రికార్డులు మార్చేసి.. నిధులు కాజేసి..

ABN , First Publish Date - 2021-10-29T05:41:54+05:30 IST

పంచాయతీరాజ్‌లో మాయాజాలం చేశారు. రూ.2 కోట్లు కొల్లగొట్టడానికి అ డ్డగోలుగా వ్యవహరించారు. ఏకంగా రికార్డులే మార్చేశారు.

రికార్డులు మార్చేసి.. నిధులు కాజేసి..
ఈఈ వెంకటప్రసాద్‌ చాంబర్‌

ఈఈ వెంకటప్రసాద్‌ అవినీతి బాగోతం

రూ.2 కోట్లు వెనక్కి.?

అనంతపురం విద్య, అక్టోబరు 28: పంచాయతీరాజ్‌లో మాయాజాలం చేశారు. రూ.2 కోట్లు కొల్లగొట్టడానికి అ డ్డగోలుగా వ్యవహరించారు. ఏకంగా రికార్డులే మార్చేశారు. చిన్న పనికీ ప్రస్తుతం సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా చెల్లింపులు చే స్తుంటే... రూ.1.89 కోట్ల చెల్లింపులు చెక్కు ద్వారా ఇవ్వడం చూస్తుంటే ఏ స్థాయిలో అక్రమానికి ఒడిగట్టారో ఇట్టే తెలుస్తోంది. అక్రమాలను బయటపెట్టిన అధికారిని సరెండర్‌ చేసినట్లు సమాచారం. ఆయన క్యాష్‌ బుక్‌లో రాసిన రిపోర్టులను సైతం చింపేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి పంచాయతీరాజ్‌ పీఆర్‌ఐ ధర్మవరం డివిజన్‌లో కాసుల కోసం పెద్ద మాయాజాలం నడిపారు. ‘రూ.2 కోట్లు స్వా హా’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ గురువారం ప్రచురించిన కథనంతో పీఆర్‌లో అలజడి రేగింది. కొందరు అధికారులు సెలవులో వెళితే.. మరికొందరు ఫోన్లు ఎత్తకుండా తప్పించుకుంటున్నారు.


రికార్డులు తారుమారు చేసి...

పంచాయతీరాజ్‌ పీఆర్‌ఐ ధర్మవరం డివిజన్‌లో అవినీతి కోట్లు దాటేసింది. తాజాగా రూ.2 కోట్లకుపైగా నిధులు స్వాహా చేసిన వ్యవహారంలో ఇదే స్పష్టమవుతోంది. ఈఈ వెంకటప్రసాద్‌ ఆధ్వర్యంలో ఈ అవినీతి బాగోతం నడిచిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రూ.12.10 లక్షలు ఎంపీ ల్యాడ్స్‌ నుంచి, రూ.1.89 కోట్లు జడ్పీ జనరల్‌ ఫండ్‌ నుంచి డ్రా చేసినట్లు తెలుస్తోంది. రూ.1.89 కోట్ల చెక్కును కేపీ రంగారెడ్డి పేరున డ్రా చేశారు. ఈ బిల్లును రెడ్డిపల్లి వద్ద ఉన్న వ్యవసాయ గోడౌన్‌ పనులు చేసినందుకు చెల్లిస్తున్నట్లు చూపించి, డ్రా చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ పనులకు చెల్లింపు సీఎ్‌ఫఎంఎస్‌ ద్వా రా కాకుండా చెక్కు రూపంలో ఇవ్వడంపై విమర్శలు వ స్తున్నాయి. చిన్నపనికి సైతం సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా చెల్లింపులు చేస్తున్న తరుణంలో చెక్కుల ద్వారా డ్రా చే యడం చూస్తుంటే... అక్రమానికి తెరలేపినట్లు స్పష్టం గా వ్యక్తమవుతోంది. ఇందులో ఈఈ పాత్రే కీలకంగా కనిపిస్తోందని సమాచారం.


బయట పెట్టినందుకు కక్ష సాధింపు

అక్రమాలను బయట పెట్టినందుకు ఆ కార్యాలయంలో పనిచేస్తున్న డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏఓ)పై సరెండర్‌ వేటు వేసినట్లు సమాచారం. అక్కడ ఎ లాంటి రికార్డులు లేకుండా రూ.2 కోట్లు డ్రా చేయడంతో డీఏఓ.. ఈ ఈ దృష్టికి తీసుకెళ్లారు. ఈనెల 16న పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ, కలెక్టర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ దృష్టికి తీసుకెళ్లారు. అడ్డగోలుగా రికార్డులు, ఎంబుక్స్‌ లేకుండా నిధులు డ్రా చేసిన బాగోతంపై రిపోర్టు రెడీ చేసి వారికి పంపారు. తమ అక్రమాలు బయటపెట్టాడన్న అక్కసుతో ఆ డీఏఓను ఈఈ సరెండర్‌ చేయించినట్లు పీఆర్‌ అధికారులు, ఉద్యోగుల్లో తీవ్ర చర్చ సాగుతోంది.


ఈ నెల 21న డబ్బు రిటర్న్‌....?

అడ్డగోలుగా కథ నడిపి అక్రమానికి తెరలేపిన అధికారు లు, మరికొందరు క్యాష్‌బుక్‌లో అవినీతి ఆనవాళ్లు లేకుండా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో డీఏఓ క్యాష్‌ బుక్‌లో రాసిన పేజీలు మాయమైనట్లు సమాచారం. రెండు రోజుల కింద విచారణకు వెళ్లిన అధికారులు పేజీలు మాయమైనట్లు గుర్తించారట. అంతేకాకుండా నొక్కేసిన డబ్బు సైతం వెనక్కు కట్టినట్లు పీఆర్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాంట్రాక్టర్‌ ఏ అకౌంట్‌ నుంచి డ్రా చేశారో... అదే ఖాతాకు ఈ 21వ తేదీన డబ్బు వెన క్కు కట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి. వీటిని అధికారులు ధ్రువీకరించడం లేదు.


ఈఈ సరెండర్‌

నిధుల స్వాహా పర్వంలో ఎట్టకేలకు ఈఈ వెంకటప్రసాద్‌పై చర్యలు తీసుకున్నారు. విజయవాడలోని ఈఎనసీకి సరెండర్‌ చేశారు. డబ్బు స్వాహా వెనుక ఉన్న కాంట్రాక్టర్‌, అధికార పార్టీ నాయకులను వెనకేసుకొస్తారా.. లేదంటే వారిపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి.

Updated Date - 2021-10-29T05:41:54+05:30 IST