చంద్రోత్సవం

ABN , First Publish Date - 2021-10-30T07:24:12+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం పర్యటనకు విశేష స్పందన లభించింది.

చంద్రోత్సవం
కుప్పం సభలో జనసందోహం

చంద్రబాబు రాక టీడీపీ కార్యకర్తలకు కొత్త ఉత్తేజాన్నిచ్చింది


బహిరంగ సభలో చంద్రబాబు పిలుపు


చిత్తూరు, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): కుప్పం మున్సిపల్‌ ఎన్నికల వేళ చంద్రబాబు రాక టీడీపీ కార్యకర్తలకు కొత్త ఉత్తేజాన్నిచ్చింది. శుక్రవారం నాటి ఆయన పర్యటన కుప్పంలో ఉత్సవంలా సాగింది. పట్టణమంతా జనసంద్రంగా మారింది. చంద్రబాబు ఆవేశపూరిత ప్రసంగాలకు ప్రజల నుంచి అద్భుత స్పందన లభించింది. 

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం పర్యటనకు విశేష స్పందన లభించింది. సుమారు 8 నెలల తర్వాత నియోజకవర్గానికి వచ్చిన చంద్రబాబుకు బెంగళూరు ఎయిర్‌పోర్టు వద్ద శుక్రవారం ఉదయం 10.30 గంటలకు కుప్పంతో పాటు, జిల్లా టీడీపీ నేతలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరిన ఆయన మధ్యాహ్నం ఒంటి గంటకు సరిహద్దు ప్రాంతమైన కెంబాపురం చేరుకున్నారు. అక్కడ పీలేరు, పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జులు నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి క్రేన్‌ సాయంతో పెద్దఎత్తు దండను చంద్రబాబుకు వేశారు. పూలు చల్లారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కుప్పంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌కు చేరుకున్నారు. భోంచేశాక 2.45 గంటలకు గెస్ట్‌ హౌస్‌ నుంచి కుప్పం బస్టాండు వరకు ర్యాలీగా బయల్దేరారు. వర్షం పడుతున్నా.. కార్యకర్తల ఉత్సాహం చూసి గొడుగు పట్టుకుని మరీ చంద్రబాబు రోడ్‌ షో నిర్వహించారు. ప్రజలంతా గెస్ట్‌ హౌస్‌ నుంచి బస్టాండు వరకు చంద్రబాబు వాహనంతో పాటు నడుచుకుంటూ వచ్చారు. కుప్పం అర్బన్‌ పోలీ్‌సస్టేషన్‌ వద్ద మహిళలు మంగళహారతులిచ్చారు.తొలుత అంబేడ్కర్‌ విగ్రహానికి, తర్వాత ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు.సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన చంద్రబాబు ప్రసంగం సుమారు గంటన్నర తర్వాత ముగిసింది.కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ మాట్లాడిన చంద్రబాబు వైసీపీ అవినీతి, అక్రమాలను ప్రశ్నించారు. పోలీసులు  నమోదు చేస్తున్న అక్రమ కేసుల గురించి నిలదీశారు. దీంతో సభకు హాజరైన కార్యకర్తలు, ప్రజలు స్పందించారు.ముఖ్యమంత్రి డౌన్‌ డౌన్‌, చంద్రబాబు మళ్లీ రావాలంటూ నినాదాలు చేశారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి ఘన విజయం అందించాలని కోరుతూ ప్రజలకు నమస్కరించగా విశేషంగా స్పందించారు.అనంతరం పలువురు స్థానిక నేతల ఇళ్లకు వెళ్లి పరామర్శించిన చంద్రబాబు కుప్పం వీధుల్లో శుక్రవారం రాత్రి కూడా రోడ్‌ షో చేశారు. రాత్రి 11గంటలకు కూడా ఉత్సాహంగా పర్యటిస్తూనే ఉన్నా.. ఆయనతో పాటు కార్యకర్తలూ అంతే జోష్‌గా కనిపించారు. కుప్పం ప్రజల్లో ఈ స్థాయి స్పందన తాను గతంలో ఎన్నడూ చూడలేదని చంద్రబాబే చెప్పడం విశేషం.  



Updated Date - 2021-10-30T07:24:12+05:30 IST