అస్తవ్యస్తంగా బీమా

ABN , First Publish Date - 2022-06-26T06:09:25+05:30 IST

మండలపరిధిలో 2021 ఖరీఫ్‌ సీజనలో పంటలు సాగుచేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన వాతావరణ బీమా అస్తవ్యస్తంగా ఉంది.

అస్తవ్యస్తంగా బీమా
నల్లమాడ వ్యవసాయ కార్యాలయం





పంట నమోదు చే యించుకున్నా దక్కని బీమా 

జాబితాలో పేరున్నా ఖాతాలో జమకాని సొమ్ము

అనర్హులకు మంజూరు.. అర్హులకు మొండిచేయి

లబోదిబోమంటున్న బాధిత రైతులు 

నల్లమాడ, జూన 25: మండలపరిధిలో 2021 ఖరీఫ్‌ సీజనలో పంటలు సాగుచేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన వాతావరణ బీమా అస్తవ్యస్తంగా ఉంది. పంట సాగుచేయని రైతులకు రూ. వేలల్లో  మంజూరుకాగా, వాస్తవంగా పంట సాగుచేసి నష్టపోయిన వారికి మంజూరు కాకపోవడం విడ్డురంగా ఉంది. మొత్తం 9,100మంది రైతులు గత ఖరీఫ్‌లో పంట నమోదు (ఈక్రాప్‌ బుకింగ్‌) చేయించుకున్నారు. వారిలో  ఎనిమిది వేల మందికిపైగా రైతులకు బీమా మంజూరైనట్లు మం డల వ్యవసాయ శాఖాధికారి ఓబిరెడ్డి తెలిపారు. పరిహారం మంజూరు జాబితాలో పేరున్నా, తమ ఖాతాల్లో బీమా జమకాలేదని పలువురు రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇలా నేటిమీ బీమా సొమ్ము జమకాని రైతులు మండలంలో రెండువేలమందికి పైగా ఉన్నారు. తక్కువ విస్తీ ర్ణంలో పంటలు సాగుచేసిన రైతులకు ఎక్కువ బీమా మొత్తం పడి, ఎక్కు వ విస్తీర్ణంలో పంటలు సాగుచేసిన వారికి తక్కువబీమా సాయం అందిన దాఖలాలు అనేకమున్నాయి. బీమా అందకపోవడంపై అర్హులైన రైతులు అసహనం వ్యక్త చేస్తున్నారు. ఈక్రాప్‌ నమోదు చేయించుకున్నా, పరిహా రం జాబితాలో తమ పేర్లు గల్లంతయ్యాయని మరికొంతమంది రైతులు ఆందోళన చెందున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే జాబితా తప్పులతడకగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. వలంటీర్ల, వ్యవసాయ సహాయకులు నిర్లక్ష్యంగా ఈక్రాప్‌ బుకింగ్‌ చేసి రైతులను నట్టేట ముంచారని ఆవేదన వ్యక్త చేస్తున్నారు. బీమా జాబితా విడుదలైనప్పటి నుంచి సొమ్ము తమ ఖాతాల్లో జమ అయిందో లేదో అని బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి, జమకాని వారు వ్యవసాయాధికారుల వద్దకు తిరిగే పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. జాబితాలో పేర్లు లేని రైతులు ఆయా సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయాఽశాఖాధికారులు చెబుతు న్నారు. దీంతో రైతులు సచివాలయాలు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకుంది. ఇప్పటికైనా బీమా పడనివారికి సంబంధితాధికారులు పరిశీలించి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల రైతులు కోరుతున్నారు.

వేరుశనగ సాగుచేశా... బీమా అందలేదు -  గనరెడ్డి, రైతు, కుటాలపల్లి

నాకున్న ఆరు ఎకరాల్లో వేరుశనగ పంట సా గుచేశా. వ్యవసాయాధి కారుల వద్ద ఈక్రాప్‌ చేయించా. నాతో వేలిముద్ర వేయించుకుని, ఫొటో తీసుకున్నారు. మీపేరు మీద ఈ క్రాప్‌ నమోదు అయిందన్నారు. తీరా చూస్తే పంటల బీమా జాబితాలో నాపేరు లేదు. అధికారులను అడుగగా, తిరిగి దరఖాస్తు చేసుకోమని చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్నాను. ఈ సారి అయిన బీమా వస్తుందోరాదో చూడాలి.            

  పేరు లేని రైతులు దరఖాస్తు చేసుకోండి - ఓబిరెడ్డి, ఏఓ, నల్లమాడ 

మండలపరిధిలో 2021 ఖరీఫ్‌లో పంటలు సాగుచేసి, బీమా జాబితాలో పేర్లులేని రైతులు దరఖాస్తు చేసుకోవాలి. బీమా జాబితాలో పేర్లుండి ఖాతాల్లో డబ్బు జమకాని రైతులు ఎనపీసీఐని బ్యాంక్‌లో లింక్‌ చేయిం చుకుంటే, వారిఖాతాల్లో ఈ బీమా  జమ అవుతుంది.   

Updated Date - 2022-06-26T06:09:25+05:30 IST