మార్పు మంచిదే!

ABN , First Publish Date - 2020-11-10T05:52:47+05:30 IST

డొనాల్డ్‌ ట్రంప్‌ ఓడిపోయారు. ఈసారి అమెరికా ఎన్నికల సారాంశం ఎవరు గెలిచారన్నది కాదు, ప్రజలు ఎవరిని...

మార్పు మంచిదే!

డొనాల్డ్‌ ట్రంప్‌ ఓడిపోయారు. ఈసారి అమెరికా ఎన్నికల సారాంశం ఎవరు గెలిచారన్నది కాదు, ప్రజలు ఎవరిని ఓడించారన్నది– అన్న వ్యాఖ్య విస్తృతంగా వినిపిస్తోంది. ట్రంప్‌ ఓటమికి ప్రాధాన్యం ఉన్న మాట వాస్తవం. ఆయన ఒక తరహా వ్యక్తిత్వానికి, అభిప్రాయాలకు, సంస్కారానికి ప్రతీకగా ఉన్నారు. దేన్నీ ఖాతరు చేయనట్టు, ఏ నియమానికీ బద్ధుణ్ణి కానట్టు ఆయన సరళి ఉండేది. ఆ ప్రవర్తన, అమెరికా తన రెండున్నర శతాబ్దాల స్వాతంత్య్రంలో సమకూర్చుకున్న అనేక వ్యవస్థలను, విలువలను కూడా లెక్కచేసేది కాదు. ఆయన వంటి వారు అనేకమంది ప్రపంచంలో దేశాధిపతులైన సమయంలోనే ట్రంప్‌ కూడా పీఠం ఎక్కారు. తనవంటి వారితోనే ఎక్కువ మెలిగారు. మునుపటి రిపబ్లికన్‌ అధ్యక్షులతో పోలిస్తే, ట్రంప్‌లో యుద్ధప్రియత్వం తక్కువే. పైగా, ఉపసంహరణల మీదనే ఎక్కువ దృష్టి పెట్టాడు. కాకపోతే, ప్రపంచ మితవాద ఉధృతికి ప్రేరణగా, నాయకుడిగా ప్రజలను భ్రయభ్రాంతులను చేశాడు. సహజంగానే, అమెరికన్‌ ప్రజలు ఎక్కువ భీతిల్లారు. 


ఇప్పుడు జరిగింది ట్రంప్‌ ఓటమే తప్ప, జో బైడెన్‌–కమలాహ్యారిస్‌ గెలుపు కాదనుకుంటే అది పొరపాటు. మా ప్రజాస్వామ్యం మళ్లీ మాకు కావాలి–అని నినదించిన అమెరికన్లకు, అణగారిపోయిన అమెరికా అంతరాత్మను పునరుద్ధరించమని అడిగిన దేశభక్తులకు, అజ్ఞానానికి, కుసంస్కారానికి, నిలువునా చీలిక తెస్తున్న విభజన వాదానికి, పెరిగిపోతున్న ద్వేషానికి అడ్డుకట్టవేయాలనుకునే బాధ్యత కలిగిన పౌరులకు తగిన నాయకత్వాన్ని బైడెన్‌ అందించారు. సంయమనం, అనుభవం, లింగ, జాతి, వర్ణ సమ్మిశ్రితత్వం, సానుకూల సమైక్యభావం– వీటికి అధ్యక్ష– ఉపాధ్యక్ష అభ్యర్థులిద్దరూ ప్రతీకలుగా నిలిచారు. కమలా హ్యారిస్‌ భారత, ఆఫ్రికన్‌ అమెరికన్‌ కోవలకు రెంటికీ చెందిన వ్యక్తి కావడం విశేషం. పైగా, మహిళ. మూడో ప్రపంచదేశాలు ఎప్పుడో అధిగమించిన ఒక అడ్డుగోడను ఇంతకాలానికి అమెరికా దాటగలిగింది. విజయం ఖాయమైపోయిన తరువాత బైడెన్‌ దేశానికి ఇచ్చిన ఆశ్వాసన– ఐక్యత, సమపాలనం, ఉపశమనం. తక్షణం దృష్టి పెడుతున్న అంశం– ట్రంప్‌ కాలంలో నవ్వులాటగా మారిపోయిన కొవిడ్‌–19 వ్యాప్తి నిరోధం. అచ్చమైన శాస్త్ర విజ్ఞానం పునాదిగా కొవిడ్‌–19 పై బైడెన్‌–హ్యారిస్‌ వ్యూహం రూపొందుతుందని అగ్రనాయకులు ప్రకటించారు. 


అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ప్రపంచం, భారతదేశం ఈసారి మరింత అధికంగా ఆసక్తి చూపాయి. భారత అమెరికా సంబంధాలంటే, ఇటీవలి కాలంలో ఉద్యోగ వీసాలకు, ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన అంశంగా ముందుకు వస్తున్నది. దక్షిణాసియా రాజకీయాలలో పాకిస్థాన్‌ భారత్‌తో సమవుజ్జీగా తలపడడం గతంలోని మాట కానీ, ఇప్పటికీ పాక్‌–ఆప్ఘన్‌ సరిహద్దుల్లోని ఉగ్రవాద సమస్య, కశ్మీర్‌లో తిరుగుబాటుదారులు, సరిహద్దుల ఆవలనుంచి చొరబాటుదారులు, కొత్తగా చైనాతో హిమాలయ సరిహద్దుల్లో ఏర్పడ్డ సమస్యలు– అమెరికాకు ఎంతో ఆసక్తికలిగిన అంశాలు. చైనాతో భారత్‌ తీవ్రంగా తలపడాలని అమెరికా ఆశిస్తూ వచ్చింది. ట్రంప్‌ హయాంలో ఆ వ్యూహం బాగానే ముందుకి నడిచింది. ట్రంప్‌ను కేంద్రంగా చేసుకుని అంతర్జాతీయ సంబంధాలను భారత్‌ తీర్చిదిద్దుకుంటూ ఉన్నది. డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ఎన్నిక కావాలని అభిలషించి, అధికారికంగా ఒక పక్షం తీసుకున్నట్టు భారత ప్రధాని మోదీపై విమర్శ ఉన్నది. ట్రంప్‌ ఓటమి మోదీ ప్రభృతులలో తీవ్రనిరాశను కలిగించిందని చెబుతున్నారు. గత ఏడాది కశ్మీర్‌ విషయంలో తీసుకున్న నిర్ణయాలపై భారత్‌కు అమెరికా మౌన సమర్థన ఇస్తూ వస్తున్నది. మునుముందు ఆ వైఖరి మారిపోవచ్చు. భారతదేశం కూడా తన ప్రాధాన్యాలను పునర్‌ నిర్వచించుకోవలసి రావచ్చును. 


అమెరికా నూతన ప్రభుత్వం కొంతకాలం పాటు ఇల్లు చక్కదిద్దడానికి, కొన్ని అంతర్గత విధానాలను సవరించడానికి సమయం కేటాయిస్తుంది. బైడెన్‌ తన ప్రసంగంలో సూచించినట్టు, బహుముఖీన ప్రపంచ వ్యవస్థకే నూతన ప్రభుత్వం మొగ్గు ఉంటే, అంతర్జాతీయ సంబంధాలలో అనేక మార్పులు రావచ్చును. చైనాతో దూకుడు వైఖరి తగ్గవచ్చు. ఇరాన్‌తో చర్చలు మళ్లీ ప్రారంభం కావచ్చును. ఆప్ఘనిస్థాన్‌లో సంధి త్వరితగతిన జరగవచ్చు. దౌత్యం, పరస్పరత వంటి విలువలను ఆశ్రయించి, అమెరికా ఆర్థిక స్థితిగతులను పెంచుకునే ప్రయత్నం నూతన నాయకత్వం చేయవచ్చు. 


ఒక ప్రజాస్వామిక దేశంగా అమెరికా వేరు. ప్రపంచ ఆధిపత్యశక్తిగా అమెరికా వేరు. అట్లాగే, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల జీవనసరళి యవనికల వెనుక వర్ణ దురహంకారం, ప్రవాసులపై వ్యతిరేకత, నేరాల ఉధృతి వంటి దుర్మార్గాలు కూడా చాలా ఉన్నాయి. అమెరికాకు చెందిన ఈ మౌలిక లక్షణాలలో కొత్తప్రభుత్వం వల్ల మార్పు వస్తుందని ఆశించడం పొరపాటు. కమలా హ్యారిస్‌ చెప్పినట్టు అమెరికన్‌ ప్రజలు ‘‘ఆశను, ఐక్యతను, సంస్కారాన్ని, శాస్త్ర విజ్ఞానాన్ని, సత్యాన్ని’’ ఎంచుకున్నారు. ఆమె చెప్పిన లక్షణాలన్నీ, ట్రంప్‌ హయాం వల్ల అమెరికన్‌ సమాజంలో ఏర్పడిన అవలక్షణాలకు విరుగుళ్లు. ఈ క్షణాన, ఈ సందర్భాన వినిపిస్తున్న ఆదర్శాలు ఎంతో కాలం ఉండకపోవచ్చు. కాకపోతే, ట్రంప్‌ పతనం ప్రపంచవ్యాప్తంగా మితవాద వెల్లువను కూడా తిరుగుముఖం పట్టిస్తుందన్న ఆశాభావం నిజమైతే, అదొక పెద్ద పరిణామం అవుతుంది.

Updated Date - 2020-11-10T05:52:47+05:30 IST