Chandrababu అంతగా ఆగ్రహించారెందుకు.. ఆయన నోటి నుంచి ఈ పదం ఎందుకొచ్చింది..!?

ABN , First Publish Date - 2021-12-26T23:41:41+05:30 IST

ఇంతకీ చంద్రబాబు నోటి నుంచి ఆ పదం ఎందుకు వచ్చింది? అసలా వాళ్లు ఎవరు..!?

Chandrababu అంతగా ఆగ్రహించారెందుకు.. ఆయన నోటి నుంచి ఈ పదం ఎందుకొచ్చింది..!?

‘కోవర్టులను ఏరిపారేస్తాను... పార్టీ కిందిస్థాయి నుంచి పటిష్టం చేస్తాను... కష్టపడిన వారికే భవిష్యత్తులో పదవులు లభిస్తాయి... ఎటువంటి మొహమాటాలు ఉండవు... ఎవరు ఏం చేస్తున్నారో నాకు అంతా తెలుసు...’ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు, హెచ్చరికలు ఇప్పుడా పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధినేత అంతగా ఆగ్రహించడానికి అసలు కారణమేమిటి? ఇంతకీ చంద్రబాబు నోటి నుంచి కోవర్టు అనే పదం ఎందుకు వచ్చింది? అసలా కోవర్టులు ఎవరు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం..


మొహం చాటేస్తున్నారు..!

అధికారం కోల్పోయిన రెండున్నర సంవత్సరాలు తర్వాత అధికారపార్టీ దాడులు, బెదిరింపులు, కేసులకు భయపడి ఇన్ని రోజులు బయటకురాని నేతలు.. ఇప్పుడిప్పుడే రోడ్డెక్కుతున్నారు. గొంతు విప్పుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలు ధైర్యంగా ఉన్నప్పటికీ, నియోజకవర్గ నేతలు మొహం చాటేస్తున్నారు. చివరకు పార్టీ పిలుపునిచ్చిన ఆందోళనల్లో సైతం నేతలు పాల్గొనకపోయినప్పటికీ, కార్యకర్తలే ముందుపడి నిర్వహిస్తున్నారు. నేటి వరకు కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్‌చార్జీలను కూడా ఇంకా నియమించలేదు. జనవరి నుంచి పూర్తిస్థాయి ప్రక్షాళన చేస్తామని పార్టీ పెద్దలు చెబుతున్నారు.


అసలు కోవర్టులెవరో..!?

మరికొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలకు భయపడి వెళ్లకపోవడం, మరికొందరు నాయకులు ఏకంగా అధికార పార్టీ నేతలతో అంతర్గతంగా చేతులు కలపాలనే నివేదికలు కూడా అధినేతకు చేరాయి. 2022 జనవరి నుంచి ప్రక్షాళన ప్రారంభించాలని ఆయా ప్రాంతాల్లో కొత్తగా యువతను ప్రోత్సహించాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రభుత్వంపై పోరాటంలో అఫెన్స్‌ ఆట ఆడాలని, పార్టీ ప్రక్షాళనలో కూడా అదే దూకుడు ప్రదర్శించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు. కోవర్టు కలుపు మొక్కలను పీకేయాలనే ఆలోచన.. ఇందులో భాగమేనని అంటున్నారు. మరి ఆ కోవర్టులు ఎవరో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వేచిచూడాలి.


అచ్చెన్న ఏం చెప్పారు..!?

ఇక టీడీపీలో మెజారిటీ నేతలు క్రియాశీలకమైనప్పటికీ.. ఇంకా కొందరు నియోజకవర్గాల్లో ఉండటం లేదని పార్టీ కేంద్ర కార్యాలయానికి ఫిర్యాదులు అందుతున్నాయి. అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా సంఘీభావ ర్యాలీలు కూడా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించలేదని పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ వ్యవహారాలన్నీ అధినేత దృష్టికి వచ్చాయి. ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత, అమరావతి సెంటిమెంట్‌, చెత్తపన్ను, విలువ ఆధారితపన్ను, ఓటీఎస్‌, ట్రూఅప్‌ చార్జీలు వంటి  అంశాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి అనుకూలంగా మలుచుకోలేకపోతున్నారు. అలాంటి నియోజకవర్గాల నేతలను ఇప్పటికే పిలిపించి అధినేతతో పాటు అచ్చెంనాయుడు చెప్పారు. వీరిలో కొంతమందిలో మార్పు రాలేదని, అటువంటి వారిని జనవరిలో మార్చివేసి వేరేవారిని నియమించేందుకు ప్రయత్నిస్తున్నారు.


బాబుకు పూసగుచ్చినట్టుగా..!

ఇదిలావుంటే, ఇటీవల జరిగిన మినీ మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా నెల్లూరు నగరపాలక సంస్థ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక్కడ అనేక మంది టీడీపీ నేతలు వైసీపీ నేతలతో చేతులు కలిపి కోవర్టు ఆపరేషన్‌ చేశారని పార్టీలోని వారే నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను పరిశీలించిన చంద్రబాబు ఉగ్రులయ్యారు. అక్కడ పరిస్థితిని స్వయంగా పరిశీలించిన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెంనాయుడు పార్టీ పరిస్థితిని అధినేత చంద్రబాబుకు పూసగుచ్చినట్టు వివరించారు. అందుకే కోవర్టులను ఏరిపారేస్తాననీ, నాయకత్వాన్ని మారుస్తాననీ హెచ్చరించారు. ఒకరిద్దరిని సస్పెండ్‌ చేసినప్పటికీ.. అసలు వారిని వదిలేశారని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సమీక్షకు వచ్చిన నెల్లూరు నగర వార్డు నేతలే చెబుతున్నారు.




ఇవి కూడా చదవండిImage Caption




Updated Date - 2021-12-26T23:41:41+05:30 IST