
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు టీడీపీ నేతలు, కార్యకర్తలు అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘‘నలభై సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం... ఒక రాజకీయ అనివార్యం. కొందరు వ్యక్తుల కోసమో... కొందరికి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ కాదు మన తెలుగుదేశం. ప్రజల కోసం... ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం... ఈ 40 ఏళ్లలో సామాన్య ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చింది. కొందరికే పరిమితం అయిన అధికారాన్ని అన్ని వర్గాలకు పంచింది. తెలుగుదేశం అంటేనే అభివృద్ధి... సంక్షేమం. సంస్కరణల ఫలితాలను గ్రామ స్థాయికి అందించిన చరిత్ర టీడీపీదే. పాలనపై పాలకులను ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పింది తెలుగుదేశమే. పార్టీ చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తుకుతెచ్చేలా తెలుగుదేశం 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించండి. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలి. రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటో ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు సాగాలి..’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి