Chandrababu CPI Narayana: చంద్రబాబూ... జగన్‌ను కిమ్‌తో పోల్చడం సరికాదు: నారాయణ

ABN , First Publish Date - 2022-08-27T21:05:59+05:30 IST

గతంలో హిట్లర్, ముస్సోలిని నియంతలతో పోల్చేవారు. ఇప్పుడు కాలం మారింది. పోలికలు మారాయి.

Chandrababu CPI Narayana: చంద్రబాబూ... జగన్‌ను కిమ్‌తో పోల్చడం సరికాదు: నారాయణ

అమరావతి: గతంలో హిట్లర్, ముస్సోలిని నియంతలతో పోల్చేవారు. ఇప్పుడు కాలం మారింది. పోలికలు మారాయి. కొత్తగా దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్‌ను నియంతల జాబితాలో చేర్చారు. కిమ్‌ను ఈ జాబితాలో చేర్చడం ఎంతవరకు సమంజసం అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే కుప్పం పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu).. సీఎం జగన్ ను కిమ్ తో పోల్చారు. ఇలా పోలిక పెట్టడం సీపీఐ నారాయణ (CPI Narayana)కు ఏమాత్రం నచ్చలేదు. చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ (Jagan)కి, కిమ్‌కు మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. అమెరికా లాంటి సామ్రాజ్యవాదాన్ని కిమ్‌ (Kim) గడగడలాడించారని, మురికిగుంటల్లో చేపలు పట్టుకునే జగన్ లాంటి వాళ్లతో కిమ్ ను పోల్చడం సరికాదని తప్పుబట్టారు. కుప్పంలో చంద్రబాబును అడ్డుకోవాలనుకోవడం తగదన్నారు. సంక్షేమ పథకాలు అందిస్తున్నామంటున్న జగన్‌కు భయం ఎందుకు? అని ప్రశ్నించారు. బెదిరించి, భయపెట్టి వైసీపీ పాలన చేయాలనుకుంటోందని విమర్శించారు. హత్యా రాజకీయాలను వైసీపీ ప్రోత్సహిస్తోందని నారాయణ దుయ్యబట్టారు.


జగన్‌.. జూనియర్‌ కిమ్‌ 

‘ఉత్తర కొరియాలో కిమ్‌ అని ఓ నియంత ఉన్నాడు. మనకూ జగన్‌ పేరుతో జూనియర్‌ కిమ్‌ ఉన్నాడు. 40 ఏళ్ల పాటు రాజకీయం చేసిన నేను ఇందిరాగాంధీ వంటి మహానాయకురాలిని చూశాను. జగన్‌ వంటి హీన చరిత్ర కలిగినవాళ్లను ఎప్పుడూ చూడలేదు. వైసీపీని తరిమికొట్టేందుకు ప్రజల్లో చైతన్యం రావాలి. అప్పట్లో మన పెద్దోళ్లు స్వాతంత్య్రం కోసం  బ్రిటిష్ వారితో పోరాటం చేశారు. ఇప్పుడు మనం జగన్‌ నుంచి స్వాతంత్య్రం కోసం పోరాటం చేయాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Updated Date - 2022-08-27T21:05:59+05:30 IST