నాడు ‘వై’... నేడు ‘ఎస్‌’!

ABN , First Publish Date - 2022-05-25T08:01:38+05:30 IST

వచ్చిన పెట్టుబడులను కాలరాసి, కత్తెరేశారు! ఇప్పుడు.. అదే సంస్థతో పెట్టుబడుల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు!

నాడు ‘వై’... నేడు ‘ఎస్‌’!

అదానీ సంస్థపై జగన్ ద్వంద్వ వైఖరి

బాబు హయాంలో 70 వేల కోట్ల ఎంవోయూ

విశాఖలో అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటు

అధికారంలోకి రాగానే ‘రివర్స్‌’ చేసిన జగన్‌

స్వల్పకాలిక ప్రతిపాదనలతో రావాలని షరతు

పెట్టుబడులు, ఉద్యోగాల సంఖ్యకు కోత

భూమి ఇచ్చి రెండేళ్లు దాటినా కదలని పనులు

నేడు అదే అదానీతో 60 వేల కోట్ల ఎంవోయూ


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి): వచ్చిన పెట్టుబడులను కాలరాసి, కత్తెరేశారు! ఇప్పుడు.. అదే సంస్థతో పెట్టుబడుల కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు! ఇతరులు చేస్తే తప్పు! తాను చేస్తే ఒప్పు! ఇదీ ముఖ్యమంత్రి జగన్‌ వైఖరి.  ఈ తీరు పారిశ్రామికవేత్తలను విస్మయానికి గురి చేస్తోంది. మూడేళ్ల క్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా  అదానీ సంస్థతో రూ.70 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం జరిగింది. విశాఖపట్నంలో ఒక గిగావాట్‌ డేటా సెంటర్‌లో రూ.40 వేల కోట్లు, 5 గిగావాట్ల సోలార్‌ పార్క్‌లో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు నాడు అదానీ సంస్థ ప్రకటించింది. 20 ఏళ్ల కాల వ్యవధిలో దశలవారీగా చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా 1.1 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రకారం నాటి తెలుగుదేశం ప్రభుత్వం కాపులుప్పాడ ప్రాంతంలో అదానీ డేటాసెంటర్‌కు 500 ఎకరాలు కేటాయించింది. 2019 జనవరిలో ఎంఓయూ చేసుకున్న అదానీ సంస్థ... ఫిబ్రవరిలోనే శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టింది. 


జగన్‌ రాగానే... 

