరం పంచుకోవడం ద్వారా పెరిగే జ్ఞానం మరింత వృద్ధి చెందుతుందన్నారు. ఇలా జ్ఞానాన్ని పెంపొందించుకునే వారు సమాజానికి, జాతికి ఖ్యాతిని తీసుకువస్తారని ఆచార్య చాణక్య తెలిపారు. 


మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి

ప్రతీ వ్యక్తి జ్ఞానంతో పాటు తన నైపుణ్యాలను కూడా మెరుగుపరచుకోవాలని చాణక్య నీతి చెబుతోంది. ప్రతి ఒక్కరికీ ఏదోఒక నైపుణ్యం అవసరం. ఏ పనినైనా చేయగల ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారు ఉన్నత స్థానాలను అందుకుంటారు. అలాంటివారు సమసమాజ అభివృద్ధికి తమ కీలక సహకారాన్ని అందిస్తారు.

సంస్కారంతో మెలగండి 

జ్ఞానం, నైపుణ్యాలతోపాటు మనిషి సంస్కారాన్ని కూడా కలిగివుండాలని ఆచార్య చాణక్య తెలిపారు. సంస్కారం కలిగిన వ్యక్తులకు ప్రతిచోటా గౌరవం లభిస్తుంది. అలాంటివారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ఇతరులు వారి నుండి స్ఫూర్తిని పొందుతారు. దేశాన్ని పటిష్టం చేయడంలో సంస్కారవంతులు కీలక పాత్ర పోషిస్తారని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2021-12-30T12:12:06+05:30 IST