మార్పు మొదలైంది!

ABN , First Publish Date - 2021-11-19T05:44:32+05:30 IST

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అప్పట్లో అధికారాన్ని ఉపయోగించుకొని విపక్షాల అభ్యర్థులను లోబర్చుకోవడం, బెదిరింపులకు దిగడం, ఓటర్లను ప్రలోభపెట్టడం వంటి చర్యలకు పాల్పడింది. దీంతో టీడీపీ పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరించింది. ఆతర్వాత జరిగిన మున్సిపోల్స్‌కు మాత్రం అభ్యర్థులను బరిలోకి దింపింది. పూర్తిస్థాయి విజయాలు సాధించనప్పటికీ ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు అద్దంకి, గిద్దలూరు నగర పంచాయతీలు, మార్కాపురం మునిసిపాలిటీలో కొన్నివార్డులను కైవసం చేసుకుంది.

మార్పు మొదలైంది!

‘స్థానిక’ ఫలితాలే సంకేతం

తెలుగు తమ్ముళ్లలో జోష్‌ 

వైసీపీలో అంతర్మథనం

ప్రభుత్వ, స్థానిక నేతలపై

ప్రస్పుటమైన వ్యతిరేకత 

దర్శిలో గెలిచిన టీడీపీ

కౌన్సిలర్ల కోసం వైసీపీ వేట

22న నగర పంచాయతీ చైర్మన్‌ ఎన్నిక 


ఆంధ్రజ్యోతి , ఒంగోలు 

జిల్లాలో జరిగిన పంచాయతీ, ప్రాదేశికాలతోపాటు, దర్శి నగర పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రజల్లో మార్పునకు సంకేతంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఆరంభమైన వ్యతిరేకత, అధికార పార్టీ స్టానిక నేతల పట్ల ఉన్న అసంతృప్తులకు దర్పణం పడుతున్నాయి. మొత్తంగా ఈ ఎన్నికల ఫలితాలు టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా, అధికార పార్టీ నేతల్లో అంతర్మథనానికి కారణమయ్యాయి. ఎన్నికలు జరిగిన ఒక సర్పంచ్‌తోపాటు, ఏడు పంచాయితీ వార్డుల్లో నాలుగు చోట్ల టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ఎంపీటీసీ స్థానాల్లో రెండింటిని టీడీపీ గెలుచుకోగా, ఒక చోట ఆ పార్టీ మద్దతుతో పోటీచేసిన జనసేన అభ్యర్థి విజయం సాధించారు. వైసీపీకి మూడు పంచాయతీ వార్డులు, నాలుగు ఎంపీటీసీ స్థానాలు మాత్రమే దక్కాయి. దర్శి నగర పంచాయతీలో టీడీపీ విజయదుందుభి మోగించింది. అక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన 6,700 ఓట్ల మెజారిటీని ఆ పార్టీ కోల్పోవడం చర్చనీయాంశమైంది. 


రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అప్పట్లో అధికారాన్ని ఉపయోగించుకొని విపక్షాల అభ్యర్థులను లోబర్చుకోవడం, బెదిరింపులకు దిగడం, ఓటర్లను ప్రలోభపెట్టడం వంటి చర్యలకు పాల్పడింది. దీంతో టీడీపీ పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికలను బహిష్కరించింది. ఆతర్వాత జరిగిన మున్సిపోల్స్‌కు మాత్రం అభ్యర్థులను బరిలోకి  దింపింది. పూర్తిస్థాయి విజయాలు సాధించనప్పటికీ ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు అద్దంకి, గిద్దలూరు నగర పంచాయతీలు, మార్కాపురం మునిసిపాలిటీలో కొన్నివార్డులను కైవసం చేసుకుంది. ఇది టీడీపీ శ్రేణుల్లో పార్టీపట్ల ఉన్న అంకితభావాన్ని తెలియజేసింది. ఇదిలా ఉండగా జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ సర్పంచ్‌లు, వార్డులు, ఎంపీటీసీ స్థానాలతోపాటు దర్శి నగర పంచాయతీకి వారం రోజులుగా ఎన్నికలు జరిగి, ఓట్ల లెక్కింపు పూర్తయింది. వీటి ఫలితాలు ఇప్పు అందరి దృష్టిని ఆకర్షించాయి. 

