జ‌న‌చంద్రం

ABN , First Publish Date - 2022-05-20T07:10:40+05:30 IST

డోన్‌కు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం లభించింది

జ‌న‌చంద్రం
డోన్‌లో చంద్రబాబుకు గజమాలతో సన్మానం

డోన్‌, మే 19: డోన్‌కు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అపూర్వ స్వాగతం లభించింది. టీడీపీ శ్రేణులు కదం తొక్కుతూ స్వాగతం పలికారు. కనివినీ ఎరుగని రీతిలో మహిళలు, ప్రజలు వేలాదిగా కదిలివచ్చి చంద్రబాబుకు జేజేలు పలికారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచే వివిధ గ్రామాల నుంచి టీడీపీ శ్రేణులు, ప్రజలు భారీగా డోన్‌కు తరలివచ్చారు. పట్టణంలోని రహదారులన్నీ టీడీపీ శ్రేణులతో నిండిపోయాయి. చంద్రబాబును చూసేందుకు ప్రజలు, మహిళలు, యువత జనసందోహంతో నిండిపోయాయి. డోన్‌ హైవే నుంచి పట్టణంలోని రహదారులన్నీ ఫ్లెక్సీలతో పసుపుమయంగా మారాయి. పసుపు తోరణాలతో ప్రధాన కూడళ్లన్నీ కొత్త కళను సంతరించు కున్నాయి. 3 కిలోమీటర్ల మేర రహదారులన్నీ ఎక్కడా చూసినా పచ్చతివాచీతో నిండిపోయాయి. పట్టణంలోని రహదారులన్నీ వేలాది మంది ప్రజలతో నిండిపోయాయి. చంద్రబాబు రాక కోసం గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచే వేలాది జనం ఎదురు చూశారు. ఫ్లైఓవర్‌ బ్రిడ్జి జనసంద్రంతో నిండిపోయింది. రెండు కిలోమీటర్ల మేర జనసందోహంతో పోటెత్తింది. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే అంటూ నినాదాలతో డోన్‌ పాతబస్టాండు ప్రాంతం మార్మోగిపోయింది. 


డోన్‌ పర్యటనకు వచ్చిన టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళీకృష్ణగౌడు ఇంటికి వెళ్లారు. కర్నూలు నుంచి డోన్‌కు వచ్చిన చంద్రబాబు నాయుడు నేరుగా టీడీపీ నేత మురళీకృష్ణగౌడు ఇంటికి చేరుకున్నారు. తేనేటి విందు ఆతిథ్యం స్వీకరించారు. దాదాపు అరగంట పాటు నియోజపకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులు, పలువురు కార్యకర్తలతో పరిచయ కార్యక్రమాన్ని చేశారు. టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మురళీకృష్ణగౌడు కుటుంబ సభ్యులు చంద్రబాబును సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. 


ధర్మవరం సుబ్బారెడ్డి తనయుడు మన్నెగౌతమ్‌ రెడ్డికి ఏర్పాట్ల బాధ్యతలను అప్పగించారు. దీంతో వారం రోజుల పాటు ఎంతో శ్రమించి ఏర్పాట్లు పూర్తి చేశారు.


టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం


 టీడీజీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన డోన్‌ నియోజకవర్గంలోని ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నింపింది. చంద్రబాబు పర్యటన సక్సెస్‌ కావడంతో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సామం వెల్లివిరిసింది. టీడీపీ డోన్‌ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా చేసిన కృషి ఫలించింది.


ప్యాపిలి: మండలంలోని జలదుర్గం గ్రామంలో బాదుడే.. బాదుడు కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.


 టీడీపీలో చేరిక 


చాగలమర్రి: చాగలమర్రి గ్రామంలోని 18వ వార్డు సభ్యుడు మౌళాలి, వైసీపీ నాయకులు ఆలంసాగారి అనీఫ్‌, మాబు షరీఫ్‌, గౌస్‌ మోదిన్‌తో పాటు మరో 50 కుటుంబాలు గురువారం తెల్లవారుజామున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ రాష్ట్ర మైనార్టీ సంఘ ఉపాధ్యక్షుడు అన్సర్‌బాషా సమక్షంలో టీడీపీలో చేరారు. 350 మంది పొదుపు మహిళలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరందరికి టీడీపీకి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి గుత్తి నరసింహులు, బీసీ సెల్‌ నంద్యాల లోక్‌సభ స్పోక్‌ పర్సన్‌ సల్లా నాగరాజు, టీడీపీ నాయకులు కొలిమి ఉసేన్‌వలి, కొలిమి షరిఫ్‌, జెట్టి నాగరాజు, బషీర్‌, గఫార్‌, కింగ్‌ హుసేన్‌ తదితరులు పాల్గొన్నారు. 


దోచుకోవడం.. దాచుకోవడమే వారి ధ్యేయం: ఎమ్మెల్సీ బీటీ నాయుడు 


నంద్యాల(ఆంధ్రజ్యోతి), మే 19: దోచుకోవడం.. దాచుకోవడమే ధ్యేయంగా జగన్‌ పరిపాలన సాగుతోందని టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు మండిపడ్డారు. జలదుర్గంలో గురువారం నిర్వహించిన బాదుడే.. బాదుడు కార్యక్రమంలో  ఆయన మాట్లాడారు. ఓవైపు అమ్మఒడితో ఇచ్చి మరోవైపు నాన్నబుడ్డితో లాక్కుంటున్నారని అన్నారు. మూడేళ్ల వైసీపీ పాలనలో రూ.8లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత సీఎం జగన్‌దేనని ఎద్దేవా చేశారు. నిత్యావసర ధరలన్నీ పెరిగిపోయి సామాన్యుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, అయితే ఇదే కార్యక్రమాన్ని వైసీపీ కాపీ కొట్టి గడపగడపకు మన ప్రభుత్వమని వైసీపీ చేస్తున్న పర్యటనలకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబే మళ్లీ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 



Updated Date - 2022-05-20T07:10:40+05:30 IST