దిశ చట్టంతో ఏం చర్యలు తీసుకున్నారు: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-06-21T23:28:18+05:30 IST

సీతానగరం ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్:కి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోమవారం లేఖరాశారు.

దిశ చట్టంతో  ఏం చర్యలు తీసుకున్నారు: చంద్రబాబు

అమరావతి: సీతానగరం ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం లేఖ రాశారు. ముఖ్యమంత్రి జగన్ నివాసానికి 2కిలోమీటర్లు, డీజీపీ కార్యాలయం, రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి 3కిలోమీటర్ల దూరంలో సీతానగరం పుష్కర ఘాట్ వద్ద యువతిపై  అత్యాచార దుర్ఘటన అమానుషమన్నారు. రాష్ట్రంలో దిశ చట్టం ద్వారా తీసుకున్న చర్యలేమిటో ప్రజలకు వెల్లడించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 


 మహిళలను రక్షించలేని చట్టాలు, యాప్‌లతో ఉపయోగం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేస్తే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు సరిపోతాయన్నారు. అత్యాచార ఘటన జరిగి ఇన్ని గంటలవుతున్న ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సీతానగరం ప్రాంతంలో సమర్థవంతమైన పోలీసింగ్, పెట్రోలింగ్ అవసరమన్నారు. ఈ ప్రాంతంలో గతంలో ఏర్పాటు చేసిన పోలీస్ అవుట్ పోస్టు శిథిలావస్థలో ఉండటం బాధాకరమన్నారు. డీజీపీ కార్యాలయం, ముఖ్యమంత్రి నివాసాలకు దగ్గర మాదక ద్రవ్యాల అమ్మకం, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వస్తున్న ఎందుకు చర్యలు చేపట్టడం లేదని  చంద్రబాబు నిలదీశారు.  


ప్రజల్లో విశ్వాసం పెంచేలా కృష్ణా నది ఒడ్డున పోలీస్ గస్తీ పెంచడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల రక్షణకు చర్యలు చేపట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. నేరస్తులను త్వరగా పట్టుకోవాలని డీజీపీని లేఖలో కోరారు. రాష్ట్రంలో మహిళలకు రియల్ టైంలో భద్రత కల్పించాలన్నారు.గత రెండేళ్లలో మహిళలపై దాడులు పెరగడం విచారకరమన్నారు. దిశా చట్టం కింద ఇప్పటి వరకూ రాష్ట్రంలో ఎన్ని కేసులు నమోదు చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. 24గంటల్లో ఎన్ని ఘటనలపై చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆర్భాటం చేసిన దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ మొబైల్ వాహనాలు, ప్రత్యేక యాప్ లన్నీ మోసపూరితంగా మారయన్నారు. వైసీపీ రంగులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడానికి మాత్రమే దిశ చట్టం పనికొచ్చినట్లుందని చంద్రబాబు లేఖలో తెలిపారు. 

Updated Date - 2021-06-21T23:28:18+05:30 IST