అది చంద్రబాబు కల.. మూడేళ్ల తర్వాత CM Jagan శంకుస్థాపన

ABN , First Publish Date - 2022-05-17T13:17:00+05:30 IST

అది చంద్రబాబు కల.. మూడేళ్ల తర్వాత CM Jagan శంకుస్థాపన

అది చంద్రబాబు కల.. మూడేళ్ల తర్వాత CM Jagan శంకుస్థాపన

  • టీడీపీ హయాంలో ఐఆర్‌ఈపీకి బీజం 
  • 4,766.28 ఎకరాలు కేటాయింపు
  • 5,230 మోగావాట్స్‌ సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ లక్ష్యం
  • 3 వేల మందికి ఉద్యోగ, ఉపాధి 
  • ప్రపంచంలోనే తొలి ప్రాజెక్టు ఐఆర్‌ఈపీ 
  • మూడేళ్ల్ల తరువాత సీఎం శంకుస్థాపన

కర్నూలు : పిన్నాపురం ఇంటిగ్రేటెడ్‌ పునరుత్పాదక (రెన్యూవబుల్‌) ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ)...మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కల. దీని ద్వారా  5,230 మెగావాట్స్‌ సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ఉత్పత్తి చేయాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం భావించింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీనికి బీజం పడింది. ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్టు ఇది. రాష్ట్ర విభజన తరువాత సీఎం చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక సోలార్‌ పవర్‌ ఉత్పత్తికి  పెద్దపీట వేశారు. అందులో భాగంగా ఆసియాలోనే (Asia) అతిపెద్ద 1,000 మెగావాట్స్‌ సోలార్‌ ప్లాంట్‌ను ఓర్వకల్లు, గడివేముల మండలాల మధ్య గత టీడీపీ ప్రభుత్వంలో నెలకొల్పారు. అందులో గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 500 మెగావాట్స్‌, ఇతర సంస్థలు 500 మెగావాట్స్‌ సోలార్‌ వపర్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. వివిధ విభాగాల్లో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఈ సోలార్‌ ప్లాంట్‌కు దగ్గరలోనే ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ) ఏర్పాటుకు గ్రీన్‌కో ఎనర్జీస్‌ ప్రైౖ.లి సంస్థ ముందుకు వచ్చింది. ప్రపంచంలోనే తొలిప్రాజెక్టు ఇది. 


మూడేళ్ల తరువాత సీఎం జగన్‌ శంకుస్థాపన  

ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ) ఏర్పాటు కోసం గ్రీన్‌కో సంస్థ క్షేత్ర స్థాయిలో అఽధ్యయనం చేసింది. మూడు దశల్లో 5,230  మెగావాట్స్‌ సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టు అనుమతుల కోసం 2018లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రతిపాదనలు ఆమోదించిన టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు అవసరమైన 4,766.28 ఎకరాలు పాణ్యం మండలం పిన్నాపురం, ఓర్వకల్లు మండలం ఉశేనాపురం, కాల్వ, బ్రాహ్మణపల్లి, గుమ్మితం తండా తదితర గ్రామాల పరిధిలో ఎకరం రూ.2.50 లక్షల ప్రకారం కేటాయించింది. 


పంప్డ్‌ స్టోరేజ్‌ పవర్‌ ఉత్పత్తికి అవసరమైన 2.40 టీఎంసీల నీటిని గోరుకల్లు జలాశయం నుంచి కేటాయించారు. కీలకమైన ఈ ప్రాజెక్టుకు 2019లో చంద్రబాబు శంకుస్థాపన చేయాల్సింది. ఇంతలో ఎన్నికలు రావడంతో వాయిదా పడింది. ఆ తరువాత వచ్చిన సీఎం జగన్‌ ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే చేపట్టి ఉంటే విద్యుత్‌ ఉత్పత్తి మొదలయ్యేది. కానీ జగన్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. గ్రీన్‌కో సంస్థ అధికారులు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టుతో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు. 


గత టీడీపీ ప్రభుత్వం రూ.2.50 లక్షల ప్రకారం భూములు కేటాయిస్తే.. జగన్‌ ప్రభుత్వం భూముల ధరను రూ.5 లక్షలకు పెంచింది. ఆ తరువాత ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ ప్రజాభిప్రాయ సేకరణ జరిపి అనుమతులు సాధించారు.  మూడు దశల్లో రూ.30 వేల కోట్ల వ్యయంతో చేపట్టే కీలమైన ఐఆర్‌ఈపీ ప్రాజెక్టుకు నేడు సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు ఇది పూర్తయితే 3 వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుంది. అంతేకాదు.. బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి తగ్గుతుంది. తద్వారా వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని నిపుణులు అంటున్నారు.

Updated Date - 2022-05-17T13:17:00+05:30 IST