Amaravati: చంద్రబాబు, పవన్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన జగన్

ABN , First Publish Date - 2022-07-18T20:47:25+05:30 IST

ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu), జనసేనాని పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)పై సీఎం జగన్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు.

Amaravati: చంద్రబాబు, పవన్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన జగన్

అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu), జనసేనాని పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)పై సీఎం జగన్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. వరద సాయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని తప్పుబట్టారు. ప్రతిపక్షాలు, మీడియా అభూత కల్పనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చడానికి.. ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. దురుద్దేశ పూర్వకంగా చేసే ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వరద ప్రభావిత 6 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ (Video conference) నిర్వహించారు. వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. 48 గంటల్లో వరద బాధిత కుటుంబాలకు రూ.2వేలు అందాలని ఆదేశించారు. వరద బాధిత ప్రాంతాలకు పక్క జిల్లాల నుంచి పారిశుద్ధ్య సిబ్బందిని తరలించాలని సూచించారు. గోదావరి కట్టలు బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. కలెక్టర్లు వెంటనే వరద సహాయం వివరాలు మీడియాకు వెల్లడించాలని జగన్ సూచించారు. 


చంద్రబాబు, పవన్‌పై జగన్ ఈ వ్యాఖ్యలు చేసింది ఏ బహిరంగం సభలోనో.. లేకపోతే ఏ పార్టీ కార్యక్రమంలో కాదు. వరదపై సమీక్ష చేస్తూ ఆయన అక్కసు వెల్లగక్కారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని లంకలు, ఏజెన్సీ గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి.  వీరి పరిస్థితి ఇలా ఉంటే... ఎడతెరిపిలేని వర్షాలు.. పూడిక తీయని డ్రైన్లతో రాష్ట్రంలోని పట్టణాలు.. నగరాలు మురికికూపాలుగా మారాయి. సకల వ్యాధులకూ నిలయాలుగా తయారయ్యాయి. ఇళ్లలోని మురుగు నీరు డ్రైన్లలోకి వెళుతున్నా.. ఆ డ్రైన్లలో పూడిక తీయక వ్యర్థాలతో నిండిపోయి మురుగు నీరు ముందుకు ప్రవహించడం లేదు. ఆ నీరంతా రోడ్డెక్కి..వర్షం నీటితో కలిసిపోయి.. రోడ్డెక్కడో, డ్రైన్‌ ఎక్కడో తెలియని పరిస్థితి ఉంది. పట్టణాల్లో ఖాళీగా ఉన్న స్థలాలు చెరువులుగా మారి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. దోమల దాడితో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అంటు వ్యాధులు వ్యాప్తిచెందుతున్నా.. పారిశుధ్య నిర్వహణను పాలకులు పట్టించుకోవడం లేదనే ప్రజలు వాపోతున్నారు. 

Updated Date - 2022-07-18T20:47:25+05:30 IST