అరాచక పాలనపై చైతన్యం తెచ్చేందుకే ఢిల్లీ వచ్చా.... చంద్రబాబు

ABN , First Publish Date - 2021-10-27T02:43:33+05:30 IST

ఏపీలో శాంతి భద్రతలు క్షీణించిన నేపధ్యంలో ఆర్టికల్ 356 ఉపయోగించి

అరాచక పాలనపై చైతన్యం తెచ్చేందుకే ఢిల్లీ వచ్చా.... చంద్రబాబు

ఢిల్లీ: ఏపీలో శాంతి భద్రతలు క్షీణించిన నేపధ్యంలో ఆర్టికల్ 356 ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్ తో ఢిల్లీకి వచ్చిన చంద్రబాబు పర్యటన ముగిసింది. సోమవారం రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్‌ను కలిసి 8 పేజీల మెమోరాండంను అందజేయడంతో పాటు 323 పేజీల పుస్తకాన్ని అందజేశారు. ప్రధాని మోదీని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను కూడా కలవాలనుకున్నారు. అమిత్ షా జమ్మూ కాశ్మీర్ పర్యటన కారణంగా ఆయనతో భేటీ సాధ్యం కాలేదు. దీంతో మరోసారి ఆయన అపాయింట్ మెంట్ ఇచ్చినప్పడు వచ్చి కలవాలని చంద్రబాబు భావిస్తున్నారు. 

 

మెమోరాండంలో ప్రధానంగా నాలుగు డిమాండ్లు చేశారు. ఏపీలో గంజాయి, డ్రగ్స్ మాఫియా రాజ్యమేలడమే కాకుండా పోలీసుల అండతో ప్రభుత్వమే రాజ్యహింసకు పాల్పడతున్నందున రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంతో పాటు టీడీపీ నేతల ఇళ్లపై జరిగిన దాడులపై సీబీఐ విచారణ జరపాలని, డీజీపీ గౌతమ్ సవాంగ్ ను రీకాల్ చేయాలని, డ్రగ్స్ మాఫియా వ్యవహారాలపై లోతైన విచారణ జరిపించాలని కూడా చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ మెమోరాండంను పరిశీలించిన రాష్ట్రపతి వారు లేవనెత్తిన అంశాలన్నీ చాలా సీరియస్ అంశాలని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయన అంతట ఆయనే రాజధాని అమరావతి గురించి ఆరా తీశారు.


జాతీయ మీడియాతో భేటీ

ఏపీలో జరుగుతున్న అరాచక పాలనపై జాతీయ స్థాయిలో చైతన్యం తెచ్చేందుకు తాను ఢిల్లీకి వచ్చినట్లు చంద్రబాబు తెలిపారు. జాతీయ మీడియా విలేకరులతో భేటీ అయ్యారు. జాతీయ స్థాయిలో జరుగుతున్న విషయాలను వారి ద్వారా అడిగి తెలుసుకున్నారు. విలేకరులతో చంద్రబాబు ఇష్టాగోష్టీగా మాట్లాడుతూ ... గత రెండున్నరేళ్ల జగన్ పాలనలో ఏపీ సర్వ నాశనమైందని అన్నారు. యువతను డ్రగ్స్‌కు బానిసలు చేస్తున్నారని, దీన్ని ఇలాగే కొనసాగనిస్తే ఏపీ అట్టడుగు స్థాయికి చేరుకుంటుందని అన్నారు. అందుకే డ్రగ్స్ పై  కేంద్రం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి, హెరాయిన్, డ్రగ్స్ ఎక్కడ పట్టుపడినా వాటి మూలాలు ఏపీ లో ఉంటున్నాయని ఇది ప్రమాదకరమైన పరిణామని అన్నారు. కేంద్రాన్ని చైతన్య పరిచేందుకే తాము ఢిల్లీకి వచ్చామని, మరి వాళ్లు చర్యలు తీసుకుంటారో లేదో చూడాలని అన్నారు. 




నవరత్నాలేమీ పనిచేయవు

అభివృద్ధి చేయకుండా నవరత్నాల పేరుతో వేలాది కోట్లు నవరత్నాలకు దోచి పెట్టడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అన్నారు. నవరత్నాల పేరుతో ప్రజలకు ఇచ్చే దానికన్నా వారి నుంచి వసూలు చేస్తున్నదే అధికంగా ఉందని, ఈ విషయాన్ని నవరత్నాల లబ్ధిదారులు కూడా గ్రహించడం మొదలు పెట్టారని అన్నారు. ఇటీవల వైజాగ్ లో ఎయిడెడ్ స్కూళ్లను మూసివేయడంపై జరిగిన ధర్నాలో చిన్న పిల్లలు సైతం అమ్మ ఒడి వద్దు ...మా బడి ముద్దు అంటూ నినాదాలు చేస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం అవుతుందని అన్నారు. వలంటర్ల వ్యవస్థ ద్వారా వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకోవచ్చని జగన్ అనుకుంటున్నారని రాబోయే రోజుల్లో వలంటీర్లను కూడా ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు. 


కేసీఆర్ వ్యాఖ్యలు ఏపీ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి

పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, సోషల్ మీడియా ప్రచారంలో తాము వెనకబడ్డామని దాన్ని అధిగమించడానికే ఐటీడీపీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూమిలో రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టామని.... రాజధాని నిర్మాణం తరువాత  సొంత ఇంటిని నిర్మించుకోవాలనుకున్నానని, అందుకే తాను ఇంటి కోసం స్థలం కొనుగోలు చేయలేదని అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై  కూడా చంద్రబాబు స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఏపీలో పరిస్థితులకు అద్దం పడుతున్నాయని అన్నారు. తెలంగాణలో వెలుగులు, ఏపీలో చీకట్లు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్య తరువాతైనా జగన్ మేల్కొంటే బావుంటుందని అన్నారు. జగన్ అధికారంలోకి రాగానే కరెంటు ఒప్పందాలపై రివర్స్ టెండరింగ్ అంటూ నానా యాగీ చేయడం కూడా ప్రస్తుత పరిస్థితులకు దారి తీశాయని అన్నారు. 




వైఎస్, రోశయ్య, కిరణ్‌లు చేయని పనిని జగన్ చేస్తున్నారు

తను అధికారంలో ఉన్నప్పడు తీసుకున్న నిర్ణయాలను ఆ తరువాత ముఖ్యమంత్రులైన వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ లు కొనసాగించారే తప్ప వాటిని నిలిపి వేయలేదని అన్నారు. హైదరాబాద్ కన్నా మరింత ఆదాయాన్ని ఇచ్చే అమరావతిని జగన్ చంపేయడం ఏపీకి ఒక శాపమని అన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టులన్నింటినీ జగన్ నిలిపి వేశామని ఇప్పడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అయ్యిందని అన్నారు. ముందస్తు ఎన్నికలు ఎప్పడు వచ్చినా జగన్ ఓడిపోవడం ఖాయమని ప్రజలంతా ఆ సమయం కోసం వేచి చూస్తున్నారని  చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం వారెవ్వరూ వెనకేసుకు రావడం లేదని అయితే అంతకన్నా దారుణంగా తనను వైసీపి మంత్రులు, నేతలు బూతులు తిట్టారని అన్నారు. 


ఎం కృష్ణ, న్యూఢిల్లీ


Updated Date - 2021-10-27T02:43:33+05:30 IST