 పంచాయతీ పోరులో టీడీపీ పైచేయి

ఏకగ్రీవమైన వాటిని పక్కన పెడితే ఒక సర్పంచ్‌, ఏడు పంచాయతీ వార్డులకు తొలుత ఎన్నికలు జరిగాయి. కందుకూరు మండలం నరిశెట్టివారిపాలెం పంచాయతీని టీడీపీ కైవసం చేసుకుంది. అక్కడ పోటీకి దిగిన వైసీపీ పప్పులు ఉడకలేదు. వార్డుల్లో టంగుటూరు మండలం ఎం.నిడమానూరు, ఇంకొల్లు మండలం పూసపాడు వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. నిడమానూరు వార్డులో అయితే వైసీపీ నేతలు గెలుపుకోసం సామ,దాన,భేద దండోపాయాలను ఉపయోగించారు. అయినప్పటికీ విజయం టీడీపీ మద్దతుదారుడినే వరించింది. గిద్దలూరు నియోజకవర్గంలో ముఖ్యమైన కంభంలో కలిసి ఉండే కందులాపురం వార్డులో,  మార్కాపురం నియోజకవర్గం తర్లుపాడు మండలం  మీర్జాపేట పంచాయతీలోని ఒకవార్డులో టీడీపీ మద్దతుదారులు గెలుపొందటం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తించింది. కందులాపురంలోని వార్డులో గెలుపు కోసం వైసీపీ ముఖ్యనేతలు శతవిధాలా ప్రయత్నించినా విజయం టీడీపీ మద్దతుదారుడిని వరించటం ప్రజల ఆలోచనలో వచ్చిన మార్పుకు దర్పణంగా చెప్పకోవచ్చు.

ఆసక్తికరంగా ఎంపీటీసీ ఫలితాలు 

ఎంపీటీసీ స్థానాల ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఇవి ఆసక్తికరంగా ఉన్నాయి. పర్చూరు నియోజకవర్గం కారంచేడు, అద్దంకి నియోజకర్గం ఉప్పుమాగులూరులో టీడీపీ అభ్యర్ధులు గెలుపొందారు. కారంచేడులో గెలుపుకోసం వైసీపీ నేతలు సర్వశక్తులూ ఒడ్డారు. ఓటర్లు ప్రలోభాలను తిరస్కరించారు. ఉప్పుమాగులూరులో ఎంఈటీసీ స్థానాన్ని గతంలో వైసీపీ అభ్యర్ది ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యుడినే వైసీపీ రంగంలోకి దించినా టీడీపీ అభ్యర్థికి ఓటర్లు పట్టం కట్టారు. అధికార పార్టీ నాలుగు ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం మురుగుమ్మిలో వైసీపీ అభ్యర్థి 58 ఓట్లతో గెలుపొందారు. గెలుపు ధీమాతో ఉన్న టీడీపీ అభ్యర్థి ఓటమికి లెక్కింపులో మతలబు ఏమన్నా జరిగిందా అనే అనుమానాలు లేకపోలేదు. అక్కడ చెల్లని ఓట్లు, నోటా ఓట్లు కలిపితే వైసీపీకి వచ్చిన ఆధిక్యతను మించి ఉన్నాయి.  

జనసేన గెలుపులో టీడీపీ

సంతనూతలపాడు నియోజకవర్గం చదలవాడ ఎంపీటీసీ స్దానాన్ని జనసేన అభ్యర్థి గెలుచుకున్నారు. గతంలో ఈస్థానం వైసీపీ చేతిలో ఉంది. ఉప ఎన్నికలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుని జనసేన అభ్యర్థికి మద్దతునిచ్చింది. వైసీపీ గెలుపునకు ఎమ్మెల్యే అక్కడ తిష్టవేసి తీవ్రప్రయత్నాలు చేశారు. కానీ టీడీపీ, జనసేన కార్యకర్తల సమష్టి కృషి ఫలించింది.  రాజకీయంగా ఈ గెలుపు భవిష్యత్‌లో జరగబోయే మార్పులకు ఓ సంకేతంగా భావిస్తున్నారు. 

