Ap Politics: వైసీపీలో కలవరం.. మళ్లీ ఫేక్ ప్రచారానికి శ్రీకారం..!

ABN , First Publish Date - 2022-08-19T00:40:15+05:30 IST

పీలో రాజకీయం రోజుకో విధంగా మారుతోంది. ఇటీవలి చంద్రబాబు (Chandrababu) ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీ (Pm Modi) తో ఐదు నిమిషాలు ప్రత్యేకంగా...

Ap Politics: వైసీపీలో కలవరం.. మళ్లీ ఫేక్ ప్రచారానికి శ్రీకారం..!

Amaravathi: ఏపీలో రాజకీయం రోజుకో విధంగా మారుతోంది. ఇటీవలి చంద్రబాబు (Chandrababu) ఢిల్లీ వెళ్లారు. ప్రధాని మోదీ (Pm Modi) తో ఐదు నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడటం జరిగింది. దీంతో ఫేక్‌ ప్రచారానికి వైసీపీ (Ycp) శ్రీకారం చుట్టింది. జాతీయ మీడియాలో రెండు సంస్థలు సర్వేలు నిర్వహించగా వైసీపీకి 17 నుంచి 19 స్థానాలు వస్తాయని తేలినట్లు ఆ పార్టీ సోషల్‌ మీడియా బాకా కొడుతోంది. అయితే.. ఇందుకు ప్రతిగా.. టీడీపీ (Tdp) సానుభూతిపరులు కూడా.. పెయిడ్‌ సర్వేలని, వైసీపీ పే లిస్ట్‌లో ఆ రెండు సంస్థలు ఉన్నాయంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.


చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సమయంలో...

కాగా చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన సమయంలో జాతీయ మీడియాకు చెందిన చాలా మంది సీనియర్లతోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలోని పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వివరించడమే కాకుండా, కొన్ని వీడియోలను కూడా పంపించారు. అంతకుముందు.. ఢిల్లీలో వైసీపీకి చెందిన పార్లమెంటరీ పార్టీ నేత.. ఏపీ గురించి.. జాతీయ మీడియాకు లేనివి ఉన్నట్టు చెప్పారని, అంతా బ్రహ్మాండంగా ఉందనే పిక్చర్ ఇచ్చారని జాతీయ మీడియా ప్రతినిధులు కొంతమంది చంద్రబాబుకు చెప్పారట. దీంతో చంద్రబాబు అమరావతి వచ్చిన తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కొంత సమాచారాన్ని ఢిల్లీలోని జాతీయ మీడియా ప్రతినిధులకు వెంటనే పంపారట. ఈ మేరకు జాతీయ మీడియాలో కొంతమంది సీనియర్లు ఏపీలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు కొన్ని ప్రత్యేక బృందాలను క్షేత్రస్థాయికి పంపారు. 


ఏపీ పరిస్థితులపై కొన్ని సంస్థల ఆరా

ఈ మేరకు ఏపీ పరిస్థితులను కొన్ని సంస్థలు ఆరా తీయడం మొదలెట్టాయట. అక్రమ కేసులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలపై జరుగుతున్న దాడులు, రాజమండ్రిలో శిరోముండనం, విశాఖలో డాక్టర్ సుధాకర్ మరణం, ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారశైలి, ఏపీలో ఇసుక అందుబాటులో లేకపోవడం, పలు కంపెనీలు ఏపీ నుంచి వెళ్లిపోవడం, అందినకాడికి అప్పులు తీసుకురావడం, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల సకాలంలో వేతనం అందించకపోవడం, పోలవరం దుస్థితి, రాజధాని అమరావతిపై జగన్‌ ప్రభుత్వ వైఖరి వంటి అంశాలను జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లారు. సహజంగానే క్షేత్రస్థాయిలో ఉన్న వ్యతిరేకతను, గడపగడపకు ప్రభుత్వంలో ఎమ్మెల్యేలను జనం నిలదీస్తున్న వైనంపైనా వీడియో టేపులను ఇంగ్లీష్‌ సబ్‌ టైటిల్స్‌తో పంపారు. దీంతో జాతీయ మీడియాలో సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్‌ ఏంటి అనేది తెలిసిపోయింది. ఈ పరిణామం వైసీపీకి ఎంత మాత్రం రుచించడం లేదట. 


వైసీపీకి అంతగా ప్లస్‌ కాలేదట...

ఢిల్లీలో ప్రముఖ జాతీయ మీడియా జర్నలిస్ట్‌ ఒకరు క్షేత్రస్థాయి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్‌ తెలుసుకొని, వైసీపీకి చెందిన కీలక ఎంపీని వివరణ ఇవ్వాలని అడగ్గా, ఇవన్నీ ఎవరు చెప్పారని ప్రశ్నించడంతో ఆ ప్రతినిధికి చిరెత్తుకొచ్చి, ప్రసారమయ్యాక.. మీరే అప్పుడు మీ వర్షన్‌ ఇవ్వచ్చంటూ వెళ్లిపోయినట్టు వైసీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. జాతీయ మీడియా జరిపిన సర్వేల ఫలితం కూడా వైసీపీకి అంతగా ప్లస్‌ కాలేదట. సహజంగానే ఇంగ్లీష్ మీడియా చేసిన సర్వేలు, పైగా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగా.. ఫోన్‌లో చేసిన సర్వే ఫలితాన్ని ఎలా పరిగణనలోకి తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో ప్రజల మైండ్ సెట్‌ను బ్యాలెన్స్‌ చేసేందుకు ఈ సర్వేలను తెర మీదకు తీసుకొచ్చారని విశ్లేషిస్తున్నారు. 


వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఢిల్లీ పరిణామాలు

ఇక.. ఢిల్లీ పరిణామాలు మాత్రం వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. ఈ నెల 17న సీఎం జగన్‌ (Cm Jagan)కు ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఉందని అనుకూల మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ లభించలేదు. వరుసగా జరుగుతున్న ఈ పరిణామాలతో వైసీపీ నేతలు.. కొంతమందిని ఢిల్లీ పంపించి అక్కడ పరిస్థితులను సెట్‌ రైట్ చేయాలని పురమాయించినట్టు ఆ పార్టీ వర్గాలే ఆఫ్ ది రికార్డ్‌గా చెబుతున్నాయి. మొత్తంగా.. రానున్న కాలంలో వైసీపీకి గడ్డు కాలమేనని.. ఆ పార్టీకి చెందిన సీనియర్లే చెప్తుండడం కలకలం రేపుతోంది. చూడాలి మరి ఇన్నాళ్లూ కవర్‌ చేసుకున్న ఇమేజ్‌ అంతా.. చంద్రబాబు ఢిల్లీ టూర్‌తో బద్దలుకావడంతో వైసీపీ పెద్దలు పరువు కాపాడుకునేందుకు ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తారో..?



Updated Date - 2022-08-19T00:40:15+05:30 IST