అస్తవ్యస్తమైన పాఠశాల విద్య

ABN , First Publish Date - 2021-04-08T05:47:39+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలను అభివృద్థి చేస్తామని ప్రైవేటు పాఠశాలలను నియంత్రిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నది. ఈ ప్రకటనలు తప్పక ఆహ్వానించదగ్గవే...

అస్తవ్యస్తమైన పాఠశాల విద్య

ప్రభుత్వ పాఠశాలలను అభివృద్థి చేస్తామని ప్రైవేటు పాఠశాలలను నియంత్రిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నది. ఈ ప్రకటనలు తప్పక ఆహ్వానించదగ్గవే. అయితే ఆచరణలో పరిస్థితి ఉత్సాహకరంగా లేదు. ప్రైవేట్‌ను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. ప్రైవేట్ యాజమాన్యాల వారు కోవిడ్‌ను అవకాశంగా తీసుకుని ఉపాధ్యాయ సిబ్బందిని సుమారు సగానికి తగ్గించారు. మిగిలిన వారి పని భారం ఆన్‌లైన్‌లో పెరగడమేగాక వారి వేతనాలు సగానికి తగ్గించారు. ఏతావాతా యాజమాన్యాలకు జీతాల బిల్లు నాల్గవ వాటాకి తగ్గిందన్న మాట. అయితే విద్యార్థుల వద్ద వసూలు చేయవలసిన ఫీజులు 30 శాతం తగ్గించాలని ప్రభుత్వం ఇచ్చిన జి.ఓ. ఎక్కడ కూడా సరిగా అమలు జరగలేదు. ఇక ప్రైవేటు పాఠశాలల్లో విధులనుండి అర్ధాంతరంగా తొలగించబడిన ఉపాధ్యాయులు దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అటు యాజమాన్యాలుగాని ఇటు ప్రభుత్వం గాని ఎవరూ ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితులను పట్టించుకోవడం లేదు.


ప్రభుత్వ పాఠశాలలు బాగా నడవాలంటే మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థి మద్దతు చర్యలు, ఉపాధ్యాయుల నియామకం సక్రమంగా సాగాలి. మౌలిక సదుపాయాల రంగంలో చేపట్టిన మొదటి విడత చాలా మందకొడిగా సాగుతుంది. మూడు దశలు ఎప్పటికి పూర్తి అవుతాయో చెప్పడం కష్టం. ప్రధానంగా తరగతి గదుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్నత పాఠశాలలో కోవిడ్‌ నిబంధనల ప్రకారం తరగతి గదిని 30 మంది విద్యార్థులకు పరిమితం చేయడం మాట అటుంచి సాధారణంగా అమలులో ఉన్న సెక్షన్‌ గరిష్ఠ పరిమితిని 50గా అమలు చేయాలన్నా గదులు చాలడం లేదు. విద్యార్థి మద్దతు చర్యలు విషయానికి వస్తే పెరుగుతున్న పిల్లలకు అందాల్సిన పౌష్ఠికాహారం అందడం లేదు. ఉదయం ఫలహారం సాయంత్రం పాలు వంటి డిమాండ్ల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చిక్కీలు, గుడ్లతో సరిపెట్టింది. ఇంకా ముఖ్యమైనది ఉపాధ్యాయ నియామకాల విషయం. 


గత ఎన్నికలలో ప్రతి సంవత్సరం డి.యస్‌.సి. వేస్తామని ప్రకటించి అధికారంలోనికి వచ్చిన జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు క్రొత్తగా డి.యస్‌.సి.కి నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. తెలుగుదేశం ప్రభుత్వం 2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌ నియామకాలే కోర్టు కేసులతో ఇంకా పూర్తికాలేదు. 2019, 2020 సంవత్సరాలలో ఇవ్వవలసిన డి.యస్‌.సి. నోటిఫికేషన్లు ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలలో వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మధ్యనే ప్రభుత్వం చేపట్టిన పునఃకేటాయింపు (రీఅప్పార్షన్‌మెంటు)లో 30శాతం స్థానాలను బ్లాక్‌ చేయడం వలన చాలా గందరగోళం ఏర్పడింది. సీనియర్‌ ఉపాధ్యాయులకు నష్టం జరగడమేగాక, ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేని పాఠశాలలు వేల సంఖ్యలో తేలాయి. ఇప్పుడు వాటికి తాత్కాలికంగా ఇతర పాఠశాలల నుండి సర్దుబాట్లు చేస్తున్నారు. అయితే ఆ మేరకు ఇతర పాఠశాలలు నష్టపోతున్నాయి. ముందుగానే కొవిడ్‌ వలన విద్యార్ధులు ఏన్నో విలువైన బోధనా దినాలు కోల్పోయారు. సంవత్సరం చివరికి వస్తూన్నా ఇప్పటికీ పాఠశాలలకు అవసరమైన ఉపాధ్యాయులను నియమించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు.


