పోటీ పడలేక ఆస్తుల విధ్వంసానికి దిగడం సిగ్గుచేటు: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-02-28T18:18:24+05:30 IST

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీతో పోటీ పడలేక వైసీపీ శ్రేణులు ఆస్తుల విధ్వంసానికి దిగడం సిగ్గుచేటని..

పోటీ పడలేక ఆస్తుల విధ్వంసానికి దిగడం సిగ్గుచేటు: చంద్రబాబు

అమరావతి: మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పోటీ పడలేక వైసీపీ శ్రేణులు ఆస్తుల విధ్వంసానికి దిగడం సిగ్గుచేటని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. బెదిరింపులు, దౌర్జన్యాలతో జగన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. పేదల భూములను వైసీపీ నేతలు కబ్జా చేసినట్లుగా ఎన్నికల ప్రక్రియను కూడా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.


తిరుపతిలో 20 ఏళ్లుగా టీ కొట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్న శ్రీనివాసులు అనే వ్యక్తి షాపును అక్రమంగా తొలగించడాన్ని ఖండిస్తున్నామని చంద్రబాబు అన్నారు. పలాసలో బెదిరింపులకు గురి చేసి పోటీ చేసే అభ్యర్థులను వైసీపీలో చేర్చుకున్నారని, పోటీ నుండి తప్పుకోకపోతే టీడీపీ అభ్యర్థులపై వైసీపీ విష పంజా విసురుతోందన్నారు. జగన్ స్వామ్యంలో ప్రజాస్వామ్యం జీవచ్చమైందన్నారు. జగన్ రెడ్డి ఆదేశాలతోనే రాష్ట్రంలో ఇలాంటి వికృతి చేష్టలకు వైసీపీ నాయకులు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అధికార పార్టీ ఆగడాలపై ఎస్ఈసీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పోటీ చేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత ఎస్ఈసీ, పోలీసులపై వుందన్నారు. నామినేషన్ వేసిన దగ్గర నుండి ఎన్నికలయ్యే వరకు ఏం జరగుతుందో అంతుబట్టని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-02-28T18:18:24+05:30 IST