దర్శిలో 6,700 ఓట్ల మెజారిటీని కోల్పోయిన వైసీపీ

దర్శి నగర పంచాయతీలో టీడీపీ గెలుపును ఆషామాషీగా తీసుకోవటానికి వీలులేదన్న అభిప్రాయం యావత్తు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్యేకు దర్శి నగర పంచాయతీ పరిధిలోనే 6,700 ఓట్ల ఆధిక్యం లభించింది. కానీ ఇప్పుడు జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో గతంలో వచ్చిన 6,700 ఓట్ల మెజారిటీని వైసీపీ కోల్పోగా.. టీడీపీకి గెలుపొందిన 13 వార్డుల్లో 1890 ఓట్ల ఆధిక్యం లభించింది.   

స్పష్టంగా కనిపించిన వ్యతిరేకత

మొత్తం పరిస్థితులను సమీక్షిస్తే ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి, ఆయా రంగాలకు సంబంధించి ప్రభుత్వ విధాన నిర్ణయాలపట్ల వ్యతిరేకత ఆరంభమైనట్లు కనిపిస్తోంది. దీనికితోడు స్థానిక అధికార పార్టీ నేతలు, ముఖ్యంగా ఎమ్మెల్యేల పట్ల ఉన్న అసంతృప్తి  కూడా ప్రస్ఫుటమైంది.  దర్శి నగరపంచాయితీ ఓటర్లలో ఆ విషయం బహిరంగంగానే కనిపించింది. ఇక్కడ వైసీపీ నేతలు అధికారాన్ని వినియోగించినా ఉపయోగం లేకుండా పోయింది. 

టీడీపీలో ఉత్సాహం .. వైసీపీలో అంతర్మథనం

ఈ ఎన్నికల్లో టీడీపీ నేతలు సమిష్టిగా పనిచేయటం, కిందిస్ధాయిలోని ఆపార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఓటింగ్‌కు రావడం స్పష్టంగా కనిపించింది. అదేసమయంలో అఽధికార వైపీసీలో కిందిస్థాయి నాయకులు, కేడర్‌ గతంలా అన్నీతామై పనిచేయని విషయం తేటతెల్లమైంది. ఇటు టీడీపీ క్యాడర్‌లో ఉత్సాహం పెరగ్గా, వైసీపీ క్యాడర్‌లో నిస్తేజం ఆవహించిందన్న విషయం స్పష్టంగా కనిపించింది. మొత్తంగా చూస్తే కార్యకర్తల బలం అధికంగా ఉన్న టీడీపీలో కిందిస్థాయిలో వచ్చిన, తదనుగుణంగా లభించిన ఆశాజనకమైన ఫలితాలు తెలుగు తమ్ముళ్లకు ఊరటనివ్వగా, వైసీపీ నేతలను ముఖ్యంగా ఆ పార్టీకి ఓటమి ఎదురైన ప్రాంతాల్లోని నాయకులను నిరుత్సాహానికి గురి చేశాయి. 

22న దర్శి నగర పంచాయతీ చైర్మన్‌ ఎన్నిక

దర్శి నగర పంచాయతీ ఛైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక ఈనెల 22వతేదీ జరగనుంది. తెలుగుదేశం తరపున గెలుపొందిన 13 మందిని ఆపార్టీ నేతలు క్యాంపునకు తరలించారు. అయితే గురువారం కొంత మంది విజేతల ఇళ్లకు కొందరు వెళ్లి వైసీపీ వైపు మొగ్గుచూపితే అన్ని విధాలా సహకరిస్తామని ప్రలోభపెట్టినట్లు తెలిసింది. ఇది గమనించి టీడీపీ నాయకులు క్యాంపులో ఉన్న కౌన్సిలర్ల సెల్‌ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్‌ చేసినట్లు సమాచారం. టీడీపీ చైర్మన్‌ అభ్యర్థిగా గతంలోనే కాపు సామాజికవర్గానికి చెందిన పిచ్చయ్య పేరును ప్రకటించారు. వైస్‌చైర్మన్‌గా బలహీనవర్గాలు, లేక దళిత సామాజికవర్గం నుంచి గెలుపొందిన వారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-11-19T05:44:32+05:30 IST