TDP Chief: ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు మరోసారి క్లారిటీ

ABN , First Publish Date - 2022-09-02T18:05:46+05:30 IST

ఎన్డీఏలో చేరికపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి క్లారిటీ ఇచ్చారు.

TDP Chief: ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు మరోసారి క్లారిటీ

అమరావతి: ఎన్డీఏ (NDA)లో చేరికపై టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu) మరోసారి క్లారిటీ ఇచ్చారు. కేంద్రంలో, రాష్ట్రంలో కానీ రాష్ట్ర పునర్ణిర్మానం చేసే కార్యక్రమాలకే ప్రధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం అవసరాన్ని బట్టి సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకూ పొత్తుల గురించి తానెక్కడా మాట్లాడలేదని... నాయకుల్లోనూ ఈ స్పష్టత ఉండాలని తెలిపారు. పార్టీ శ్రేణులు నిరంతరం ప్రజల్లో ఉంటూ వారికోసం పనిచేసి నమ్మకం పెంచాలని ఆదేశించారు. మన పోరాటం పార్టీతో పాటు అన్ని వర్గాల ప్రజల కోసమని అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థల విధ్వంసం జరుగుతోందని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఇదే మాదిరిగా ఉంటే ఇక భవిష్యత్తు ఉండదని హెచ్చరించారు. ఈ రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చంద్రబాబు నాయుడు (TDP Chief) తెలిపారు. 


కాగా... ఎన్డీఏలో టీడీపీ చేరబోతోందంటూ రిపబ్లిక్ టీవీ (Republic TV) ప్రసారం చేసిన కథనంపై చంద్రబాబు (TDP Chief) కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలా ప్రచారం చేస్తున్నవారే సమాధానం చెప్పాలని అని, దానిపై ఇప్పుడే తాను స్పందించనని బాబు తెలిపారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు ఎన్డీఏ నుంచి బయటకువచ్చామని చంద్రబాబు గుర్తుచేశారు.


రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి గట్టి ఓటు బ్యాంకు ఉందని, తెలంగాణలో దానికి 10-20 శాతం ఓట్లు ఉన్నాయని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ (BJP) సానుకూలంగా ఉందని రిపబ్లిక్‌ టీవీ చానల్‌ వెల్లడించింది. ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ సందర్భంగా ఇటీవల చంద్రబాబు ఢిల్లీ (Delhi)లో పర్యటించినప్పుడు ప్రధాని మోదీ (Narendra modi)తో కరచాలనం చేసి.. ఐదు నిమిషాలు ముచ్చటించిన విషయాన్ని ప్రస్తావించింది. అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థులకు టీడీపీ మద్దతిచ్చిందని.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన చంద్రబాబు.. మోదీ (Prime minister)పై ప్రశంసల జల్లు కురిపించారని గుర్తుచేసింది. అయితే... 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ, బీజేపీ తెగతెంపులు చేసుకున్నాయి. హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ టీడీపీ మోదీ కేబినెట్‌ నుంచి వైదొలగింది. ఇటు బీజేపీ కూడా ఆంధ్రాలో చంద్రబాబు మంత్రివర్గానికి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్డీఏలో టీడీపీ చేరబోతోదంటూ వస్తున్న వార్తలపై చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టత నిచ్చారు. 

Updated Date - 2022-09-02T18:05:46+05:30 IST