Man ki baat: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు: మోదీ

ABN , First Publish Date - 2022-09-25T19:50:38+05:30 IST

చండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు పెడుతున్నట్టు..

Man ki baat: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు: మోదీ

న్యూఢిల్లీ: చండీగఢ్ విమానాశ్రయానికి (Chandigarh Airport) షహీద్ భగత్ సింగ్ (Bhagat singh) పేరు పెడుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi) ప్రకటించారు. అదివారంనాడు 93వ 'మన్‌ కీ బాత్' (Man ki baat) రేడియో కార్యక్రమం ద్వారా ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు.  స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జయంతి ఈనెల 28న జరగనుండటంతో ప్రధాని ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ''ప్రియమైన దేశవాసులారా, మూడు రోజుల తర్వాత, అంటే సెప్టెంబర్ 28న అమృత్ మహోత్సవ్‌లో ఒక ప్రత్యేకమైన రోజు. ఆరోజు భరత మాత సాహసపుత్రుడు షహీద్ భగత్ సింగ్ జయంతి జరుపుకోనున్నాం. భగత్ సింగ్‌కు ఘన నివాళిగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నాం. ఛండీగఢ్ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ పేరు పెడుతున్నాం'' అని మోదీ ప్రకటించారు. 


మెరైన్ ఎకోసిస్టమ్స్‌కు వాతావరణ మార్పులు ప్రధానమైన ముప్పుగా ఉన్నట్టు ప్రధాని తన ప్రసంగంలో అన్నారు. బీచ్‌లలో చెత్త చేరుతోందని, దీనిని సీరియస్‌గా తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. ఈ సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాని తన ప్రసంగంలో బీజేపీ సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయకు ఘన నివాళులర్పించారు. ఆయన గొప్ప మేథాశక్తి కలవారని, భరతమాత ప్రియపుత్రుడని కొనియాడారు.


చీతాలు తిరిగి రావడంపై 130 కోట్ల మంది భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయని, చీతాలను ఎప్పటికప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ పర్యవేక్షిస్తుందని, వాటిని జనం ఎప్పుడు చూసేందుకు అవకాశం ఉంటుందనేది ఆ టాస్క్‌ఫోర్క్ నిర్ణయిస్తుందని చెప్పారు.

Updated Date - 2022-09-25T19:50:38+05:30 IST