చాణక్య నీతి: స్నేహితుల ముసుగులో దాగున్న శత్రువును గుర్తించడమెలా? పరిస్థితులు బాగోలేనపుడు ఎలా మెలగాలి?.. విజయానికి దారి చూపే ఆరు సూత్రాలు..

ABN , First Publish Date - 2021-10-13T12:17:56+05:30 IST

జీవితంలో విజయం సాధించాలనుకునేవారు..

చాణక్య నీతి: స్నేహితుల ముసుగులో దాగున్న శత్రువును గుర్తించడమెలా? పరిస్థితులు బాగోలేనపుడు ఎలా మెలగాలి?.. విజయానికి దారి చూపే ఆరు సూత్రాలు..

జీవితంలో విజయం సాధించాలనుకునేవారు తప్పనిసరిగా కొన్ని సూత్రాలను పాటించాలని ఆచార్య చాణక్య చెబుతారు. విజయాన్ని సొంతం చేసుకునేందుకు పరిస్థితులను అర్థం చేసుకుంటూ, ఆయా పరిస్థితులకు అనుగుణమైన రీతిలో నడుచుకుంటూ ముందుకు సాగాలని ఆచార్య చాణక్య సూచిస్తున్నారు. ఆచరణ యోగ్యంగా ఉన్నందునే చాణక్య నీతిని నేటికీ చాలామంది అనుసరిస్తున్నారు. మనిషి కష్టపడి పనిచేసిన తర్వాత కూడా కొన్నింటిలోనే విజయం సాధిస్తాడు. మరికొన్ని విషయాలలో వైఫల్యాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇలా వైఫల్యాలు ఎదురుకాకూడదంటే ఆచార్య చాణక్య చెప్పిన ఈ ఆరు విషయాలను జీవితంలో తప్పక ఆచరించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం.. 


సమయానుకూలం: చాణక్యనీతి ప్రకారం పరిస్థితులను అర్థం చేసుకుని మెలిగే వ్యక్తి విజయం సాధిస్తాడు. ప్రస్తుతం ఎటువంటి సమయం నడుస్తున్నదనేది తెలివైన వ్యక్తి గ్రహించగలుగుతాడు. సంతోషం లేదా విచారంతో కూడిన రోజులు నడుస్తున్నాయా?.. సంతోషకరమైన రోజులు ఉంటే వాటిని సద్వినియోగం చేసుకుని, అభివృద్ధాదాయక పనులు చేయండి. అదే విచారకమైన రోజులు ఉంటే సహనంతో మెలుగుతూ, అభివృద్ధికి తోడ్పడే పనులు చేసేందుకు ప్రయత్నించండి. 

నాకున్న శక్తియుక్తులేమిటి?: ఇది అతి ముఖ్యమైన విషయం. ఎప్పుడైనా సరే మన శక్తియుక్తులను మనం గ్రహించాలి. మనం ఏ పనులు సమర్థవంతంగా చేయగలమో తెలుసుకోగలగాలి. మనం చేయగలిగిన పనులనే ముందుగా చేయాలి. మన స్థాయికి మించిన పనులు చేస్తే అది విఫలమవుతుందని ఆచార్య చాణక్య చెబుతారు. 


మన స్నేహితులు ఎవరు?: మన నిజమైన స్నేహితులు ఎవరో? మనముందు నటించేవారు ఎవరో మనం గ్రహించగలగాలి. స్నేహితుల ముసుగులో ఎవరు దగ్గరకు చేరుతున్నారో తెలుసుకోవాలి. స్నేహితుల ముసుగులో దాగున్న శత్రువును గుర్తించడం చాలా ముఖ్యం. ఇదే సమయంలో నిజమైన స్నేహితులు ఎవరో కూడా గుర్తించగలగాలి. ఎందుకంటే నిజమైన స్నేహితుల సహాయం తీసుకోవడం ద్వారా మాత్రమే మనిషి విజయం సాధించవచ్చు.

నేను ఎవరికి మద్దతు పలకాలి?: ఏదైనా సంస్థలో పనిచేస్తున్నప్పుడు, అక్కడున్న అవసరాలను మనం గుర్తెరగాలి. అదే సమయంలో సంస్థ యజమాని మీ నుండి ఏమి కోరుకుంటున్నారో గ్రహించాలి. సంస్థకు ప్రయోజనం కలిగించే పనులను చేయాలి.


పనిచేస్తున్న ప్రదేశం: మనం పనిచేస్తున్న ప్రదేశం ఎలా ఉంది? అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? కార్యాలయంలో పనిచేసే వ్యక్తులు ఎలా ఉన్నారు? దీన్ని గమనించడం ముఖ్యం. ఫలితంగా మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. 

మనకొచ్చే ఆదాయం, ఖర్చుల వివరాలు: ఎవరైనా సరే తమకు వచ్చే ఆదాయం, ఖర్చుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ఆదాయానికి మించి ఖర్చులు చేసేవారు ఇబ్బందుల్లో పడతారు. సంపదతో వచ్చే ఆనందాన్ని ఖర్చులతో దిగజార్చుకోకూడదు. 

Updated Date - 2021-10-13T12:17:56+05:30 IST