నాయకులెవరో తేల్చండి బాబూ!

ABN , First Publish Date - 2022-07-07T06:26:07+05:30 IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సొంత జిల్లా తిరుపతి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉన్న జిల్లా చిత్తూరు. టీటీపీకి ఒకప్పుడు గట్టి పట్టున్న ప్రాంతం అన్నమయ్య జిల్లా. మూడు జిల్లాలుగా విడిపోయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ ప్రస్తుతం చిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటోంది.

నాయకులెవరో తేల్చండి బాబూ!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అనేక చోట్ల కొనసాగుతున్న అస్పష్టత


(తిరుపతి, ఆంధ్రజ్యోతి)


 తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సొంత జిల్లా తిరుపతి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉన్న జిల్లా చిత్తూరు. టీటీపీకి ఒకప్పుడు గట్టి పట్టున్న ప్రాంతం అన్నమయ్య జిల్లా. మూడు జిల్లాలుగా విడిపోయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ ప్రస్తుతం చిత్రమైన పరిస్థితిని ఎదుర్కుంటోంది. 2019 ఎన్నికల్లో ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకున్న ఈ ప్రాంతంలోని తెలుగుదేశం క్యాడర్‌, ఇప్పుడు సమరోత్సాహంతో ఉరకలు వేస్తోంది. ఓటమి తర్వాత తొలి ఏడాది మాట పెగలని స్థితిలో ఉండిపోయిన నాయకులు, రెండో ఏడాది కాస్త కాలు బయటపెట్టారు. మూడో ఏడాది పిడికిలి బిగించి సవాలు చేస్తున్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామంటూ భరోసా ఇస్తున్నారు. అధికార వైసీపీ అరాచక పాలనను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. నిద్రాణంగా ఉన్న సింహం జూలు విదిలించుకుంటున్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో నాయకత్వం విషయంలో అధినేత నుంచీ కొనసాగుతున్న అస్పష్టత పార్టీకి నష్టం చేస్తోంది. ఎక్కడ ఎవరు నాయకులో ప్రకటించి ముందుకు కదిలితే కదనోత్సాహంతో క్యాడర్‌ కూడా బలంగా నిలుస్తుంది. మూడు రోజులపాటూ ఉమ్మడి జిల్లాలో  చంద్రబాబు పర్యటిస్తున్న సందర్భంగా పార్టీ పరిస్థితిపై ప్రత్యేక కథనం.

 

చిత్తూరు, పూతలపట్టు, జీడీనెల్లూరు నియోజకవర్గాల్లో ఎన్నికలను ఎదుర్కొనే బాధ్యులు ఎవరన్న స్పష్టత లేదు.  చిత్తూరు నుంచీ గత ఎన్నికల్లో పోటీ చేసిన ఏఎస్‌ మనోహర్‌ ఎన్నికల తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచీ అక్కడ ఇంఛార్జి లేరు. సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ దొరబాబు పెద్దదిక్కుగా మారి శ్రేణులకు అందుబాటులో వుంటున్నారు. పూతలపట్టు నుంచీ గత ఎన్నికల్లో పోటీచేసిన లలితకుమారి సైతం ఎన్నికల తర్వాత పార్టీని విడిచిపెట్టారు. అప్పటి నుంచీ ఆ సెగ్మెంట్‌కు కూడా ఇంఛార్జి లేరు. మండల స్థాయి నేతలు తప్ప నియోజకవర్గమంతా పార్టీని నడిపే నేత లేరు. దీంతో ఈ సెగ్మెంట్‌ను కూడా దొరబాబే పర్యవేక్షిస్తున్నారు. జీడీనెల్లూరులో కిందటి ఎన్నికల్లో పోటీ చేసిన హరికృష్ణ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. దీంతో అధిష్ఠానం ఈ రిజర్వుడు సెగ్మెంట్‌కు కమ్మ సామాజికవర్గానికి చెందిన చిట్టిబాబును సమన్వయకర్తగా నియమించింది. అయితే మండలస్థాయి నేతల నడుమ సరైన సమన్వయం ఇక్కడ ఇప్పటికీ లేదు.


తంబళ్ళపల్లెకు దిక్కెవరు?


తంబళ్ళపల్లె, సత్యవేడు సెగ్మెంట్లకు ఇంఛార్జుల విషయంలో అధిష్ఠానం స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడం క్యాడర్‌లో అయోమయానికి తావిస్తోంది.  తంబళ్ళపల్లెలోని సంక్లిష్ట పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోగలిగిన నాయకత్వం అవసరం. నిత్యం స్థానికంగా శ్రేణులకు అందుబాటులో వుండి, వారి సమస్యలు పట్టించుకునే నాయకత్వం కావాలి. మాజీ ఎమ్మెల్యే శంకర్‌కు వ్యక్తిగతంగా మంచిపేరున్నప్పటికీ అందుబాటు విషయంలోనే క్యాడర్‌ అసంతృప్తితో ఉంది.  


