విద్యుత్ కోతలపై సీఎస్‌కు చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2022-04-10T15:08:19+05:30 IST

వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఏపీ సీఎస్‌కు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు లేఖ రాశారు.

విద్యుత్ కోతలపై సీఎస్‌కు చంద్రబాబు లేఖ

అమరావతి: వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఏపీ సీఎస్‌కు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు లేఖ రాశారు. ఏపీలో విద్యుత్ కోతలు, ప్రజల వెతలపై చంద్రబాబు ఈ లేఖలో  తెలిపారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతోనే విద్యుత్ రంగం నిర్వీర్యం అయిందన్నారు. నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్ అందించినప్పుడే..పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాలు పురోభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. 2019 నాటికి 19,160 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం సాధించామని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.


దేశంలో మిగులు విద్యుత్ సాధించిన మూడు రాష్ట్రాల్లో ఏపీ ఉందని తెలిపారు. నాడు 45 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంటే.. ఇప్పుడు ఎందుకు లేవని ప్రశ్నించారు. బొగ్గు సరఫరా సంస్థలకు బకాయిలు చెల్లించకపోవడం కారణం కాదా? అని నిలదీశారు. విద్యుత్ సంస్థల పేరిట తెచ్చిన 26 వేల కోట్లు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. ఛార్జీల పెంపుతో వచ్చిన 16 వేల కోట్లు ఏం చేశారు? అని నిలదీశారు. విద్యుత్ కోతలు, ధరల వాతలకు ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతే కారణమన్నారు. విద్యుత్ పీపీఏల రద్దుతో వ్యవస్థ చిన్నాభిన్నం అయిందన్నారు. పరిశ్రమలకు పవర్ హాలిడేతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ సంక్షోభంపై  ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చంద్రబాబునాయుడు లేఖలో డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-10T15:08:19+05:30 IST