ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2022-05-02T17:42:25+05:30 IST

రాష్ట్రంలో పెరుగుతున్న క్రైం రేట్‌పై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు.

ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

అమరావతి: రాష్ట్రంలో పెరుగుతున్న క్రైం రేట్‌పై ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్రైం రేట్‌ వివరాలను లేఖలో వివరించారు. నేరాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం అయ్యారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయా అంశాలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు, ఇతర వీడియోలు లేఖకు జతచేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ విచ్చిన్నం అయ్యిందన్నారు. జంగిల్ రాజ్ పాలనలో ప్రజలకు భద్రత కరువైందని తెలిపారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయన్నారు. పెట్రేగుతున్న వైసీపీ గూండాలను అదుపు చేయడంలో పోలీసు శాఖ విఫలం అవుతోందని వ్యాఖ్యానించారు. జి కొత్తపల్లిలో తన భర్త హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్ రావు కారణం అని స్వయంగా మృతుడు గంజి ప్రసాద్ భార్య చెప్పిందన్నారు. శ్రీకాళహస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వెయ్యడానికి వెళుతున్న వారిపై దాడిని నివారించడంలో పోలీసుల విఫలం అయ్యారని అన్నారు. లా అండ్ ఆర్డర్ సరిగా ఉండి ఉంటే రేపల్లె రైల్వే స్టేషన్‌లో దారుణం జరిగేది కాదని చెప్పారు. రాష్ట్రంలో హింసకు, నేరాలకు విచ్చలవిడి మద్యం, గంజాయి వాడకం కారణం అవుతున్నాయని టీడీపీ అధినేత అన్నారు.


గంజాయి సరఫరాలో వైసీపీ నేతల ప్రమేయం కనిపిస్తున్నా... పోలీసు శాఖ తగు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అనంతపురంలో పెన్షన్ అడిగిన పాపానికి పోలీసు అధికారి టీడీపీ కార్యకర్తపై దాడి చెయ్యడం డిపార్ట్మెంట్‌లో పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పట్టపగలు గన్‌తో బెదిరించి అనకాపల్లి జిల్లా కసింకోటలో బ్యాంక్ దోపిడీ జరిగిందని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఏపీ పోలీసులు స్పందించకున్నా... కర్నాటక పోలీసులు వైసీపీ ఎంపీటీసీని అరెస్టు చేశారన్నారు. తాజాగా ఏపీ నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్ వెళ్లిన కేసులో దర్యాప్తు సంస్థలు ఒకరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నాయని అన్నారు. నేరాల్లో నిందుతులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు... లా అండ్ ఆర్డర్ అమలుపై పోలీసు శాఖ దృష్టిపెట్టాలని చంద్రబాబు హితవుపలికారు. 

Updated Date - 2022-05-02T17:42:25+05:30 IST