సిలబస్‌లో సమూల మార్పులు!

ABN , First Publish Date - 2020-07-07T07:50:30+05:30 IST

ఆచరణాత్మక విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సిలబ్‌సను రూపొందించడంపై రాష్ట్ర విద్యాశాఖ దృష్టి సారించింది. ఆసక్తి కలిగించేలా పాఠ్యాంశాలను రూపకల్పన చేయాలని భావిస్తోంది. తరగతి గది విద్య కంటే ఆచరణాత్మక విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా

సిలబస్‌లో సమూల మార్పులు!

హైదరాబాద్‌, జులై 6 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి సంపూర్ణ వికాసానికి దోహదం చేసేలా విద్యా విధానం ఉండాలనే వాదన విద్యావేత్తల నుంచి గత కొన్నేళ్లుగా వస్తూనే ఉంది. కరోనాతో నెలకొన్న పరిస్థితులు, విద్యా సంవత్సరం ప్రారంభంలో జాప్యం నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశంపై  విద్యాశాఖ మళ్లీ దృష్టి సారించింది. ఇప్పటికే సిద్ధమైన సిలబ్‌సను కుదించి నూతన పాఠ్యాంశాలను రూపొందించాలని భావిస్తోంది. 


ఆచరణాత్మక విద్యకి ప్రాధాన్యం

ఆచరణాత్మక విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సిలబ్‌సను రూపొందించడంపై రాష్ట్ర విద్యాశాఖ దృష్టి సారించింది. ఆసక్తి కలిగించేలా పాఠ్యాంశాలను రూపకల్పన చేయాలని భావిస్తోంది. తరగతి గది విద్య కంటే ఆచరణాత్మక విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా, బట్టీయం కాకుండా అవగాహన ఏర్పరచుకునేలా, మానసిక ఎదుగుదలకు దోహదపడేలా పాఠ్యాంశాలు ఉండాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై పాఠశాల విద్య సిలబస్‌ రూపొందించే ఎస్‌సీఈఆర్టీ సైతం కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం పాఠశాల విద్యలో అన్ని తరగతుల సిలబ్‌సను తరగతి గది బోధనకు అనుగుణంగా రూపొందించారు. అయితే పాఠశాలల ప్రారంభంలో మరింత జాప్యం జరిగితే ఇవే పాఠ్యాంశాలు ఆన్‌లైన్‌ బోధనకు అనుగుణంగా ఉండవన్న అభిప్రాయం విద్యాశాఖ అధికారుల్లో  నెలకొంది. దీంతో ఆన్‌లైన్‌ విద్యకు అనుగుణంగా సిలబ్‌స రూపొందించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.


ప్రాజెక్టులు.. ప్రాక్టికల్స్‌

అన్ని తరగతులకు ఇప్పటికే సిలబస్‌ సిద్ధంగా ఉంది. అందులో కొంతమేర కుదించి విద్యార్థులను భాగస్వామ్యం చేసేలా, వారి ఆలోచన శక్తిని పెంచేలా కొత్త పాఠాలు చేర్చాలని విద్యా శాఖ భావిస్తోంది. నైతిక విలువలు, సేవాగుణం పెంపొందించే పాఠాలు, చదవడమే కాకుండా ప్రాక్టికల్‌గా విద్యార్థులను భాగస్వామ్యం చేసేలా ప్రాజెక్ట్‌ వర్క్‌లు వంటి వాటిని కొత్త పాఠ్యాంశాల్లో చేర్చాలని అధికారులు భావిస్తున్నారు. ఇంటర్‌ మాదిరిగానే  పాఠశాల విద్యలోనూ ప్రాక్టికల్‌ మార్కులు ఇవ్వాలన్న ఆలోచనలు కూడా సాగుతున్నాయి. డిగ్రీలో మాదిరిగా లైఫ్‌ స్కిల్స్‌ పేరుతో విద్యార్థులకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వాటిని పాఠశాల విద్యలోనూ అమలు చేయాలని భావిస్తున్నారు. కొత్తతరహా విద్యా విధానానికి నాంది పలకాల్సిన అవసరం ఉందని దానికి ఇదే మంచి తరుణమని విద్యాశాఖ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

Updated Date - 2020-07-07T07:50:30+05:30 IST