బరిలో మీరే!

ABN , First Publish Date - 2022-08-19T07:57:27+05:30 IST

నియోజకవర్గాల ఇన్‌చార్జులతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న సమావేశాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

బరిలో మీరే!

  • ఇన్‌చార్జుల భేటీలో చంద్రబాబు భరోసా
  • టీడీపీ అభ్యర్థులకు లైన్‌ క్లియర్‌!
  • అవనిగడ్డలో మళ్లీ బుద్ధప్రసాదే!
  • బోడె ప్రసాద్‌ పెనమలూరు నుంచి..
  • మార్కాపురంలో నారాయణరెడ్డి ఖాయం


(అమరావతి-ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల ఇన్‌చార్జులతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న సమావేశాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మీరేనని.. బాగా చేసుకోండని ఆయన భరోసా ఇచ్చి పంపుతున్నారు. ఇంతకుముందు ఎన్నడూ ఆయన ఇంత త్వరగా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఎన్నికలకు ఎంతో ముందే ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలపై పూర్తి స్పష్టత ఇస్తున్నారు. కృష్ణా జిల్లాల్లో రెండు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జులకు ఆయన గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. అవనిగడ్డ నియోజకవర్గంలో పోయిన రెండుసార్లు టీడీపీ నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ పోటీ చేశారు. ఈసారీ ఆయనే ఉంటారా.. లేక ఆయన కుమారుడు పోటీ చేస్తారా.. ఆ కుటుంబం నుంచి గాక మరెవరైనా రంగంలోకి వస్తారా అన్నదానిపై పలు ఊహాగానాలు వ్యాప్తిలో ఉన్నాయి. దివంగత నేత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ పేరు కూడా చర్చల్లో నలిగింది. కానీ అక్కడ బుద్ధప్రసాదే పోటీ చేస్తారని చంద్రబాబు స్పష్టత ఇచ్చారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ‘మీరే అభ్యర్థి. బాగా చేసుకోండి. నియోజకవర్గంలో ఇంకా బాగా తిరగాలి. బాదుడే బాదుడు కార్యక్రమం అన్ని గ్రామాల్లో చేయాలి. పార్టీ సభ్యత్వ నమోదు ఇంకా ఎక్కువ చేయాలి. కేడర్‌కు ఇంకా ఎక్కువ అందుబాటులో ఉండాలి’ అని బుద్ధప్రసాద్‌కు సూచించారు. అదే జిల్లాలో పెనమలూరు నుంచి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు కూడా లైన్‌ క్లియర్‌ అయినట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో ఈసారి అభ్యర్థిని మార్చుతారన్న ప్రచారానికి చంద్రబాబు తెరదించారు. వనరులు సమీకరించుకుని పోటీకి సిద్ధం కావాలని ప్రసాద్‌కు సూచించారు. వీరిద్దరిపాటు ప్రకాశం జిల్లాకు చెందిన మార్కాపురం ఇన్‌చార్జి నారాయణ రెడ్డి, సంతనూతలపాడు ఇన్‌చార్జి విజయకుమార్‌ కూడా ఆయన్ను కలిశారు. వీరిద్దరి పోటీ కూడా ఖాయమే. అందరినీ కలుపుకొని వెళ్లాలని, కొంత మందికే దగ్గరగా ఉంటున్నారన్న అపప్రధకు అవకాశం ఇవ్వవద్దని ఆయన హెచ్చరించారు.


ఏడుగురిలో ఆరుగురు..

గురువారం చంద్రబాబుతో ఏడుగురు ఇన్‌చార్జులు.. భూమా అఖిలప్రియ(ఆళ్లగడ్డ), చల్లా రామచంద్రారెడ్డి (పుంగనూరు), మహ్మద్‌ నజీర్‌ (గుంటూరు తూర్పు), బత్యాల చెంగల్రాయుడు(రాజంపేట), దామచర్ల జనార్దన్‌ (ఒంగోలు), పుట్టా సుధాకర్‌ యాదవ్‌ (మైదుకూరు), గౌరు వెంకటరెడ్డి (నందికొట్కూరు-ఎస్సీ) భేటీ అయ్యారు. వీరిలో ఆరుగురు తమ నియోజకవర్గాల్లో పోటీచేయడం ఖాయమేనని టీడీపీ వర్గాలు అంటున్నాయి. మైదుకూరు సీటుపై తాను ఆసక్తితో ఉన్నట్లు మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి సంకేతాలు పంపిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ చంద్రబాబు సుధాకర్‌ యాదవ్‌నే ఖరారుచేసినట్లు సమాచారం. కొందరు నేతలు ఆయనను ప్రొద్దుటూరు మారిస్తే బాగుంటుందని ప్రతిపాదించారు.


అయితే తానువరుసగా రెండుసార్లు మైదుకూరు నుంచి పోటీచేసి ఓడిపోవడంతో నియోజకవర్గ ప్రజల్లో సానుభూతి ఉందని, ఇక్కడ పోటీ చేస్తేనే రాజకీయంగా మేలు కలుగుతుందని సుధాకర్‌ వివరించారు. ఈ అభిప్రాయంతో చంద్రబాబు కూడా ఏకీభవించారు. నియోజకవర్గంలో పార్టీ నాయకులంతా ఒకటిగా కలిసి పనిచేయాలని, ఇన్‌చార్జికి వ్యతిరేకంగా ఎవరైనా అలజడి సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నందికొట్కూరులో పార్టీ పరిస్థితి, అక్కడ ప్రతిపాదనలో ఉన్న అభ్యర్థులపై చంద్రబాబు వెంకటరెడ్డితో చర్చించారు. తుది నిర్ణయం జరగలేదు.

 

పార్టీ కార్యక్రమాలపై సమీక్ష

పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరుపై ఇన్‌చార్జులతో చంద్రబాబు సమీక్షిస్తున్నారు. వీరిలో కొందరు ఇటీవల కొన్నికార్యక్రమాల అమల్లో వెనుకబడి ఉండడంపై ప్రశ్నిస్తున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమం అన్ని గ్రామాల్లో జరగకపోవడం, సభ్యత్వ నమోదు అంత చురుగ్గా లేకపోవడం, ఓటర్ల జాబితా సవరణలను పట్టించుకోకపోవడంపై చర్చిస్తున్నారు. ‘పార్టీ కొన్ని కార్యక్రమాలు చేయాలని ఆదేశించినప్పుడు వాటిని కచ్చితంగా పాటించాలి. దానిలో మీ నియోజకవర్గం వెనుకబడి ఉండడానికి వీల్లేదు. మీ పనితీరుకు ఇవి కూడా ప్రామాణికంగా ఉంటాయి. మూడు నెలల్లో మరోసారి మీతో మాట్లాడతాను. అప్పటికి పురోగతి కనిపించాలి’ అని ఆయన వారికి గట్టిగా చెప్పారు.

Updated Date - 2022-08-19T07:57:27+05:30 IST