2020 మేలో విధాన పరిషత్‌లో విద్యాశాఖా మంత్రి చేసిన ప్రకటన ప్రకారం ఆనాటికి ఉపాధ్యాయ ఖాళీలు 22 వేల పైచిలుకు. కాగా ప్రతి సంవత్సరం కనీసం 4 వేల మంది ఉపాధ్యాయులు రిటైర్‌ అవుతారు. ఇవి కాక వాలంటీర్‌ రిటైర్‌మెంట్లు, అకాల మరణాల వలన ఉపాధ్యాయ ఖాళీలు పెరుతున్నాయి. అటువంటి విషయాలను పరిగణించకపోయినా రానున్న విద్యా సంవత్సరానికి అంటే 2021 జూన్‌కి 26 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఇది ఇలా ఉండగా ఈ విద్యాసంవత్సరం కాలంలో ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు సుమారు 5.5 లక్షలు పెరిగింది. వివిధ కారణాలవలన విద్యార్థులు ప్రైవేట్ నుండి ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ అయ్యారు. సదరు 26వేల ఖాళీలకు వెంటనే నియామకం చేయకపోతే ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా దిగజారిపోతాయి.


ఇంకా, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విద్యా హక్కు చట్టానికే పరిమితమై ఆలోచిస్తుంది. కేంద్ర విద్యా హక్కు చట్టాన్ని అనుసరిస్తే మన విద్యా వ్యవస్థ బిహార్‌లాగే ఉంటుంది. అందుకే ఈ రాష్ట్రంలో విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు, విద్యారంగ ఉద్యమాలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రమాణాలు గల విద్య అందాలంటే ప్లూరల్‌ టీచర్‌ విధానాన్ని పాటిస్తూ, విద్యార్ధి ఉపాధ్యాయ నిష్పత్తిని 20:1 గా అమలు చేయాలని డిమాండు చేస్తూ వస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం ఈ డిమాండును పాక్షికంగా అమలు చేసి విద్యార్థి నమోదు 80 దాటిన 3,884 ప్రాథమిక పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా ప్రకటించి, ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయుల చొప్పున కేటాయించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ఆదర్శపాఠశాలల విధానాన్ని రద్దు చేసింది. అదిసరే. కాని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మెరుగైన విద్య అందించాలంటే విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని 20:1గా అభివృద్ధి చేయవలసిందే. ఇందుకు అదనంగా 15 లేక 16 వేల పోస్టులు అవసరం అవుతాయి. అదనంగా ఇచ్చిన పోస్టులను ఆంగ్ల బాషాబోధనకు కేటాయించవచ్చు. మొత్తంగా సుమారు 40 వేల ఉపాధ్యాయ నియామకాలకు మెగా డి.యస్‌.సి నోటిఫికేషన్‌ ఇవ్వడం ఎంతైనా అవసరం. అవసరమైన ఉపాధ్యాయులను నియమించకపోతే ప్రచారహోరు వలన ప్రయోజనం ఏమీ ఉండదు.