సత్యవేడులో గ్రూపుల గోల


 సత్యవేడులో గ్రూపులు పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నాయి. గత ఎన్నికల అభ్యర్థి జేడీ రాజశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే హేమలత చురుగ్గానే పనిచేస్తున్నారు.  వచ్చే ఎన్నికలకు వీరిలో అభ్యర్థి ఎవరో తేల్చుకుని, వారిని ఇంఛార్జిగా ప్రకటిస్తే తప్ప కార్యకర్తల్లో ఐక్యత సాధ్యం కాదు. 


మదనపల్లెపై దృష్టి పెట్టాలి


మదనపల్లె టీడీపీలో గ్రూపులు అధికం. ఆశావహుల్లో ఒక నేత విడిగా వర్గం నడుపుతుంటే,  మిగిలిన ఆశావహులంతా తమలో ఎవరికి అవకాశమిచ్చినా పర్లేదన్న ప్రతిపాదన ముందుకు తెచ్చారు.  సామాజికవర్గం మార్చి ప్రయోగం చేస్తే మంచిదన్న వాదనా బలంగా వినిపిస్తోంది. సంఖ్యాపరంగా అధికంగా వున్న బీసీలకు లేదా మైనారిటీలకు అవకాశమివ్వాలన్న ప్రతిపాదన ఆయా వర్గాల నుంచీ వస్తోంది. ఒకవేళ తొలినుంచీ అవకాశమిస్తున్న సామాజికవర్గాన్నే ఎంచుకుంటే కొత్తవారికి ఛాన్సు ఇవ్వాలన్న అభిప్రాయం పార్టీ శ్రేయోభిలాషుల నుంచీ వినిపిస్తోంది. నిజానికి కుప్పం తర్వాత సునాయాసంగా టీడీపీ గెలిచే సీటుగా మదనపల్లెను శ్రేణులు గుర్తిస్తున్నాయి. దీన్ని నిలబెట్టుకోవాలంటే ఈ సెగ్మెంట్‌పై అధినేత ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వుంది.


చురుకుదనం పెరగాలి


తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, పుంగనూరు సెగ్మెంట్లలో నాయకుల పనితీరు చాలా మెరుగుపడాల్సివుంది. ఈ నియోజకవర్గాల్లో బాగా పేరున్న, ప్రజల్లో గుర్తింపు వున్న ఇంఛార్జులు వున్నారు. అయితే శ్రీకాళహస్తి, చంద్రగిరి, పుంగనూరుల్లో ప్రత్యర్థులతో పోలిస్తే టీడీపీ ఇంఛార్జులు స్థానికంగా క్యాడర్‌కు మరింత అందుబాటులో వుండాల్సిన అవసరం కనిపిస్తోంది. చంద్రగిరి ఇంఛార్జి పులివర్తి నాని నిజానికి 2019లో చిత్తూరు నుంచీ పోటీ చేయాలని భావించారు. చాలాకాలంగా అక్కడ వర్గాన్ని కూడగట్టుకున్నారు.అధినేత నిర్ణయంతో చంద్రగిరికి రావాల్సివచ్చింది. ఇపుడు చిత్తూరులో నాయకత్వ శూన్యత వుండడంతో నానీ మనసు అటువైపే లాగుతోందని అంటున్నారు. శ్రీకాళహస్తి, చంద్రగిరి, పుంగనూరులతో పాటు తిరుపతి ఇంఛార్జి కూడా ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో వుంచుకుని దానికనుగుణంగా తమ శైలిని మార్చుకోవాల్సి ఉంది. వీరు మరింత క్రియాశీలంగా ఉండకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. 


ఇక్కడ సమస్య లేదు!


కుప్పం, పీలేరు, నగరి, పలమనేరు సెగ్మెంట్లలో నాయకత్వ సమస్యలేదు.చంద్రబాబు సొంత నియోజక వర్గం కావడం కుప్పం బలం. అయితే స్థానిక నాయకులపై ఉన్న వ్యతిరేకత ఇక్కడ పార్టీకి నష్టం.   నగరిలో గాలి భానుప్రకాష్‌, తండ్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడిని గుర్తుకు తెస్తున్నారు. పల్లెలు చుడుతున్నారు. ఎవరింట్లో ఏ కార్యం అయినా హాజరవుతున్నారు. పీలేరులో నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి కి గ్రామీణ సంబంధాలు పటిష్టంగా ఉన్నాయి. నిరంతరం క్యాడర్‌తో అయన ఉంటున్నారు. పలమనేరులో అమరనాథరెడ్డి వైసీపీపై దూకుడు పెంచారు. పార్టీ క్యాడర్‌కు ఎక్కడ అన్యాయం జరిగినా నిలబడి భరోసా ఇస్తున్నారు. 


Updated Date - 2022-07-07T06:26:07+05:30 IST