బాగుపడాలంటే మారక తప్పదు : శశి థరూర్

ABN , First Publish Date - 2022-03-11T20:18:30+05:30 IST

ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్

బాగుపడాలంటే మారక తప్పదు : శశి థరూర్

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఘాటుగా స్పందించారు. అదృష్టాన్ని తిరిగి తెచ్చుకోవాలంటే కాంగ్రెస్ నాయకత్వం మారక తప్పదని చెప్పారు. గురువారం రాత్రి ఆయన ఇచ్చిన ట్వీట్‌లో పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలని పిలుపునిచ్చారు. 


ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడిన సంగతి తెలిసిందే. పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోవడంతోపాటు మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలను సాధించలేకపోయింది. 403 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 2 స్థానాలు లభించాయి. 117 స్థానాలున్న పంజాబ్‌లో అధికారాన్ని కోల్పోవడంతోపాటు దారుణంగా దెబ్బతింది. కేవలం 18 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలు ఉన్నాయి, వీటిలో కాంగ్రెస్‌కు కేవలం 19 స్థానాలు మాత్రమే లభించాయి. 40 స్థానాలున్న గోవాలో ఆ పార్టీకి 12 స్థానాలు లభించాయి. మణిపూర్‌లో 60 స్థానాలకు ఎన్నికలు జరిగాయి, కాంగ్రెస్‌ 5 స్థానాలకు పరిమితమైంది. 


కాంగ్రెస్ వరుస పరాజయాలను ఎదుర్కొంటుండటంతో పార్టీని ప్రక్షాళన చేయాలనే డిమాండ్ చాలా కాలం నుంచి వినిపిస్తోంది. ఈ డిమాండ్‌తో సీనియర్ నేతలు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ కూడా రాశారు. తాజాగా శశి థరూర్ గురువారం రాత్రి ఇచ్చిన ట్వీట్‌లో ఈ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. 


‘‘ఇటీవలి శాసన సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ను నమ్ముకున్నవారందరినీ బాధిస్తున్నాయి. కాంగ్రెస్ సమర్థిస్తున్న భారత దేశ భావనను, దేశానికి ఇస్తున్న పాజిటివ్ అజెండాను పునరుద్ఘాటించవలసిన, ఆ సిద్ధాంతాలను మళ్ళీ రగిలించేవిధంగా, ప్రజలను ప్రేరేపించే విధంగా మన సంస్థాగత నాయకత్వాన్ని సంస్కరించవలసిన సమయం ఆసన్నమైంది. ఒక విషయం సుస్పష్టం - మనం గెలవాలంటే మార్పు అనివార్యం’’ అని శశి థరూర్ పేర్కొన్నారు. 


ఉత్తర ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై శశి థరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ మహమ్మారి రెండో ప్రభంజనం సమయంలో ప్రభుత్వ తప్పుడు నిర్వహణ వల్ల గంగా నదిలో మృతదేహాలు తేలియాడాయని, ద్రవ్యోల్బణం పెరిగిందని, నిరుద్యోగం పెరిగిందని పేర్కొన్నారు. మతపరమైన విద్వేషాలు రగిలాయని, విభజన రాజకీయాలు పెరిగాయని ఆరోపించారు. మనం నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. 


ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ కేంద్ర మంత్రి అశ్వని కుమార్ కూడా ఈ ఎన్నికల ఫలితాలపై ఘాటుగా స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ సమీక్షించుకోవాలన్నారు. కాంగ్రెస్‌కు ఇవి చివరి ఘడియలని ఈ ఫలితాలు చెప్తున్నాయన్నారు. ఆ పార్టీ భవిష్యత్తులో ఓ ప్రాంతీయ పార్టీ స్థాయికి క్షీణిస్తుందన్నారు. రాజకీయంగా పట్టించుకోవలసిన అవసరం లేని స్థాయికి దిగజారుతుందన్నారు. 



Updated Date - 2022-03-11T20:18:30+05:30 IST