ఉపాధ్యాయులలో కొద్దిమంది పని దొంగలు లేరని కాదు. కానీ అత్యధిక ఉపాధ్యాయులు తమ బాధ్యతలను నెరవేరుస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలలకు కర్ణుడికి ఉన్నన్ని శాపాలు ఉన్నాయి. వసతులు పూర్తిగా ఉండవు. మెరుగైన విద్యార్హతలు గల ఉపాధ్యాయులే కాని తగినంతమంది ఉపాధ్యాయులు ఉండరు. ప్రభుత్వ పాఠశాలలే పోలింగు స్టేషన్లుగానూ, పరీక్షా కేంద్రాలుగానూ ఉండడం, ప్రభుత్వ ఉపాధ్యాయులే ఇన్విజిలేటర్లుగా, పోలింగ్‌ అధికారులుగా ఉండడం, పరీక్ష పేపర్లు దిద్దడం వంటి బోధనేతర కార్యక్రమాల వలన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యాసంగం చాలా కుంటుపడుతుంది. వీటన్నింటినీ మించి నాడు నేడు పనుల విషయంలో కూడా ఉపాధ్యాయులకు బాధ్యత పెట్టడంతో వారు రాజకీయ ఒత్తిడులకు గురవుతున్నారు. ఇప్పుడు యాప్‌లను నింపడం పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిరోజు విద్యార్థుల హాజరీని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. మధ్యాహ్న భోజనం ఎంతమంది తిన్నారు, గుడ్లు ఎంతమంది తిన్నారు అన్న గణాంకాలు కూడా ప్రతిరోజు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. మరుగు దొడ్ల నిర్వహణ కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి! ఎక్కువ నమోదు ఉన్న పాఠశాలల్లో ఈ పనిభారం ఎంత ఎక్కువగా ఉంటుందంటే కొద్దిమంది ఉపాధ్యాయులు, ప్రధానంగా ప్రధానోపాధ్యాయులు వాలంటీర్‌ రిటైర్‌మెంటు తీసుకోవాలనే ఆలోచనలో పడుతున్నారు. ఈ ఒత్తిడి కొన్ని సందర్భాలలో మరణాలకు దారితీస్తోందని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పాఠం చెప్పారా లేదా అని అడిగే వారు లేరు. యాప్‌లు నింపడమే ప్రధాన బాధ్యతగా మారిపోయింది. బోధనావ్యాసంగం అస్తవ్యస్తమయిపోయింది.


ఇప్పుడు అన్నింటినీ మించిన సమస్య సి.బి.యస్‌.ఇ సిలబస్‌ అమలు. ఇంత వరకు తరగతి గదులు లేవు, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున లేడు అనే సమస్యలు ప్రభుత్వ పాఠశాలలు ఎదుర్కొంటూ ఉన్నాయి. అయితే ఇప్పుడు కేంద్రంలో ఉన్న బి.జె.పి ప్రభుత్వం ‘జాతీయ విద్యావిధానం 2020’ రూపంలో కొత్త సమస్యను తీసుకువచ్చింది. ఈ విధానం ఒక్క మాటలో చెప్పాలంటే భారత రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా తయారు చేయబడింది. ఈ విధానంలో భాగంగానే సి.బి.యస్‌.ఇ అమలుచేసే పాఠ్య ప్రణాళికను, పాఠ్యపుస్తకాలను అన్ని రాష్ట్రాలు అమలుచేయాలని కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి పెడుతుంది. అన్ని రాష్ట్రాలు సి.బి.యస్‌.ఇ సిలబస్‌ను అమలు చేయాలని ఆదేశించే అధికారం కేంద్రానికి లేదు. విద్య ఉమ్మడి జాబితాలో ఉంది. అంతేకాదు, ‘జాతీయ విద్యావిధానం’ చట్టం కాదు, ‘చట్టానికి’ ఉండే బలం ‘విధానానికి’ ఉండదు. అందుకే అనేక రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రయోజనాల ప్రకారం వెళుతున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది. రాష్ట్ర ఫెడరల్‌ హక్కులను తాకట్టు పెడుతుంది. ఇంతకీ సి.బి.యస్‌.ఇ సిలబస్‌ను అమలు చేస్తే నష్టం ఏమిటి అని అడుగుతున్నారు. తక్షణ ప్రయోజనం తప్పితే తెలుగు రాష్ట్రాల విద్యావంతులకు మరొక విషయం పట్టదు. వారికి కొమ్ములు లేవు. సరే, ఆపైన ఊపడానికి తోక ఉంది. సి.బి.యస్‌.ఇ సిలబస్‌ మంచిదా కాదా అనేది ప్రధానమైన విషయం కాదు. కేంద్రం రాష్ట్రాలపై పాఠ్యప్రణాళికను, పాఠ్యపుస్తకాలను రుద్దవచ్చా అనేదే సమస్య. మన పాఠశాలల పాఠ్య పుస్తకాలు ఢిల్లీలో రాయిస్తే ఆ చదువులో మన జీవితం ఉంటుందా అని ఆలోచించాలిగదా!

రమేష్‌ పట్నాయక్‌

కన్వీనర్‌, ఆంధ్రప్రదేశ్‌ విద్యాపరిరక్షణ కమిటి

Updated Date - 2021-04-08T05:47:39+05:30 IST