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాగానే... ‘రివర్స్‌ గేరు’ వేయడం మొదలుపెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నింటినీ తిరగదోడినట్టే... అదానీ ఎంవోయూను కూడా భూతద్దంలో చూశారు. ‘‘మాకు 20 ఏళ్ల ప్రణాళిక అవసరం లేదు.  ఐదేళ్లలో ఎంత పెట్టుబడి పెడతారో చెబితే, ఆ ప్రకారం కొత్త ఒప్పందం చేసుకుంటాం’’ అని చెబుతూ చంద్రబాబు సర్కారు చేసిన భూ కేటాయింపును రద్దు చేసింది. దీనిని అవమానంగా భావించిన అదానీ వెనక్కి వెళ్లిపోయింది. ఇది జాతీయ స్థాయిలో పారిశ్రామికవేత్తల మధ్య చర్చకు దారి తీసింది. ప్రభుత్వ వైఖరిపై పెద్దఎత్తున విమర్శలు రావడంతో నాటి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఉన్నతాధికారులు అదానీ ప్రతినిధులను కలిసి బుజ్జగించి, బతిమాలి... రాష్ట్రంలో చిన్నదో పెద్దదో ఏదో ఒక ప్రాజెక్టు పెట్టాలని కోరారు. దాంతో అదానీ సంస్థ కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. వైసీపీ ప్రభుత్వం మధురవాడలో 130 ఎకరాలు ఇస్తామనడంతో... దానికి తగినట్లుగా 82 ఎకరాల్లో 200 మెగావాట్ల డేటా సెంటర్‌ పార్క్‌, మరో 28 ఎకరాల్లో ఐటీ బిజినెస్‌ పార్క్‌, 11 ఎకరాల్లో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ఏర్పాటుచేస్తామని... మిగిలిన 9 ఎకరాలను రిక్రియేషన్‌ సెంటర్‌కు వినియోగిస్తామని ప్రతిపాదించింది. దశల వారీగా రూ.14,634 కోట్లు పెట్టుబడి పెడతామని, 24,990 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తామని ఎంఓయూ చేసుకుంది. అంటే జగన్‌ ప్రభుత్వం పెట్టిన పేచీ వల్ల పెట్టుబడులు రూ.45 వేల కోట్లు, ఉపాధి అవకాశాలు 85 వేలు తగ్గిపోయాయి. 2020 ఫిబ్రవరిలో అదానీ సంస్థకు భూమి కేటాయించినా... ఇప్పటికీ అక్కడ ఎలాంటి పనులూ ప్రారంభించలేదు. ఆ తర్వాత ‘అదానీ అడిగితే అంతే... ఏదైనా చేసేస్తాం’ అంటూ ఆ సంస్థకు వరుస మేళ్లు చేస్తూ వచ్చారు. ఏపీఐఐసీ కేటాయించే భూములకు ‘లీజు డీడ్‌’ మాత్రమే రాసివ్వాలి. కానీ... అదానీ డిమాండ్‌ చేయగానే దానిని పూర్తిగా అప్పగిస్తూ, ‘సేల్‌డీడ్‌’ రాసిచ్చింది. ఎకరా కోటి రూపాయల చొప్పున రూ.130 కోట్లకు ఆ భూమిని అప్పగించింది.  అక్కడ మార్కెట్‌ విలువ ఎకరా రూ.20 కోట్లు ఉంది. అంటే...  రూ.2,600 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.130 కోట్లకే అదానీకి ఇచ్చేసింది. 


పాతది కదలకుండానే... కొత్త ఒప్పందం

అదానీ సంస్థతో కుదిరిన ఒప్పందం ప్రకారం... డేటా సెంటర్‌, బిజినెస్‌ పార్క్‌ల పనులు ప్రారంభించిన మూడేళ్లలో 30 శాతం మందికి ఉపాధి కల్పించాలి. భూమి అప్పగించిన ఏడేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి 24,990 ఉద్యోగాలు ఇవ్వాలి. భూమి తీసుకున్న తర్వాత మూడేళ్లలో అక్కడ కార్యకలాపాలు కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్దేశించింది. భూమి ఇచ్చి ఇప్పటికే రెండేళ్లా మూడు నెలలు గడిచిపోయాయి. మిగిలింది తొమ్మిది నెలలే. ఇప్పుడు అక్కడ కొండ తప్ప ఏమీ లేదు. కచ్చా రోడ్డు మాత్రమే వేశారు. కొండను తవ్వి భూమి చదును చేసేదెప్పుడు? పనులు ప్రారంభించేదెప్పుడు? ఉద్యోగాలు ఇచ్చేదెప్పుడు? ఇదీ విశాఖలో కుదుర్చుకున్న ఒప్పందం పరిస్థితి. అది అలా ఉండగానే... దావో్‌సలో అదానీ సంస్థతో సోమవారం గొప్పగా రూ.60వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్రంలో 3700 మెగావాట్ల పంప్డ్‌ హైడ్రో ప్రాజెక్టు, 10 వేల మెగావాట్ల సోలార్‌ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు అదానీ సంస్థ అంగీకరించింది. ‘స్వల్పకాలిక ఒప్పందాలు మాత్రమే’ అని అప్పట్లో చెప్పిన జగన్‌ సర్కారు... ఇప్పుడు అదే అదానీ సంస్థతో దీర్ఘకాలిక ఒప్పందాలు ఎందుకు కుదుర్చుకుంది?  పాత ఒప్పందం కదలకుండానే... కొత్త ఒప్పందాలపై ముందుకు ఎలా వెళుతోంది? అని రాష్ట్రానికి చెందిన పారిశ్రామిక వేత్తలు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2022-05-25T08:01:38+05:30 IST