బ్రేకింగ్ : MP Kesineni Bhavanలో చంద్రబాబు ఫొటో తొలగింపు.. పార్టీ మారతారా..!?

ABN , First Publish Date - 2021-10-18T15:28:56+05:30 IST

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని అలక పాన్పు ఎక్కడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది....

బ్రేకింగ్ : MP Kesineni Bhavanలో చంద్రబాబు ఫొటో తొలగింపు.. పార్టీ మారతారా..!?

న్యూఢిల్లీ/అమరావతి : విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని అలక పాన్పు ఎక్కడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ఇప్పటికే అలకబూనిన ఆయన్ను పార్టీ అధినేత, నేతలు బుజ్జగించారు. అయితే ఇంతటితో సమస్య ఆగిపోతుందని భావించినప్పటికీ సమసిపోలేదు. నాటి నుంచే అసంతృప్తిగా కొనసాగుతున్నారని పెద్ద ఎత్తునే వార్తలు వచ్చాయి. అయితే ఇవాళ మరోసారి కేశినేని వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఇవాళ కేశినేని భవన్‌లోని పార్లమెంట్ ఆఫీస్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు ఫొటో తొలగించేశారు. అంతేకాదు.. బాబుతోపాటు మరికొందరి ముఖ్యనేతల ఫొటోలను కూడా కేశినేని నాని తొలగించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే.. చంద్రబాబు ఫొటో స్థానంలో రతన్‌టాటా, నాని కలిసి ఉన్న ఫొటోలు ప్రత్యక్షం కావడం గమనార్హం. ఏడు నియోజకవర్గాల ఇంచార్జులు, నేతల స్థానంలో గత ఐదేళ్లలో చేసిన సేవా కార్యక్రమాల ఫొటోలను నాని ఏర్పాటు చేశారు.


ఏ పార్టీలోకెళ్తారో..!?

కాగా.. కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు కేశినేని దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన టీడీపీకి టాటా చెప్పేస్తారని కూడా విజయవాడలో ప్రచారం జరుగుతోంది. పార్టీలో తన అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వలేదని కేశినేని నాని కొంత కాలంగా అలకబూనారు. ఒకవేళ ఆయన పార్టీ మారితే జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరతారా..? లేకుంటే ప్రాంతీయ పార్టీ, ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా..? అనే విషయం తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో బీజేపీ జాతీయనేతలతో పార్టీలో చేరే విషయమై సమాలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ఫొటోలు తీసేశారంతే కానీ.. పార్టీ మారుతున్నట్లు కేశినేనే డైరెక్టుగా గానీ.. అనుచరుల ద్వారా గానీ ఎక్కడ చిన్నపాటి ప్రకటన కూడా చేయించలేదు. నాని మనసులో ఏముందో.. ఏ పార్టీ కండువా కప్పుకుంటారో వేచి చూడాలి.


ఎందుకిలా..!?

రెండు మూడు అంశాలు కేశినేని నానిలో అసంతృప్తికి దారి తీసినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్లమెంటరీ నాయకుల పదవులు ప్రకటించిన రోజే లోక్‌సభలో మిగిలిన ఇద్దరు ఎంపీలకు పదవులు నిర్ణయించి తనకు ఏ బాధ్యతా అప్పగించకపోవడం ఆయనకు అసంతృప్తిని కలిగించింది. వారిద్దరితో పోలిస్తే తాను సీనియర్‌ అయినా తనను విస్మరించారన్న అభిప్రాయంలో ఆయన ఉన్నారు. విజయవాడలో పార్టీ కార్యాలయం ఏర్పాటుపై కొంతకాలం క్రితం చంద్రబాబు వద్ద చర్చ జరిగింది. ఏదైనా ఒక భవనం చూడాలని నానికి చంద్రబాబు చెప్పారు. ఒకదానిని ఎంపిక చేసి దానిపై ఒప్పందం కుదుర్చుకొనే సమయంలో ఆ విషయం పక్కనపెట్టి, విజయవాడ నగర శివార్లలోని గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు చెందిన పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర కార్యాలయంగా వినియోగించాలని నిర్ణయం తీసుకొన్నారు. తనకు ఒక పని అప్పచెప్పి ఇంతలోనే మరో నిర్ణయం తీసుకోవడం కూడా నానికి ఇబ్బంది కలిగించింది. తనకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోతోందన్న కారణంతోనే ఆయన విప్‌ పదవి తీసుకోవడానికి నిరాకరించారని చెబుతున్నారు.


                           కేశినేని నాని అలక...!


Updated Date - 2021-10-18T15:28:56+05:30 IST