
ఎన్నారై డెస్క్: NEET మెడికల్ సీట్ల కేటాయింపునకు సంబంధించి ఎన్నారై కోటా మరోసారి వివాదాస్పదంగా మారింది. ఎన్నారై కోటాలోని సీట్లు ‘ఇండియన్ నేషనల్’ కోటా పరిధిలోకి వస్తాయన్న ఆశతో ఉన్న విద్యార్థులకు తాజాగా ఊహించని షాక్ తగిలింది. అత్తెసరు ర్యాంకులతో నీట్ క్వాలిఫై అయిన వారు కూడా ఒక్కసారిగా ఎన్నారై కోటాలోని సీట్లు దక్కించుకోవడంతో ఇతర విద్యార్థులు, వారి తల్లితండ్రులు అవాక్కవుతున్నారు. నీట్లో కాస్తంత మెరుగైన ర్యాంకులు సాధించి..సీటు వస్తుందన్న ఆశతో ఉన్నవారందరూ ఈ పరిణామంతో హతాశులవుతున్నారు. అసలేం జరిగిందంటే..
సాధారణంగా దేశంలోని మెడికల్ సీట్లలో కొన్ని భారత్లోనే ఉంటున్న విద్యార్థులకు ఇండియన్ నేషనల్ కేటగిరీ కింద కేటాయిస్తారు. మిగిలిన వాటిని ఎన్నారై కోటా కింద భారతీయ సంతతికి చెందిన విద్యార్థులకు లేదా భారత సంతతికి చెందిన వారు విదేశీ స్పాన్సర్లుగా ఉన్న విద్యార్థులకు ఇస్తారు. ఇక నేషనల్ మెడికల్ కౌన్సిల్ జనవరి 10న జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. నీట్ కౌన్సెలింగ్ మొదటి రెండు రౌండ్లలో మిగిలిపోయిన ఎన్నారై, మైనారిటీ కేటగిరీలోని సీట్లను ఇండియన్ నేషనల్ కేటగిరీలోకి బదిలీ చేయాలి. ఎన్నారై కోటాను కట్టడి చేసేందడకు ఎన్ఎమ్సీ ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. నీట్లో కాస్తంత మెరుగైన ర్యాంకు సాధించినా సీటు దక్కని విద్యార్థుల్లో ఈ ఆదేశాలు కొత్త ఆశలు చిగురింప చేశాయి. ఎన్నారై కోటా సీట్లు..కనీసం ఇండియన్ నేషనల్ కేటగిరీ పరిధిలోని మేనేజమెంట్ కోటాలోకి మారినా.. తమకు మెడికల్ విద్య చదువుకునే అవకాశం లభిస్తుందని అనేక మంది ఆశపడ్డారు.
కౌన్సిలింగ్లో చివరిదైన మాప్ అప్ రౌండ్ మార్చి 10 నుంచి ప్రారంభమయ్యింది. దీనికి ముందు ఎన్నారై కోటాలోని అనేక సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి. అయితే.. మాప్ అప్ రౌండ్ ప్రారంభం కాగానే ఒక్కసారిగా ఎన్నారై సీట్లకు డిమాండ్ పెరిగిపోయింది. అంతంతమాత్రం ర్యాంకులతో నీట్ క్వాలిఫై అయిన విద్యార్థులు అనేక మంది రాత్రికి రాత్రి ఎన్నారై కోటాలోకి మారిపోయారు. తమకు విదేశాల్లో భారతీయ సంతతి వారు స్పాన్సర్లుగా ఉన్నారని, తమ చదువకు అయ్యే ఖర్చు వారే భరిస్తారంటూ భారతీయ కాన్సులేట్ల నుంచి ధృవీకరణ పత్రాలను తెచ్చుకున్నారు. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. మెడికల్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ఏ దశలో ఉన్నదనే దానితో నిమిత్తం లేకుండా విద్యార్థులు తమ ‘నేషనాలిటీ’ని మార్చుకునే(ఇండియన్ నేషనల్ నుంచి ఎన్నారై కోటాలోకి మారడం) అవకాశం ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని అనేక మంది కౌన్సెలింగ్ తుది అంకంలో తమ నేషనాలిటీని మార్చుకోగలిగారు. దాదాపు 152 మంది రాత్రికి రాత్రి తమ నేషనాలిటీని మార్చుకున్నట్టు మీడియాలో అనేక వార్తలు వెలువడ్డాయి.
ఈ పరిణామాలు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. డబ్బున్న వాళ్లందరూ ఇలా ఎన్నారై కోటా మెడికల్ సీట్లు దక్కించుకుంటున్నారని, మెరిట్ విద్యార్థలకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాల వెనకాల కాలేజీ యాజమాన్యాల హస్తం కూడా ఉందని చెబుతున్నారు. డబ్బున్న విద్యార్థులతో ముందుగానే ఒప్పందాలు కుదుర్చుకుని చివరి నిమిషంలో ఇలా చేసి.. తక్కువ ఫీజుకు సీట్ల కేటాయింపు జరగడాన్ని అడ్డుకుంటున్నారని కొందరు అనుమానిస్తున్నారు. జాతీయ మీడియా చెబుతున్న ఓ ఉదాహరణ ప్రకారం.. మహారాష్ట్రలోని ప్రవర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో.. మేనేజ్మెంట్ కోటాలోని చిట్టచివరి సీటు దక్కించుకున్న విద్యార్థి నీట్ ర్యాంకు 83 వేల పైచిలుకు కాగా.. అదే కాలేజీలో ఎన్నారై కోటాలోని చివరి సీటు దక్కించుకున్న విద్యార్థి ర్యాంకు 8,72, 911. ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ దాదాపు ఇలాంటి సీన్సే కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. సాధారణ మేనేజ్మెంట్ కోటాలోని సీటు సగటు ఫీజు రూ. 26 లక్షల వరకూ ఉండగా.. ఎన్నారై సీట్ల ఫీజులు అంతకంటే పాతిక లక్షలు అధికంగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఇలా విదేశీ స్పాన్సర్ల పేరిట అనేక మంది చివరి నిమిషంలో తమ అవకాశాలను గండికొడుతున్నారని ఆరోపిస్తున్నారు.